Published : 12/04/2021 03:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గుర్తింపు ఘనం.. ప్రోత్సాహం శూన్యం

అంకుడు కర్ర కొరతతో ఇబ్బంది

ఎలమంచిలి, న్యూస్‌టుడే


లక్కబొమ్మలు తయారు చేస్తున్న కళాకారులు

జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో ఏటికొప్పాక హస్త కళాకారుల కష్టాలు తీరుస్తామన్న ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖాలు చాటేశారు. అంత చేస్తాం.. ఇంత చేస్తామని అంకుడు కర్ర డిపోను రెండు రోజులకే ఎత్తేశారు. ఫలితంగా ముడి సరకు లభ్యంకాక కళాకారులు ఇబ్బందులు పడుతున్నారు.
లక్కబొమ్మల పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చేది ఏటికొప్పాకే. ఇక్కడి కళాకారులు తయారు చేసిన బొమ్మలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆన్‌లైన్‌లో అంతర్జాతీయంగా ప్రస్తుతం ఈ బొమ్మల అమ్మకాలు జరుగుతున్నాయి. స్థానికంగా ఈ వృత్తిపై ఆధారపడి 250 కిపైగా కుటుంబాలు జీవిస్తున్నాయి. పరోక్షంగా వెయ్యి మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. ఇంతటి ప్రాధాన్యమున్న బొమ్మల తయారీకి ప్రధాన ముడి సరకైన అంకుడు కర్రకు కొరత ఏర్పడింది. సమస్యను పరిష్కరించేందుకు 1998లో అప్పటి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు అటవీ శాఖ అధికారులతో మాట్లాడి డిపో ఏర్పాటు చేయించారు. అటవీ శాఖ సిబ్బందిని నియమించారు. ఇతర రాష్ట్రాల్లో పుష్కలంగా లభ్యమవుతున్న అంకుడు కర్రను దిగుమతి చేసుకుని కళాకారులకు ముడి సరకు కొరత తలెత్తకుండా చేస్తామన్న అధికారులు డిపో ప్రారంభించిన మూడు రోజులకే మూసేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు తెరిచేందుకు చేపట్టిన చర్యలు శూన్యం. అంకుడు కర్రపై నిషేధాన్ని ఎత్తివేయకపోవడంతో కళాకారుల కష్టాలు మొదటికొచ్చాయి.

అందంగా రూపుదిద్దుకున్న లక్కబొమ్మలు

మోపు రూ.1600
కర్ర కొనేందుకు కళాకారులు పడరాని పాట్లు పడుతున్నారు. గతంలో మోపు కర్రలు రూ.500 ఉండగా ఇప్పుడు వీటి ధర రూ.1600 కు పెరిగింది. నాణ్యమైన కర్ర దొరకడం లేదు. ఏటికొప్పాక పరిసర ప్రాంతాల్లో ఈ కర్ర నిల్వలు అయిపోవడంతో అటవీ ప్రాంతంలో చాలా దూరం వెళ్లి కర్ర తీసుకురావాల్సి రావడంతో కూలీలు ఎక్కువ ధర చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతంలో ఈ కర్ర నిల్వలు అధికంగా ఉన్నాయి. అక్కడ వీటిని వంట చెరకుగా వాడతారు. అక్కడి నుంచి కర్రను తెప్పించి కళాకారులకు తక్కువ ధరకు అందజేయవచ్చు. ఈ ఉద్దేశంతోనే అప్పట్లో ఏటికొప్పాకలో డిపోను ఏర్పాటు చేశారు. అధికారులు పెద్దగా దృష్టిసారించకపోవడంతో డిపో మూతపడింది.

చాలా ఇబ్బంది పడుతున్నాం

- బీవీ రత్నం, హస్త కళాకారురాలు, ఏటికొప్పాక
అంకుడు కర్ర ధర మూడురెట్లు పెరిగింది. రాయితీపై అందిస్తే బొమ్మల తయారీ గిట్టుబాటు అవుతుంది. లక్క ధర కేజీ రూ.400 నుంచి రూ.1000కి పెరిగింది. విద్యుత్తు ఛార్జీలు పెరిగాయి. డిపోను తెరిపిస్తేనే కళాకారుల కష్టాలు తీరతాయి. ఇటీవల డీఎఫ్‌వో గ్రామంలో సమావేశం నిర్వహించి డిపో తెరిపిస్తామని చెప్పారు.

వీఎస్‌ఎస్‌ల్లో పెంచాలి

- ఎస్‌.రాజు, కళాకారుడు, ఏటికొప్పాక
అంకుడు మొక్కలను వీఎస్‌ఎస్‌ల ద్వారా పెంచాలి. నెలకు వంద యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వాలని చాలా కాలంగా కోరుతున్నాం. అయినా ఎవరూ పట్టించుకోలేదు. కళాకారుల సమస్యలపై ప్రజాప్రతినిధులు దృష్టిసారించాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని