అభివృద్ధి అంతంతే
eenadu telugu news
Updated : 19/10/2021 06:16 IST

అభివృద్ధి అంతంతే

ఫార్మా ఎగుమతుల్లో నల్గొండ రెండో స్థానం
సామాజిక, ఆర్థిక నివేదిక-2021లో వెల్లడి

  -ఈనాడు, నల్గొండ

రాష్ట్రంలో అత్యధికంగా వరి సాగు చేసే జిల్లాల్లో పెద్దపల్లి తర్వాత సూర్యాపేట జిల్లా రెండో స్థానంలో నిలిచింది. మొత్తం ఫార్మా ఎగుమతుల్లో 18 శాతంతో రంగారెడ్డి జిల్లా తర్వాత నల్గొండ జిల్లా రెండో స్థానంలో ఉండటం విశేషం. ఆర్థికాభివృద్ధితో పాటు పారిశ్రామికీకరణ, అడవుల విస్తీర్ణం, తక్కువ బరువు ఉన్న చిన్నారులు, ఎకరానికి ఎడపెడా ఎరువుల వినియోగం విషయాల్లో మూడు జిల్లాలు అట్టడుగునే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక పురోగమనం, జిల్లాల పరిస్థితిపై సామాజిక, ఆర్థిక ఔట్‌లుక్‌ - 2021 పేరుతో రాష్ట్ర ప్రణాళిక శాఖ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది.  

వరి సాగులో సూర్యాపేట భేష్‌
రాష్ట్రంలో మొత్తం ఉన్న సాగు భూమిలో వరి 45 శాతం సాగవుతుండగా... సూర్యాపేట జిల్లాలోని మొత్తం విస్తీర్ణంలో 74 శాతం వరి సాగు చేస్తున్నారు. ఇది రాష్ట్రంలోనే రెండో స్థానం. నల్గొండలో 48.6 శాతం విస్తీర్ణంలో, యాదాద్రిలో 59.3 శాతం వరి
సాగవుతున్నట్లు నివేదిక వెల్లడించింది.

జిల్లా          వరి సాగవుతున్న శాతం     రాష్ట్రంలో స్థానం
నల్గొండ             48.6                 16
సూర్యాపేట          74.0                 02
యాదాద్రి             59.3                 09


అత్యధిక వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు
ఉమ్మడి జిల్లాల వారీగా పోలిస్తే నల్గొండ జిల్లాలోనే వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నాయి.


రైతు సగటు భూమి 2.5 ఎకరాలు
రైతుల వద్ద ఉన్న సగటు భూమి రాష్ట్రంలో 2.5 ఎకరాలు ఉండగా, మూడు జిల్లాల్లోనూ సగటు ఎక్కువగా ఉంది, యాదాద్రిలో రైతుల వద్ద ఉన్న సగటు భూమి 3 ఎకరాలు కాగా, నల్గొండలో 2.8 ఎకరాలు, సూర్యాపేటలో 2.5 ఎకరాలు ఉండటం విశేషం.


అటవీ విస్తీర్ణంలో అట్టడుగు
ఒక పక్క తెలంగాణకు హరితహారం అని ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో మాత్రం అటవీ విస్తీర్ణం పెరగడం లేదు. ఉమ్మడి జిల్లాల్లో నల్గొండ లోనే అతి తక్కువగా అడవులు ఉన్నాయని సీఎం కేసీఆర్‌ హరితహారం పథకాన్ని నల్గొండ నుంచే ప్రారంభించారు. రాష్ట్రంలో 24 శాతం మేర అడవులు విస్తరించి ఉండగా, అది నల్గొండలో 9 శాతం, సూర్యాపేటలో 3.5, యాదాద్రిలో 3.6 శాతం మేర మాత్రమే అడవులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో ఈ మూడు జిల్లాలు అతి తక్కువ అటవీ విస్తీర్ణమున్న జిల్లాలుగా నిలిచాయి.

జిల్లా         అటవీశాతం         రాష్ట్రంలో స్థానం
నల్గొండ         9.0               19
సూర్యాపేట     3.5                27
యాదాద్రి       3.6                 26


ఎరువుల వినియోగంలోనూ నియంత్రణ
రాష్ట్రంలోనే వరి సాగు ఇక్కడే ఎక్కువగా ఉండటంతో ఎరువుల వినియోగం భారీ స్థాయిలోనే ఉంది. రాష్ట్ర సగటు ఎకరానికి 177 కిలోల కంటే సూర్యాపేట జిల్లాలో 184 కిలోలుండగా, నల్గొండలో 152 కిలోలు, యాదాద్రిలో 104 కిలోల వినియోగం ఉంది.

జిల్లా           ఎరువుల వినియోగం    స్థానం
నల్గొండ             152              19
సూర్యాపేట          184              13
యాదాద్రి            104               27


పారిశ్రామికంగా వెనుకడుగే
రాజధానికి ఆనుకొని, రహదారి, రైలు, విమానయాన మార్గాలు అందుబాటులో ఉన్నా తెలంగాణ వచ్చిన ఈ ఏడేళ్లలో మూడు జిల్లాలు పారిశ్రామికంగా అభివృద్ధికి నోచుకోలేదు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న టీఎస్‌ ఐపాస్‌ ద్వారానూ ఆశించినంత మేర యూనిట్లు ఏర్పాటు కాలేదు. దామరచర్లలో భూతల ఓడరేవు (డ్రైపోర్టు), ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్న హామీలు ఇప్పటి వరకు నెరవేరలేదు.

జిల్లా                స్థాపించిన యూనిట్లు           వచ్చిన పెట్టుబడి (రూ.కోట్లలో)        లభించిన ఉపాధి
నల్గొండ                  389                           27,061                           12,235
సూర్యాపేట               193                           3,046                            5,638
యాదాద్రి                  364                           3,983                           12,930


యాదాద్రిలో ఎక్కువ మంది సర్కారు బడి పిల్లలు
జిల్లాలో మొత్తం ఎన్‌రోల్‌మెంట్‌ అయిన విద్యార్థుల్లో ప్రభుత్వ బడుల్లో చేరుతున్న వారు యాదాద్రి జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. కొత్తగా బడుల్లో చేరుతున్న విద్యార్థుల్లో యాదాద్రి జిల్లాలో 54.9 శాతం సర్కారు బడిలో చేరగా, అది నల్గొండలో 53.6 శాతం, సూర్యాపేటలో 51.6 శాతంగా ఉంది.


నల్గొండలో ఎక్కువ కరోనా కేసులు  
పది లక్షల మందిలో నల్గొండ జిల్లాలో 7736 మందికి కరోనా రాగా, సూర్యాపేటలో 6491 మంది, యాదాద్రిలో 5372 మందికి కొవిడ్‌ సోకింది.


ఉపాధి హామీ
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో మూడు జిల్లాల ప్రగతి అంతంత మాత్రంగానే ఉంది. నల్గొండలో  23.6 శాతం, సూర్యాపేటలో 28.6 శాతం, యాదాద్రిలో 15.3 శాతం మందికి ఉపాధి హామీ పథకంలో కూలీ లభిస్తోంది.
ఇప్పటికీ ఎక్కువ మంది గ్రామాల్లోనే సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలో ప్రపంచమంతా వేగంగా పట్టణీకరణ విస్తరిస్తుండగా, ఉమ్మడి జిల్లాలో అది తక్కువగానే ఉంది. రాష్ట్రంలో పట్టణాల్లో నివసిస్తున్న వారు 38.9 శాతం మంది ఉండగా, నల్గొండలో 22.8 శాతం, సూర్యాపేటలో 15.6, యాదాద్రిలో 16 శాతం మంది మాత్రమే పట్టణాల్లో నివసిస్తున్నారు.


బరువు తక్కువ చిన్నారులు
మూడు జిల్లాల్లోనూ బరువు తక్కువున్న చిన్నారులు అధిక సంఖ్యలోనే ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. నల్గొండలో 28 శాతం, యాదాద్రిలో 27. శాతం, సూర్యాపేటలో 30.1 శాతం ఐదేళ్లలోపు చిన్నారుల్లో ఈ సమస్య ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని