లక్ష్యానికి దూరంగా..
eenadu telugu news
Published : 24/10/2021 05:42 IST

లక్ష్యానికి దూరంగా..

చెత్త సంపద కేంద్రాలు 


గరివిడిలో వినియోగానికి దూరంగా చెత్త సంపద తయారీ కేంద్రం

చీపురుపల్లి, న్యూస్‌టుడే గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలంతా ఆరోగ్యంగా ఉండగలరు. చెత్త సమస్యను పరిష్కరించగలిగితే స్వచ్ఛత సాధించినట్లే. ఇందుకోసం గతంలో మేజరు పంచాయతీల్లో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిర్మించినా.. అవి వినియోగానికి దూరంగా ఉన్నాయి. నేడు స్వచ్ఛ సంక్పలం అమలు చేస్తున్నా వ్యర్థాల నిర్వహణకు చొరవ తీసుకోకుంటే సత్ఫలితాలు వట్టిమాటే అవుతుంది. చెత్త కుప్పలుగా పేరుకుంటుందే తప్ప స్వచ్ఛపల్లె లక్ష్యం నేరవేరడం లేదు.

జిల్లాలో పురపాలక సంఘాల తరువాత చిన్న తరహా పట్టణాలుగా అభివృద్ధి చెందుతున్న 14 మేజరు పంచాయతీల్లో ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిరుపయోగంగా ఉంటున్నాయి. గతంలో జనాభా ఆధారంగా  ఇంటింట చెత్త సేకరణకు బుట్టలు, రిక్షాలు సరఫరా చేశారు. పెద్ద పంచాయతీలకు వ్యర్థాల నిర్వహణకు యంత్రాలను సమకూర్చారు. హరిత రాయబారులను నియమించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి కంపోస్టు ఎరువుగా తయారు చేసి విక్రయించే ఏర్పాట్లు చేశారు. మొదట్లో ఈ కార్యక్రమం బాగానే సాగింది. ఆతర్వాత పడకేసింది.  ప్రస్తుతం గజపతినగరం, రామభద్రపురం, సీతానగరం మండలంలోని పెదబోగిల మేజరు పంచాయతీల్లో కొంత వరకు అమలవుతున్నా మిగతా చోట్ల కేంద్రాలు పనిచేయడం లేదు. దీంతో చెత్త నిర్వహణ సమస్య తప్పడం లేదు.

క్లాప్‌ అమలుతోనైనా... 
పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.  జిల్లాలో గ్రామపంచాయతీలకు చెత్త తరలించే 62 వాహనాలను సమకూర్చారు.   చెత్త శుద్ధి కేంద్రాల్లో సంపద తయారీపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రభుత్వ  లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


భోగాపురంలో వృథాగా సంపద కేంద్రం, యంత్రం 

కేంద్రాల నిర్వహణకు చర్యలు.. 
జిల్లాలో చెత్త నుంచి సంపద తయారీ అయ్యేలా కేంద్రాలను నిర్వహిస్తారు. క్లాప్‌ కార్యక్రమం కింద చెత్త తరలించే వాహనాలను పంచాయతీలకు కేటాయించాం. వీటి ద్వారా తడి, పొడి చెత్తను సేకరించి నేరుగా కేంద్రాలకు తరలించి, సంపద తయారీకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం.
- సిరిపురపు సుభాషిణి, జిల్లా పంచాయతీ అధికారిణి.

ఇదీ పరిస్థితి 
* చీపురుపల్లి పట్టణంలో చెత్త శుద్ధి కేంద్రం అలంకారప్రాయంగా మారింది. యంత్రాలు మూలకు చేరాయి. రిక్షాలు పాడయ్యాయి. వీధుల్లో ఊడ్చిన చెత్తను ట్రాక్టర్లతో తీసుకెళ్లి కనకమహాలక్ష్మి దేవస్థానం ఎదురుగా ఉన్న తోటపల్లి  కాలువ గట్టు పరిసరాల్లో వేస్తున్నారు.
* కొత్తవలస పంచాయతీ రాజన్నకాలనీలో రూ.20 లక్షలతో నిర్మించిన ఎస్‌డబ్ల్యూపీసీ కేంద్రం నిరుపయోగంగా ఉంది. ఈ పంచాయతీకి సరఫరా చేసిన 20 రిక్షాల్లో ఐదారు తప్ప మిగిలినవి పాడయ్యాయి. యంత్రాలు మూలకు చేరాయి. వేతనాలు అందక హరిత రాయబారుల సేవలు నిలిచిపోయాయి. సంపద సృష్టి లేక చెత్తకు నిప్పు పెట్టాల్సి వస్తోంది. 
* ఎస్‌.కోట మేజరు పంచాయతీలో సంపద తయారీ కేంద్రం వృథాగా ఉంది. ఇక్కడ ఖాళీగా ఉన్న 19 మంది హరిత రాయబారులను నియమించాల్సి ఉంది. పట్టణ వీధుల్లో ఊడ్చిన చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు.
* కొండపాలెం (గరివిడి) మేజరు పంచాయతీలో ఇందిరమ్మ కాలనీ సమీపంలో రూ. 7.50 లక్షలతో నిర్మించిన ఎస్‌డబ్ల్యూపీసీ పనిచేయడం లేదు. ఈ కేంద్రానికి రూ.10 లక్షలు వెచ్చించి ప్రహరీ కూడా నిర్మించారు. చెత్త తరలింపు రిక్షాలు పాడయ్యాయి. సంపద సృష్టి వట్టిమాటే అవుతోంది.
* భోగాపురం మేజరు పంచాయతీలో చెత్త శుద్ధి కేంద్రం, యంత్రం నిరుపయోగంగా మారాయి. అధికారులు సంపద సృష్టిపై దృష్టి సారించకపోవడంతో చెత్త సమస్య తప్పడం లేదు
* కురుపాం మేజరు పంచాయతీ శివారున చెత్త నిర్వహణ కేంద్రం నిర్మించారు. దీనికి సంబంధించి షెడ్డు నిరుపయోగంగా మారింది. కొన్నాళ్ల కిందట అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. 
* తెర్లాం పంచాయతీలో సంపద సృష్టి కేంద్రం నిర్మాణ పనులు పూర్తి కాలేదు. వీధుల్లో ఊడ్చిన చెత్తను బళ్లపై తీసుకెళ్లి గ్రామ శివారులో వేస్తున్నారు. 
*జామి మేజరు పంచాయతీలో  చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని మొదట్లో నిర్వహించేవారు. ఆ తరువాత వినియోగించకుండా వదిలేయడంతో షెడ్డు పాడైంది.  


చీపురుపల్లిలో తోటపల్లి కాలువ గట్టు పొడవునా ఇలా... 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని