Stock market: నష్టాల్లో సూచీలు.. 383 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 383 పాయింట్లు, నిఫ్టీ 140 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.

Published : 07 May 2024 16:17 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నా.. సూచీలు గరిష్ఠ స్థాయిలకు చేరడంతో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ కౌంటర్లలో అమ్మకాలు సూచీలను పడేశాయి. ఓ దశలో 600 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్‌.. తర్వాత కాస్త కోలుకుంది. నిఫ్టీ 22,300 స్థాయికి చేరింది.

సెన్సెక్స్ ఉదయం 73,973.30 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైన కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 73,259.26 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో కోలుకుని 383.69 పాయింట్ల నష్టంతో 73,511.85 వద్ద ముగిసింది. నిఫ్టీ 140.69 పాయింట్ల నష్టంతో 22,302.50 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.52గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ చమురు ధర 83.16 డాలర్లు వద్ద కొనసాగుతోంది.

సెన్సెక్స్‌లో పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. హిందుస్థాన్‌ యూనిలీవర్‌, టెక్‌ మహీంద్రా, నెస్లే ఇండియా, టీసీఎస్‌, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లలో సియోల్‌, టోక్యో, షాంఘై రాణించగా.. హాంకాంగ్‌ మార్కెట్లు నష్టపోయాయి. యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని