వేలిముద్రల్లోవెనుకంజ !
eenadu telugu news
Published : 22/10/2021 04:35 IST

వేలిముద్రల్లోవెనుకంజ !

నమోదులో జిల్లాది ఎనిమిదో స్థానం

బయోమెట్రిక్‌కు 45,287 మంది దూరం

జిల్లాలో జగనన్న విద్యా కానుక నిర్వహణ తీరు

వొేలిముద్రను నమోదు చేస్తున్న సీఆర్పీ

- న్యూస్‌టుడే, కడప రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జగనన్న విద్యా కానుక’ పథకంలో సామగ్రి అందిన అనంతరం ధ్రువీకరణకు వేలిముద్ర అనుసంధానం చేయడంలో జిల్లా వెనుకబడింది. యాప్‌ రూపకల్పనలో జాప్యం, నమోదులో ఎదురయ్యే సాంకేతిక లోపాలు, అంతర్జాలం సమస్య, బయోమెట్రిక్‌ యంత్ర పరికరాల కొరత, మొరాయింపు, అందుబాటులో లేని తల్లిదండ్రులు, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపం.. వెరసి జిల్లా ఎనిమిదో స్థానంలో నిలిచింది.

జిల్లాలో 3,373 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న 2,70,082 మంది పిల్లలు ‘జగనన్న విద్యా కానుక సామగ్రి’ పొందటానికి అర్హులుగా నిర్ధారించారు. ప్రాథమిక బడుల్లో 1 నుంచి 5 తరగతుల వరకు చదువుతున్న వారికి ఒక సంచి, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, మూడు జతల ఏకరూప దుస్తులు, బెల్టు, పాఠ్య పుస్తకాలు, నిఘంటువు అందజేశారు. అనంతరం 6 నుంచి 10 తరగతుల వరకు అదనంగా రాత పుస్తకాలు ఇచ్చారు. కొవిడ్‌ ప్రభావం తగ్గుముఖం పట్టిన అనంతరం ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీ నుంచి పాఠశాలలను తెరిచారు. సమగ్ర శిక్ష శాఖ నుంచి పాఠశాలల సముదాయాలకు ముందస్తుగా జేవీకే సామగ్రి పంపించారు. అక్కడ నుంచి ఉపాధ్యాయులు, సీఆర్పీలు వాటిని బడికి తీసుకెళ్లారు. వచ్చిన వాటిని విద్యార్థులకు అందజేశారు. కిట్టు అందించకుండా ఇచ్చినట్లు క్షేత్రస్థాయిలో దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని, ఇలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకుండా పారదర్శకతకు పెద్దపీట వేయాలని ఉన్నతాధికారులు భావించారు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు, పిల్లల ఆధార్‌ సంఖ్య నవీకరిస్తే బయోమెట్రిక్‌ విధానంలో ధ్రువీకరణ చేయించాలని ఉత్తర్వులిచ్చారు. జిల్లాలో మాత్రం ఈ నెల 21వ తేదీ వరకు 2,24,785 మంది (83.23 శాతం) వేలిముద్రలను అనుసంధానం చేశారు. ఇంకా 45,287 (16.77 శాతం) మంది ఇంకా వేయలేదు. ఈ విషయంలో జిల్లా ఎనిమిదో స్థానంలో నిలిచింది. గుంటూరు జిల్లా 88.90, తూర్పు గోదావరి 88.44, చిత్తూరు 88.34, కృష్ణ 87.35, పశ్చిమ గోదావరి 84.31, కర్నూలు 84.13, నెల్లూరు 83.56 శాతం పురోగతి సాధించి ముందు వరుసలో నిలిచాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల మండలం జిల్లాలోనే చివరి స్థానంలో ఉంది. మండలంలో 7,177 మంది ఉండగా 5,237 మంది (72.97 శాతం) మంది వేశారు. ఇంకా 1,940 మందితో నిర్ధారణ చేయించాల్సి ఉంది. చక్రాయపేటలో 3,450 మందికి 3,199 మంది (92.72 శాతం)తో అగ్రస్థానంలో నిలిచింది. ఏ మండలంలోనూ 93 శాతం మించి ప్రగతి సాధించలేదు. ఇంకా 80 శాతం లోపు 8 మండలాలు ఉన్నాయి. జేవీకే సామగ్రి అందజేసిన అనంతరం ఆయా మండలాల్లోని ఎంఈవోలు, పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు ద్వారా బయోమెట్రిక్‌ వేయించాల్సి ఉంది. కాకపోతే ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో నమోదు చేయడానికి తొలుత సాంకేతిక లోపాలు ఎదురయ్యాయి. పైగా సరిపడా డీవైజ్‌లు లేవు. ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ తగినన్ని యంత్రాలు అందుబాటులో లేవు. మరికొన్ని ఉన్నప్పటికీ పనిచేయలేదు. పైగా గ్రామ, వార్డు వాలంటీర్లకు చెందినవి తాత్కాలికంగా సర్దుబాటు చేసినా ఇంకా వేగవంతం కాలేదు.

వేగవంతం చేయాలని ఆదేశించాం

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు జగనన్న విద్యా కానుక సామగ్రి అందజేశాం. ప్రతి విద్యార్థికి అందినట్లు పారదర్శకతకు ధ్రువీకరణ నిమిత్తం తల్లిదండ్రులు, సంరక్షకులు, పిల్లల వేలిముద్రలను తీసుకొని ఆధార్‌ సంఖ్యతో అనుసంధానం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. బయోమెట్రిక్‌ విధానాన్ని వేగవంతం చేయాలని ఇప్పటికే ఆయా మండలాల ఎంఈవోలు, హెచ్‌ఎంలు, సీఆర్పీలను ఆదేశించాం. జిల్లాలో 83.23 శాతం నమోదు చేశారు. మిగతా వారి నుంచి త్వరలో తీసుకుని వంద శాతం ప్రగతి సాధిస్తాం. - డాక్టరు అంబవరం ప్రభాకర్‌రెడ్డి, ఏపీసీ, సమగ్ర శిక్ష, కడప

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని