Published : 22/01/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సాహిత్య హేల.. సేవల్లో భళా

 తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు కేవీ రమణాచార్యులతో సన్మానం

నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదలతో ఉన్నత చదువులు చదివి సాహిత్యంపై ఉన్న మక్కువతో ఎన్నో రచనలు చేశారు. జానపద సాహిత్యం, ఆధ్యాత్మిక రచనలు చేసి ఎంతోమంది నుంచి ప్రశంసలు, సన్మానాలు, పురస్కారాలు పొందారు. మరోవైపు పాఠశాలలు, పేదవిద్యార్థులకు సాయం అందిస్తూ సమాజ సేవలోనూ ముందుకు సాగుతున్నారు. కోవెలకుంట్ల మండలంలోని గుల్లదుర్తి గ్రామానికి చెందిన రచయిత రామాచార్యులపై ప్రత్యేక కథనం.
- న్యూస్‌టుడే, కోవెలకుంట్ల

రచనలు, పురస్కారాలు
రామాచార్యులు జానపద కళారూపం, గొరవయ్యల నృత్యంపై ప్రత్యేక పరిశోధన, ప్రాజెక్టు, డాక్యుమెంటేషన్‌ చేశారు. గొరవయ్యల ఆచార వ్యవహారాలు, ధార్మిక, సాహిత్య సేకరణపై పరిశోధించి రచనలు చేశారు. జాతీయ సదస్సుల్లో పాల్గొని 40 పైగా పత్రసమర్పణ చేశారు. తెలుగు సామెతలు- మానవ స్వభావం, జానపద నృత్యకళ-గొరవ సంప్రదాయం, శిష్టసాహిత్యంలో జానపద విజ్ఞాన ధోరణులు, జానపద గేయాలు, తెలుగు కావ్యాల్లో గిరిజన సంస్కృతి, వివేకా వాణీశతకం, అడుగుజాడలు, మాతృవందనం, జానపద విజ్ఞాన వ్యాసావళి, శ్రీవెంకటాద్రీశ శతకం, రామచంద్రశతకం, మనకర్తవ్యం, భక్తి-జీవన్ముక్తి వంటి 19 రకాల జానపద, ఆధ్యాత్మిక రచనలు చేసి పుస్తకరూపంలో అందించారు. ప్రముఖ కవి, సినీ గేయరచయిత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి చేతుల మీదుగా పుస్తకావిష్కరణలు చేసి ఆయనతో సత్కారాలు పొందారు. ఔ
సేవా కార్యక్రమాలు..
ఆచార్య బి.రామరాజు జానపద విజ్ఞాన బహుమతి, చిన్నపిల్లలను మార్గదర్శనం చేసేలా రచించిన అడుగుజాడలు పుస్తకానికి ఆంధ్రప్రదేశ్‌ క్షత్రియ సంఘం తరఫున పురస్కారం, ఆంధ్రప్రదేశ్‌ జానపద సాహిత్య పరిషత్తు పురస్కారం, సుబ్బారావుపేట జానపద యువకళాకారుల సంఘం నుంచి, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు, సాంస్కృతిక మండలి చైర్మన్‌ కేవీ రమణాచార్యుల చేతులమీదుగా సన్మానాలు, పురస్కారాలు అందుకున్నారు. తనకున్న విద్యను పదిమందికి అందేలా చేసేందుకు పాఠశాలలు, కళాశాలల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించారు. చదువుకునేందుకు ఆ ప్రాంత పరిస్థితులు, పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్వపు విద్యార్థుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. వారి సహకారంతో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో పేదవిద్యార్థులకు ఏటా పుస్తకాలు అందజేస్తున్నారు. విద్యావాలంటీరును ఏర్పాటు చేశారు. ఉన్నత పాఠశాలకు 12 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసి అదనపు గది, మరుగుదొడ్లు నిర్మించారు. సరస్వతీ విగ్రహం ఏర్పాటు, బల్లలు, శుద్ధజల శీతల యంత్రం వంటి అనేక వసతుల ఏర్పాటుకు కృషి చేశారు.

కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం 
రామాచార్యులు తల్లిదండ్రులు తిరుమల్లమ్మ, రాఘవాచార్యులు. వీరిది నిరుపేద కుటుంబం. రామాచార్యులు తన పాఠశాల విద్యను స్వగ్రామంలోనే పూర్తిచేశారు. తెలుగు, సంస్కృతంలో ఎంఏ చదివారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి ‘తెలుగు సామెతలు, మానవ స్వభావం’ అనే అంశంపై ఎంఫిల్‌ చేశారు. జానపద నృత్యకళ, గొరవయ్యలపై పీహెచ్‌డీ చేశారు. హైదరాబాద్‌లోని జి.పుల్లారెడ్డి జూనియర్‌ కళాశాల, ఎం.ఎన్‌.రాజు కళాశాల, దూరవిద్యకు సంబంధించి అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో ఆంధ్రోపన్యాసకుడిగా పనిచేశారు. ఈ వృత్తిని వదిలేసి 2012 నుంచి 2017 వరకు తితిదేలోని వేటూరి ప్రభాకరశాస్త్రి వాజ్మయపీఠంలో సమన్వయకర్తగా పనిచేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని