close

శుక్రవారం, ఆగస్టు 23, 2019

ప్రధానాంశాలు

శాసన సభ అటు.. లోక్‌సభ ఎటో!

మరో 24 గంటల్లో చేవెళ్ల లోక్‌సభ స్థానం ఎన్నికల ఫలితాలు వెలువడ బోతున్నాయి. ఏప్రిల్‌ 11న జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును ఎన్నికల అధికారులు గురువారం నిర్వహించ బోతున్నారు. ఈ నేపథ్యంలో తాండూరు నియోజకవర్గంలోని ఓటర్లు ఏ అభ్యర్థి వైపు మొగ్గుచూపారనే విషయం తేటతెల్లం కాబోతోంది....

న్యూస్‌టుడే, తాండూరు

నియోజకవర్గంలోని తాండూరు, బషీరాబాద్‌, యాలాల, పెద్దేముల్‌ మండలాలతోపాటు తాండూరు పట్టణంలో కలిపి మొత్తం 2,14,274 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సమయంలో ఏర్పాటు చేసిన 262 పోలింగ్‌ కేంద్రాల్లో 1,42,206 మంది మాత్రమే హక్కును వినియోగించుకున్నారు. మిగిలిన 72,068 మంది ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. ఓటేసిన వారిలో 70,616 మంది పురుషులు, 71,587 మంది మహిళలు ఉన్నారు. ఇతరులు ముగ్గురు ఉన్నారు. ఎన్నికల్లో హక్కును వినియోగించుకున్న వారిలో ఎక్కువ మంది ఏ అభ్యర్థి వైపు మొగ్గు చూపారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో మొత్తం 23 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ప్రధాన పోటీ మాత్రం తెరాస, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్యనే కొనసాగింది. కాంగ్రెస్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, తెరాస నుంచి రంజిత్‌రెడ్డి పోటీ చేశారు. రంజిత్‌రెడ్డి తరఫున మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి తరఫున తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. నామపత్రాలు దాఖలు చేసిన నాటి నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు శ్రమించారు.

ఆధిక్యం మాదంటే మాదే... 
లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకే ఓట్ల ఆధిక్యం వస్తుందని అటు తెరాస ఇటు కాంగ్రెస్‌ గట్టిగా నమ్ముతున్నాయి. తాండూరు శాసనసభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్‌ హోరాహోరీగా పోరాడాయి. ఫలితాలు వెల్లడయ్యే సరికి తెరాసను ఓడించి కాంగ్రెస్‌ విజయ తీరాలకు చేరింది. ఆ ఎన్నికల్లో తెరాస నుంచి మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి రోహిత్‌రెడ్డి పోటీ చేశారు. ఫలితాల సమయంలో నువ్వా, నేనా అన్నట్లు రౌండు రౌండుకు ఉత్కంఠత నెలకొంది. చివరకు కాంగ్రెస్‌ అభ్యర్థి రోహిత్‌రెడ్డి 2,385 ఓట్లతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తాజాగా ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓటర్లు తమవైపే మొగ్గుచూపుతారనే ధీమాతో కాంగ్రెస్‌ నాయకులు కనిపిస్తున్నారు. తెరాస మాత్రం లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు తమవైపే ఎక్కువగా మొగ్గుచూపడం ఖాయమని ధీమాగా ఉన్నారు. జనవరి 21న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో మొత్తం 149 సర్పంచి స్థానాల్లో తెరాస మద్దతు దారులు 109 స్థానాల్లో సర్పంచులుగా విజయం సాధించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లతోపాటు తాండూరు పట్టణంలోని ఓటర్లు తమ వైపే మొగ్గు చూపడంతో లోక్‌సభ ఎన్నికల్లో ఫలితం తమవైపే ఉంటుందని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.