చూడముచ్చటగా.. సత్యానగర్‌ ఉద్యానవనం
eenadu telugu news
Published : 27/10/2021 05:20 IST

చూడముచ్చటగా.. సత్యానగర్‌ ఉద్యానవనం

ఉద్యానవనం ఆవరణలో తీర్చిదిద్దిన పచ్చదనం

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: నగరంలోని వివిధ వార్డుల్లో ఉన్న ఉద్యానవనాలు ఒక ఎత్తు.. 97వ వార్డు సత్యానగర్‌లోని ఉద్యానవనం మరో ఎత్తు.. దీన్ని వీఎంఆర్‌డీఏ ఏర్పాటు చేసిన సెంట్రల్‌ పార్కు తరహాలో తీర్చిదిద్దారు. రూ.1.59కోట్ల జీవీఎంసీ సాధారణ నిధులతో 1.06ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. 2018లో రూ.1.46కోట్ల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేశారు. నగరంలోని సెంట్రల్‌ పార్కు తరహాలో జీవీఎంసీ పరిధిలో రెండు ఉద్యానవనాలకు అప్పట్లో శంకుస్థాపన చేశారు. సత్యానగర్‌లో సగానికి పైగా పనులు పూర్తయిన తర్వాత నిధుల లేమితో పనులు నిలిచిపోయాయి. తాజాగా జీవీఎంసీ నిధులు విడుదల చేయడంతో ఉద్యానవనం పనులు పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.చిన్నారులు, యువత, వృద్ధులు, మహిళలు అన్నివర్గాల వారికి సదుపాయాలు ఈ ఉద్యానవనంలో కల్పించారు.
 ఇక్కడి సదుపాయాలివే..
 యాంపీ థియేటర్‌ 

సేదతీరేందుకు ప్లాజాలు 

షటిల్‌ కోర్టు
ఉదయపు నడక కోసం జాగింగ్‌ ట్రాక్‌ 

పెద్దలు కూర్చునేందుకు వీలుగా బెంచీలు

పార్కు అంతటా పచ్చిక బయలు 

వెలుగులీనే విద్యుత్తు దీపాలు

మహిళలు, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు

చిల్డ్రన్‌ ప్లే ఏరియా, బహిరంగ వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.

నిర్వహణపై దృష్టి సారిస్తేనే: ప్రజాధనంతో నిర్మించిన ఉద్యానవనం నిర్వహణపై జీవీఎంసీ పూర్తిస్థాయిలో దృష్టిసారించకపోతే నిధులు వృథా అయ్యే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. 97వ వార్డు పరిధిలోని సుజాతనగర్‌ ఏ, బి, సీ-1, సీ-2 జోన్‌లలోని పార్కులను పీపీపీ విధానంలో నిర్మించారు. వాటి నిర్వహణ బాధ్యతలను కమిటీలు తీసుకున్నాయి. కాలనీవాసులపై భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏ జోన్‌ పార్కు కమిటీ ఒక దుకాణం, కాపలాదారుకు గది నిర్మించారు. దుకాణం అద్దె ద్వారా వచ్చే ఆదాయాన్ని కాపలాదారులకు ఇస్తున్నారు. మిగిలిన చోట్ల స్థానికులే సెలవు రోజుల్లో నిర్వహణ చేస్తున్నారు.  సత్యానగర్‌ ఉద్యానవనం నిర్వహణను ఏడాది పాటు జీవీఎంసీ చూస్తుంది. అనంతరం కమిటీకి అప్పగిస్తారు. అప్పుడు పరిసర కాలనీల వాసులు విరాళాలు సేకరించి నిర్వహణ చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నిర్ణీత ఆదాయం వచ్చేలా ఏదైనా ఆలోచన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని