పడకలకు.. ముడుపులు ఏమిటి?
logo
Published : 12/05/2021 03:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పడకలకు.. ముడుపులు ఏమిటి?

బాధ్యుల సస్పెన్షన్‌కు ఇన్‌ఛార్జి మంత్రి ఆదేశం
ఈనాడు, గుంటూరు

గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో(జీజీహెచ్‌) కరోనా రోగుల నుంచి డబ్బులు తీసుకుని పడకలు కేటాయిస్తున్న తీరుపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆగ్రహించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని జిల్లా పాలనాధికారిని ఆదేశించారు. ఇదే వ్యవహారంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి పేషీ యంత్రాంగం స్పందించింది. ఆస్పత్రి అధికారులను వివరాలు కోరింది. మంగళవారం ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ‘జీజీహెచ్‌లో ముడుపులిస్తే పడకలు!’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అమాత్యులు స్పందించడంతో జిల్లా ఉన్నతాధికారులు, ఆస్పత్రి ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఇప్పటికే ఎంఎన్‌ఓ బి.శ్రీనివాసరావును సస్పెండ్‌ చేశారు. సార్జంట్‌ శ్రీహరికి తాకీదు ఇచ్చి వివరణ కోరగా అతన్ని విధుల నుంచి తొలిగించాలని అధికారులు నిర్ణయించారు. ముడుపుల వ్యవహారంలో ఓ జూనియర్‌ అసిస్టెంట్‌ పాత్ర ఉన్నట్లు ఒక అంచనాకు వచ్చి అతన్ని సస్పెండ్‌ చేయడానికి దస్త్రం సిద్ధం చేశారు. మొత్తంగా ఆస్పత్రిలో పడకలకు ముడుపుల వ్యవహారం ‘ఈనాడు’ కథనంతో వెలుగులోకి రావడంతో ఇంకెంతమందిపై వేటు పడుతుందోనని ఆస్పత్రి వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఆస్పత్రికి ఎంతో చరిత్ర ఉందని, క్లిష్టతరమైన వైద్య చికిత్సలతో పేదలకు చేరువైన తరుణంలో ఇలాంటి ఉదంతాలకు తావుండకూడదని, వెంటనే ఆసుపత్రి ఉన్నతాధికారులతో సమీక్ష చేయాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు మంత్రి రంగనాథరాజు తెలిపారు. మొత్తం వ్యవహారంపై నివేదిక కోరినట్లు వెల్లడించారు. త్వరలోనే ఆసుపత్రిని సందర్శిస్తానని, పడకల కేటాయింపునకు పేషెంట్ల నుంచి ఎవరైనా డబ్బులు ఆశిస్తే ఆ ఉద్యోగుల వివరాలు తనకు తెలియజేయాలని మంత్రి కోరారు.
రంగంలోకి దిగిన   జేసీ
మంత్రి ఆదేశాల నేపథ్యంలో జిల్లా పాలనాధికారి వివేక్‌యాదవ్‌ స్పందించి వెంటనే సంయుక్త కలెక్టర్‌ ప్రశాంతిని ఆసుపత్రికి వెళ్లి సమీక్ష చేయాల్సిందిగా ఆదేశించారు. ఆమె ఆస్పత్రికి హుటాహుటిన చేరుకున్నారు. నాట్కో భవనంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌, కరోనా రోగులకు వైద్యసేవలు అందిస్తున్న పలువురు పీజీ వైద్యులు, ఇతర ఆసుపత్రి అధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికే రిఫరల్‌ ఆసుపత్రిగా ఉన్న దవాఖానాలో ఇలాంటి వ్యవహారాలు ఏమిటి? దానికి బాధ్యులెవరు? ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఈ ముడుపుల వ్యవహారం ఉందని ఆమె ఆసుపత్రి ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా కొంచెం కటువుగానే మాట్లాడారని సమీక్షలో పాల్గొన్న ఉద్యోగి ఒకరు వివరించారు. ముడుపులు తీసుకుంటున్న వ్యవహారంపై సాక్ష్యాధారాలతో వీడియోలు వస్తున్నాయి. ఇంత బరితెగింపు ఏమిటి? కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రోగుల నుంచి డబ్బులు గుంజాలనుకోవడం ఉద్యోగులకు తగదని, అందుకు బాధ్యులను వదలబోమని హెచ్చరించారు. అసలు రోగులకు ప్రవేశాలు ఎలా కల్పిస్తున్నారు? డ్యూటీ డాక్టర్‌ సంతకం లేకుండా కేస్‌ షీట్‌లో రోగి పేరు ఎలా రాస్తున్నారు? గత కొద్ది రోజుల నుంచి ఈ తరహాలో కేటాయించిన అడ్మిషన్ల వివరాలు మొత్తం బయటకు తీయాలని పీజీ వైద్యులకు సూచించారు. మొత్తంగా ఈ వ్యవహారంపై జేసీ లోతుగా ఆరా తీయడంతో ఆసుపత్రి వర్గాల్లో కలకలం రేగుతోంది. జీజీహెచ్‌ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించే ఉద్యోగులపై క్రిమినల్‌ కేసుల నమోదుకు సిఫార్సు చేస్తామని తెలిపారు. జేసీ సమీక్ష అనంతరం సూపరింటెండెంట్‌, ఆర్‌ఎంఓ తదితరులతో సమావేశమై ఇకమీదట ఆసుపత్రులో లొసుగులకు తావు లేకుండా కఠినంగా వ్యవహరించాలని ఆయా విభాగాధిపతులను ఆదేశించారు. మరోవైపు పీజీ వైద్యులను రౌండ్లకు వెళ్లినప్పుడు ఎవరైనా డబ్బులు ఇచ్చి బెడ్‌ పొందామని చెబితే వెంటనే ఆ రోగి పేరు, బెడ్‌ నంబరు, వార్డు వివరాలను తెలియజేయాలని పీజీ వైద్యులకు ఆదేశాలు అందాయి.

 

70 పడకలతో కొవిడ్‌ సంరక్షణ కేంద్రం

ఆక్సిజన్‌ సిలిండర్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, మండల రైల్వే అధికారి మోహన్‌రాజా తదితరులు.

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: రైల్‌ మహల్‌లో 70 పడకల కొవిడ్‌ సంరక్షణ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చామని జిల్లా పాలనాధికారి వివేక్‌యాదవ్‌ తెలిపారు. మండల రైల్వే అధికారి మోహన్‌రాజాతో కలిసి మంగళవారం ఈ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ సర్వజనాసుపత్రి, ఇతర ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో వ్యాధి తీవ్రత తగ్గిన అనంతరం ఈ కేంద్రానికి తరలిస్తామన్నారు. ఇక్కడ 16 ఆక్సిజన్‌ పడకలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. కరోనా బాధితుల్లో అతి స్వల్ప లక్షణాలున్నవారు(మైల్డ్‌) ఇంట్లో ఐసొలేషన్‌లో ఉంటూ చికిత్స పొందవచ్చన్నారు. వారికి ఇంట్లో సరైన సదుపాయాలు లేకపోతే ఈ కేంద్రాలకు రావాల్సిందిగా సూచించారు. వీరికోసం జిల్లా వ్యాప్తంగా 4,500 పడకలు సిద్ధంగా ఉంచామన్నారు. ఈ కేంద్రాల్లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ఈ కేంద్రంలో 40 శాతం పడకలు రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ఉద్యోగ విరమణ చేసిన వారికి కేటాయిస్తారని చెప్పారు. ఇక్కడ అవసరమైన పడకలు, విద్యుత్తు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను రైల్వే కల్పించిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాల గిరిధర్‌, జేసీలు దినేశ్‌కుమార్‌, ప్రశాంతి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభావతి, ఏడీఆర్‌ఎంలు ఆర్‌.శ్రీనివాస్‌, రామ్‌మెహర్‌ తదితరులు పాల్గొన్నారు.

కొత్తగా 1,919 కేసులు
గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: జిల్లాలో కరోనా బీభత్సం కొనసాగుతోంది. కొత్తగా 1,919 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 10 మంది కరోనాకు బలయ్యారు. దీంతో ఇప్పటివరకు 801 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 1,24,016కు చేరింది. క్రియాశీలక కేసులు 17,867కు పెరిగాయి. జిల్లాలో నమోదైన కొత్త కేసుల్లో 57.99 శాతం కేసులు గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట పరిధిలోనే వచ్చాయి. ఈ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిని అరికేట్టేందుకు మరిన్ని కట్టిడి చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌ మేరకు: అమరావతి-46, అచ్చంపేట-4, బెల్లంకొండ-2, గుంటూరు రూరల్‌-14, క్రోసూరు-4, మంగళగిరి-114, మేడికొండూరు-6, ముప్పాళ్ల-3, పెదకాకాని-57, పెదకూరపాడు-18, పెదనందిపాడు-5, ఫిరంగిపురం-16, ప్రత్తిపాడు-6, రాజుపాలెం-2, సత్తెనపల్లి-36, తాడేపల్లి-108, తాడికొండ-42, తుళ్లూరు-14, వట్టిచెరుకూరు-6, గుంటూరు-755, దాచేపల్లి-26, దుర్గి-6, గురజాల-10, కారంపూడి-8, మాచవరం-18, మాచర్ల-57, పిడుగురాళ్ల-39, రెంటచింతల-12, వెల్దుర్తి-5, బొల్లాపల్లి-3, చిలకలూరిపేట-76, యడ్లపాడు-7, ఈపూరు-7, నాదెండ్ల-23, నరసరావుపేట-60, నూజెండ్ల-21, నకరికల్లు-6, రొంపిచర్ల-23, శావల్యాపురం-3, వినుకొండ-16, అమృతలూరు-6, భట్టిప్రోలు-2, బాపట్ల-42, చేబ్రోలు-18, చెరుకుపల్లి-12, దుగ్గిరాల-8, కాకుమాను-16, కర్లపాలెం-3, కొల్లిపర-16, కొల్లూరు-9, నగరం-9, నిజాంపట్నం-8, పీవీపాలెం-2, పొన్నూరు-13, రేపల్లె-9, తెనాలి-47, చుండూరు-6, వేమూరు-9.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని