వలసబాట...ఉపాధికి వెతుకులాట !
eenadu telugu news
Published : 22/10/2021 04:35 IST

వలసబాట...ఉపాధికి వెతుకులాట !

అభివృద్ధికి ఆమడ దూరంలో బద్వేలు నియోజకవర్గం

భాకరాపేట- గిద్దలూరు రైల్వేలైన్‌ ఏర్పాటుకు రిక్తహస్తం

రహదారులపై ప్రయాణించాలంటే హడలిపోవాల్సిందే

- ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, అట్లూరు, బద్వేలు

వేమలూరు వంతెనపై అటుఇటైతే ప్రమాదమే(దాచిన చిత్రం)

బద్వేలు శాసనసభ నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఇక్కడి ప్రజలకు వేరే దిక్కులేక జీవనాధారం కోసం గత కొన్నేళ్లుగా చాలామంది ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. పాలకులు మారుతున్నా ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరడంలేదు. తాజాగా బద్వేలు స్థానానికి ఉపఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఈసారి ఎమ్మెల్యేగా గెలిచేవారైనా స్థానిక సమస్యలపై దృష్టిసారించాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

చెప్పుల తయారీ పరిశ్రమ ఏర్పాటు కాలేదు... : బద్వేలు నియోజకవర్గంలో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ పెద్ద పరిశ్రమ ఒకటి కూడా ఏర్పాటు కాలేదు. ఫలితంగా ఏడు మండలాలకు చెందిన సుమారు 15 వేల మందికిపైగా ఉపాధిని వెతుక్కుంటూ గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు వేలాది మంది వలసబాట పట్టారు. గతంలో అట్లూరు మండలంలో చెప్పుల తయారీ పరిశ్రమను ఏర్పాటుచేయాలని ఆలోచించినా కార్యరూపం దాల్చలేదు. నియోజకవర్గ పరిధిలో పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చొరవ చూపితే స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయి.

సోమశిల... నిర్వాసితుల విలవిల

సోమశిల జలాశయం కింద ముంపునకు గురైన అట్లూరు మండలం చింతువాండ్లపల్లె, ఆకుతోటపల్లె గ్రామాల ప్రజలకు ఇంతవరకు పరిహారం ఇవ్వకుండా నడుంలోతున ముంచేశారు. పరిహారం కోసం ఆయా గ్రామాల ప్రజలు ఏళ్లతరబడి ఎదురుచూస్తున్నారు. సోమశిల ముంపు బాధితులైన ఎస్సీలకు 860 పక్కాగృహాలతో 1998లో ఎస్‌.వెంకటాపురంలో పునరావాసం కల్పించారు. ఈ గృహాలన్నీ వర్షం కురిస్తే కారి పోతున్నాయి. పక్కాగృహాలకు పైకప్పు నిర్మించాలన్న ప్రతిపాదన 15 ఏళ్లుగా ఉన్నా పాలకులు పట్టించుకోలేదు. వేములూరు వంతెనపై సోమశిల వెనుక జలాలు చేరి 26 గ్రామాలకు దారి లేకుండా చేస్తోంది. మండల కేంద్రానికి స్థానికులు నడుంలోతు నీటిలో ప్రమాదకర ప్రయాణం సాగిస్తున్నారు. వెంటనే వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అరకొర పరిహారంతో బయటకు వచ్చిన వరికుంట ఎస్సీ కాలనీల ముంపువాసులకు అధికారులు పునరావాసాన్ని మరిచారు. స్థానిక క్రాస్‌రోడ్డులో స్థలాలిచ్చారు గానీ అక్కడ మౌలిక వసతులు కల్పించకపోవడంతో నిర్వాసితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కలసపాడు మండలపరిధిలో అతిపెద్ద చెరువు రాచ్చెరువుకు వెలుగొండ ప్రాజెక్టు నుంచి నీరందిస్తే కలసపాడు, కాశినాయన, పోరుమామిళ్ల మండలాల్లో శాశ్వతంగా సాగునీరు, తాగునీరు సమస్యలు పరిష్కార మయ్యే అవకాశం ఉంది. దీని ద్వారా 15 వేల నుంచి 20 వేల ఎకరాలకు సాగునీరందించాలని కొన్నేళ్లుగా ప్రతిపాదనలున్నా అమలుకు నోచుకోవడంలేదు.


బద్వేలు పట్టణంలోని విద్యానగర్‌లో అధ్వాన మార్గం

గతకొన్నేళ్లుగా నిరాశే...

నియోజకవర్గంలోని రైతులు, వ్యాపారులు సరకులు, ఇతర వస్తువుల రవాణాకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌, చెన్నై లాంటి దూరప్రాంతాలకు ప్రజలు రైలులో ప్రయాణించడానికి అనువైన పరిస్థితి లేదు. సిద్దవటం మండలం భాకరాపేట నుంచి బద్వేలు మీదుగా గిద్దలూరు వరకు కొత్త రైల్వేలైన్‌ ఏర్పాటు ప్రతిపాదన చాలా ఏళ్లుగా కాగితాలకే పరిమితమైంది. దీని నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి విన్నవించినా ఫలితం లేకుండాపోయింది. గత కొన్నేళ్లుగా కేంద్ర రైల్వే బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టు ఆమోదానికి నోచుకోకపోవడంతో ప్రజలు నిరాశ చెందు తున్నారు.

మౌలిక వసతులు కరవు...

బద్వేలు పట్టణ పరిధిలో రహదారులు, మురుగు కాలువలు అధ్వానంగా ఉన్నాయి. సుమారు 20 ఏళ్ల కిందట నిర్మించినవి కావడంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాటికి అడపాదడపా మరమ్మతులు చేసినా ఉపయోగం ఉండడంలేదని స్థానికులు వాపోతున్నారు. నియోజకవర్గ పరిధిలోని మిగతా ప్రాంతాల్లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. అట్లూరు మండలం చినరాచపల్లె వాసులు దారిని బాగుచేయక పోతే ఉప ఎన్నికలను బహిష్కరిస్తామని బ్యానరు ఏర్పాటు చేయడం గమనార్హం. కలసపాడు మండలం సిద్దమూర్తిపల్లె-ముదిరెడ్డిపల్లెకు వెళ్లే రహదారి 8 కిలోమీటర్ల పొడవునా పలుచోట్ల దెబ్బతింది. వీటిని కొన్ని ఉదాహరణలుగా చెప్పుకోవచ్ఛు ఈ ఏడాదిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బద్వేలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. ఇందులో రహదారులు, మురుగుకాలువ నిర్మాణపనులు కూడా ఉన్నాయి. వీటి పనులను పరుగులు పెట్టించి ప్రజలకు మౌలిక వసతులను కల్పించాల్సి అవసరం ఎంతైనా ఉంది.

బద్వేలు పట్టణంలోని త్యాగరాజకాలనీలో గోతులమయంగా రహదారి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని