దుగ్గిరాలలో తెదేపాకు ఆధిక్యం
eenadu telugu news
Published : 20/09/2021 02:37 IST

దుగ్గిరాలలో తెదేపాకు ఆధిక్యం

ఈనాడు, అమరావతి : తెదేపా అధిష్ఠానం ఎన్నికలను బహిష్కరించినప్పటికీ దుగ్గిరాల మండలంలో తెదేపా అభ్యర్థులు పోటీలో నిలిచారు. అక్కడ అధికార పార్టీకి దీటైన పోటీ ఇవ్వడంతో పాటు మెజారిటీ స్థానాలు కైవసం చేసుకున్నారు. మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలు ఉండగా తెదేపా 9, వైకాపా 8, జనసేన 1 స్థానం గెలుపొందాయి. తెదేపాకు మెజారిటీ స్థానాలు దక్కించుకున్నట్లయింది. జనసేన మద్దతు కూడా ఇక్కడ కీలకం కానుంది. మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల మండలాలు ఉన్నాయి. తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని గ్రామీణ ప్రాంతాలు మున్సిపాలిటీలో విలీనం చేయడంతో అక్కడ ఎన్నికలు నిర్వహించలేదు. దుగ్గిరాల మండలంలో మాత్రమే ఎన్నికలు జరిగాయి. స్థానికంగా చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా తెదేపా తరఫున పోటీ చేసిన అభ్యర్థులు దీటుగా నిలవడంతో పోటీ ప్రతిష్ఠాత్మకంగా మారింది. మంగళగిరి నియోజకవర్గం నుంచి 2019 సాధారణ ఎన్నికల్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక్కడి నుంచి వైకాపా తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ క్రమంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోరు కూడా నువ్వానేనా అన్నట్లు సాగింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని