కిసాన్‌ రైలు... చకచకా పరుగు
eenadu telugu news
Published : 24/10/2021 05:07 IST

కిసాన్‌ రైలు... చకచకా పరుగు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పశ్చిమదే పైచేయి


తాడేపల్లిగూడెంలో ఎగుమతులకు సిద్ధంగా ఉన్న కిసాన్‌రైలు

తాడేపల్లిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌ చేసుకునేందుకు వీలుగా రైల్వేశాఖ 50 శాతం రాయితీతో కిసాన్‌ రైళ్లను నడుపుతోంది. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ రీజియన్‌ పరిధిలో తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్‌ నుంచి మొదటి సారిగా వీటిని ప్రారంభించారు. ఆగస్టు 21 నుంచి వీటిలో సరకుల రవాణా ఆరంభించారు. తాడేపల్లిగూడెం నుంచి ఈ రైళ్లలో పెద్దఎత్తున ఉల్లి ఎగుమతులు జరుగుతున్నాయి. మరిన్ని రైళ్లు కావాలని రైతుల నుంచి వినతులు వస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆక్వా ఉత్పత్తుల రవాణాకు కూడా కిసాన్‌ రైళ్లను కేటాయించాలని జిల్లా రైతులు కోరుతున్నారు.

ఇతర రాష్ట్రాలకు... తాడేపల్లిగూడెం నుంచి ఉల్లిని ప్రధానంగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. కర్నూలు నుంచి రైతులు యూనిట్‌గా ఏర్పడి ఈ కిసాన్‌ రైళ్లకోసం ముందుగానే ప్రతిపాదనలు పెట్టు కుంటున్నారు. పండించిన ప్రదేశం, పట్టాదారు పాసుపుస్తకాలు వంటి వివరాలతో ముందుగా నమోదు చేయించుకుంటే వారికి మాత్రమే వీటిని కేటాయిస్తారు. అసోం, గౌహతి, బిహార్‌, పశ్చిమ బంగా రాష్ట్రాలతో పాటు చంగ్‌సరి, దింపూర్‌, జలాల్‌గంజ్‌, హౌరా, ముల్తాన్‌ తదితర ప్రాంతాలకు తాడేపల్లిగూడెం నుంచి గుడ్లు, ఉల్లి ఎగుమతులు చేస్తున్నారు. నూజివీడు నుంచి మామిడిని కూడా పంపించారు.

రెండు నెలల్లో రూ.నాలుగు కోట్ల ఆదాయం.. ఆగస్టు 21 నుంచి అక్టోబరు 15 వరకూ తాడేపల్లిగూడెం స్టేషన్‌కు రూ.4 కోట్ల ఆదాయం కేవలం కిసాన్‌ రైళ్ల ద్వారానే సమకూరింది. విజయవాడ రీజియన్‌ పరిధిలో ఏ రైల్వేస్టేషన్‌ నుంచి ఇంత భారీ ఆదాయం రాలేదు. దీంతో రైల్వేశాఖ అధికారులు కిసాన్‌ రైళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల విద్యుత్తు అవసరాలకు బొగ్గు రవాణా పెరగడంతో విశాఖ నుంచి రైల్‌ ట్రాఫిక్‌ పెరిగింది. దీంతో కిసాన్‌ రైళ్లకు అనుమతులు తగ్గించారు. లేకుంటే మరో 36 రైళ్లకు ఈ పాటికే అనుమతి లభించేది.

మరో 36 రైళ్లకు డిమాండ్‌.. ఆగస్టు నెల నుంచి ఇప్పటి వరకూ 32 కిసాన్‌ రైళ్లను పంపారు. మరో 36 రైళ్లకోసం దరఖాస్తులు దక్షిణ మధ్య రైల్వే అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వచ్చే నెలలోగా వీటిని పంపాల్సి ఉంది. కేటాయించిన రైలును బట్టి టన్నులు పెరుగుతాయి. రైతులు పంపే సరకు వివరాలను బట్టి 264 మెట్రిక్‌ టన్నులు, 440 మెట్రిక్‌ టన్నులుగా రెండు రకాల రైళ్లను రైల్వే అధికారులు కేటాయిస్తారు. తాజాగా ఆక్వా, కంద రైతులు కూడా ఎగుమతులకు సిద్ధమవుతున్నారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని