‘కమీషన్ల కోసమే పోలవరంపై కొత్త ఎత్తిపోతల’
eenadu telugu news
Published : 19/10/2021 04:02 IST

‘కమీషన్ల కోసమే పోలవరంపై కొత్త ఎత్తిపోతల’

మాట్లాడుతున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

ఆటోనగర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే బహుళార్థసాధక ప్రాజెక్టు పోలవరాన్ని వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. విజయవాడ ఆటోనగర్‌లోని తెదేపా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దేవినేని మాట్లాడుతూ ప్రాజెక్టు పూర్తయితే ప్రస్తుత విద్యుత్తు కష్టకాలంలో 960 మోగావాట్లు ఉత్పత్తి అయ్యేదని పేర్కొన్నారు. సంవత్సరానికి 2 వేల కోట్లు  ఆదాయాన్నిచ్చే పవర్‌ ప్రాజెక్టును భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు. తాము సాగునీటి అవసరాల కోసం పట్టిసీమ ఎత్తిపోతల నిర్మిస్తే, దానిని వట్టిసీమ అని విమర్శించారని, మీరు అధికారంలోకి వచ్చాక ఏం చేశారని ముఖ్యమంత్రి జగన్‌ను ప్రశ్నించారు. ప్రస్తుతం కమీషన్ల కోసం కొత్తగా  రూ.912.84 కోట్లతో మరో ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు దాని అవసరం ఏముందని, నిండు గోదావరిలో పోలవరం నిర్వాసితులను ముంచి దానిని కడతారా అని ప్రశ్నించారు. కొత్త ఎత్తిపోతలతో పోలవరం ప్రాజెక్టును 135 అడుగులకు తగ్గించి, వై.ఎస్‌.ఆర్‌. విగ్రహం పెట్టి,  టూరిజం ప్రాజెక్టుగా మార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రాల వారితో కుమ్మక్కై జూరాల ప్రాజెక్టును గాలికి వదిలేసి ముఖ్యమంత్రి, మంత్రులు మొద్దు నిద్రపోతున్నారని ఉమా మండిపడ్డారు. రానురానూ రాయలసీమ ఎడారవుతుందని, రాయలసీమ ద్రోహిగా జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. వైకాపా 29 నెలల పాలనలో సాగునీటి రంగంలో చేసిన పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ మంత్రి కన్నబాబు కబుర్లు చెబుతున్నారని, ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువులను బ్లాక్‌లో ఉంచి, అధికధరలకు అమ్ముతున్నారని వ్యాఖ్యానించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని