TS News: ఆమె కాదన్నదని కాల్చేసుకున్నాడు!
eenadu telugu news
Published : 27/07/2021 07:55 IST

TS News: ఆమె కాదన్నదని కాల్చేసుకున్నాడు!

వివాహిత ఇంటి ఎదుట వ్యక్తి ఆత్మాహుతి

నారాయణగూడ, న్యూస్‌టుడే: ‘ఇద్దరం ప్రేమించుకున్నాం.. కొంతకాలం కలిసి ఉన్నాం, ఒక్కసారిగా ఇప్పుడు నన్ను కాదంటోంది..’ అంటూ ఓ వ్యక్తి ప్రేమించిన మహిళ ఇంటి ముందే నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నారాయణగూడ సీఐ భూపతి గట్టుమల్లు వివరాల ప్రకారం.. నాగోల్‌ వాసి సురేశ్‌(35) హిమాయత్‌నగర్‌ ఓ జిరాక్స్‌ సెంటర్‌లో పని చేస్తున్నాడు. అక్కడే మరో సంస్థలో యాదవ గల్లీకి చెందిన ఓ మహిళ పని చేస్తోంది. ఆమె భర్తకు దూరంగా ఒంటరిగా ఉంటోంది. ముగ్గురు పిల్లలున్నారు. సురేశ్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఏడు నెలలు కలిసిమెలిసి తిరిగారు. ఇటీవల ఆ మహిళ మళ్లీ తన భర్త వద్దకు వెళ్లింది. ఆమె కోసం సురేశ్‌ భార్యతో గొడవ పడ్డాడు. ప్రేమించిన మహిళకు మూడు నాలుగు రోజులుగా ఫోన్‌ చేస్తుంటే మాట్లాడటం లేదు. ప్రస్తుతం కుటుంబంతో నేను ఆనందంగా ఉన్నా.. మన సంబంధాన్ని ఇంతటితో ఆపేద్దామని ఆమె చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో మద్యం మత్తులో ఆమె ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. స్థానికులు నచ్చజెప్పి పంపించేశారు. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో పెట్రోల్‌ సీసాతో వెళ్లి మళ్లీ తలుపు తట్టాడు. నీ కోసం చచ్చిపోతానంటూ ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకోవడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న నారాయణగూడ పోలీసులు అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షలో అతనికి కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. విషయాన్ని భార్యకు చెప్పగా, తొలుత రానని చెప్పినా.. పోలీసుల మాట గౌరవించి వచ్చి సేవలందించింది. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం కన్నుమూయడంతో కన్నీరుమున్నీరైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని