
సమావేశాలుఅర్థవంతం..సమస్యలకు పరిష్కారం!
‘న్యూస్‌టుడే’తో గుంతకల్లు మొదటి మున్సిపల్ కౌన్సిలర్ వంకదారు రామకృష్ణయ్య
గుంతకల్లు, న్యూస్‌టుడే: గుంతకల్లు మున్సిపాలిటీ 1948 సంవత్సరంలోనే ఏర్పాటైనా మొదటిసారి ఎన్నికలు మాత్రం 1950 సంవత్సరంలో జరిగాయి. రెండు సంవత్సరాల పాటు ఆ సమయంలో పంచాయతీ సర్పంచిగా ఉన్న తిమ్మారెడ్డిని ప్రభుత్వం మున్సిపల్ అధ్యక్షుడిగా కొనసాగించింది. మొదటి ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పట్టణానికి చెందిన వంకదారు రామృష్ణయ్య ఎన్నికయ్యారు. మొదటిసారి జరిగిన ఎన్నికల్లో కౌన్సిలర్లుగా ఎన్నికైన వారిలో అందరూ చనిపోగా.. ప్రస్తుతం ఈయన మాత్రమే జీవించి ఉన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఈయన వయసు 94 సంవత్సరాలు. ఇప్పటికీ కళ్లద్దాలను ధరించకుండా చదవగలుగుతారు. తొలితరం కౌన్సిలర్‌గా తన అనుభవాలను ‘న్యూస్‌టుడే’తో పంచుకున్నారు.
నాటి కౌన్సిల్లో కేకలు ఉండేవి కావు
కౌన్సిల్ సమావేశాల్లో ఇప్పటిలా అరుపులు, కేకలు ఉండేవి కావు. సమస్యలను సమావేశంలో క్షుణ్ణంగా చర్చించే వాళ్లం. పట్టణంలో ప్రధాన సమస్యలు ఏమిటనే విషయంగా అందరు కౌన్సిలర్లు తమ అభిప్రాయాలను తెలియజేసేవారు. ఏకాభిప్రాయంతో ముందుకు సాగేవాళ్లం. తాగునీటి సమస్య అధికంగా ఉండటంతో నీటి సమస్యను తీర్చడానికి, రోడ్లు, మురుగు కాలువలు, వీధిదీపాల ఏర్పాటుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారం. కాలనీల్లోకి వెళ్లి ప్రజలను కలుసుకొని సమస్యలను తెలుసుకునే వాళ్లం. తాగునీటి కొళాయిలను ఏర్పాటు చేయించి అవి పాడైపోకుండా ఉండేందుకు సిమెంటు దిమ్మెలను నిర్మింపజేశాం. పట్టణంలోని దిగుడు బావులు, చేద బావులు నీటిని అందించేవి. అధికారులు వారి విధులను కచ్చితంగా నిర్వహించేవారు. సమస్యలను వారి దృష్టికి తీసుకువెళితే సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేవారు. పారిశుద్ధ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. అవినీతి, అక్రమాలకు తావు ఉండేది కాదు. పనులు చాలా నాణ్యంగా ఉండేవి. అందుకే అవి పదికాలాల పాటు ప్రజలకు ఉపయోగపడ్డాయి. కౌన్సిలర్లకు పట్టణంలో మంచి గౌరవం లభించేది. మొదటి పురపాలక ఎన్నికల్లో విజయం సాధించి పనిచేసినందుకు గర్వంగా ఉంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వారు పార్టీలు, పంతాలను పక్కనపెట్టి పట్టణ అభివృద్ధికి పాటుపడి మంచి పేరు తెచ్చుకోవాలి.