close

బుధవారం, జులై 24, 2019

ప్రధానాంశాలు

మలి విడత పంపిణీకి ఎదురుచూపు..!

 ‘తొలి’లో దక్కని వారికి అవకాశం
 జులై నుంచి గొర్రెల అందజేతకు అధికారుల సన్నద్ధం

జిల్లా వ్యాప్తంగా ఇలా..
* అర్హులైన లబ్ధిదారులు: 22,029
* తొలి విడతలో ఎంపికైన వారు: 10,954
* రెండో విడతలో లబ్ధిదారులు: 11,075

న్యూస్‌టుడే, పూడూరు

గొల్ల, కురుమలకు స్థానికంగా ఉపాధి కల్పించి ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం రెండో విడత కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. పథకం ప్రారంభంలో చేపట్టిన ఎంపికలో కొందరికే అవకాశం వచ్చింది. రాని వారు నిరాశకు గురైనా.. ఇప్పటి వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. రెండో విడత మళ్లీ తెరపైకి రావడంతో తమకు అవకాశం దక్కుతుందని అర్హులు ఆశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం...

తొలి విడతలో లాటరీ ద్వారా ఎంపిక
రెండో విడత లబ్ధిదారులకు గొర్రెలు అందించాల్సి ఉండటంతో అధికారులు అందుకు సన్నద్ధమవుతున్నారు. పథకం ప్రారంభంలో యూనిట్ల మంజూరు కోసం విమర్శలు రాకుండా అప్పట్లో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఆయా మండలాలకు చెందిన ఎంపీడీఓ, పశు సంవర్ధకశాఖ అధికారులతో కూడిన సభ్యుల బృందంతోపాటు స్థానిక తహసీల్దారు పర్యవేక్షణలో గ్రామాల్లో ఎంపిక ప్రక్రియ జరిగింది. కురుమ, గొల్ల సంఘాలను ఏర్పాటు చేయించి అర్హులైన వారి నుంచి ముందస్తుగా దరఖాస్తులు తీసుకున్నారు. గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ప్రజాప్రతినిధులు, ప్రజల సమక్షంలో లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన బడ్జెట్‌ ప్రకారం మొదటి విడతలో సగం మందికే అవకాశం దక్కింది. ఎంపికైన వారికి ఒక్కో యూనిట్‌కు 20 గొర్రెలతోపాటు ఒక పొట్టేలును ఇచ్చేందుకు అధికారులు యోచించారు. కాపరుల వాటాగా రూ.31.250 వేలు డీడీ రూపంలో చెల్లిస్తే ప్రభుత్వం 70 శాతం రాయితీని అందిస్తూ మొత్తం రూ.లక్షా 11 వేలు చెల్లించింది.

కర్ణాటక నుంచి దిగుమతి
జిల్లాలోని తాండూరు, కొడంగల్‌, పరిగి వికారాబాద్‌ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 18 మండలాల్లోని గ్రామాల్లో మొదటి విడతగా 22,025 మంది లబ్ధిదారులను లాటరీ ద్వారా గుర్తించారు. ఎంపికైన వారిలో సకాలంలో డీడీలు చెల్లించిన వారికి త్వరితగతిన గొర్రెలు అందించాలనే ఉద్దేశంతో అధికారులు కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్‌, గుర్మిట్‌కల్‌, సేడం, యాద్గిర్‌ తదితర పట్టణాలకు లబ్ధిదారులను తీసుకెళ్లి ఇప్పించారు. మొదటి జాబితాలో ఎంపికైన కొందరు రైతులు గొర్రెలు పొందలేదు. డీడీలు చెల్లించకపోవటంతో పశుసంవర్ధక శాఖ అధికారులు పలుమార్లు సూచించినా ముందుకు రాలేదు. అర్హులైన ఇలాంటి వారు గొర్రెలు వద్దనుకుంటే లిఖిత పూర్వకంగా రాయించుకుని పేర్లు తొలగించేందుకు అధికారులు యోచించారు.

జిల్లాలో 11,075 మందికి ప్రయోజనం
రెండో జాబితా(గ్రూప్‌-బి)లో పేరు ఉండి గొర్రెల కోసం ఎదురుచూస్తున్న వారికి అవకాశం కల్పించేందుకు కార్యాచరణ చేపట్టారు. దీంతో జిల్లాలో రెండవ విడత సుమారు 11,075 మంది కాపరులకు ప్రయోజనం దక్కనుంది. ఇప్పటి వరకు వరుస ఎన్నికలు రావటంతో అడ్డంకులు ఏర్పడ్డాయి. మలి విడతకు ఎంపికైన రైతులు డీడీలు చెల్లించాల్సి ఉంది. పథకం ప్రారంభంలో రాయితీపై ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన గొర్రెలు అనారోగ్యానికి గురి కావడంతో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో మేత సక్రమంగా మేయక మృత్యువాత పడ్డాయి. అధికారులు రాయితీ గొర్రెలకు బీమా చేయించడంతో చనిపోయిన వాటికి బదులుగా తిరిగి గొర్రె, పొట్టేలు ఇప్పించారు.

త్వరగా అందిస్తే మేలు
- కిష్టయ్య, గొర్రెల కాపరి, రేగడిమామిడిపల్లి
రెండో విడత గొర్రెల పంపిణీ త్వరితగతిన చేపట్టాలి. మొదటి విడతలో దరఖాస్తు చేసుకుని ఆశించినా లాటరీలో పేరు రాకపోవటంతో నిరాశకు గురయ్యా. మొదటి విడత పంపిణీ పూర్తి కాగానే రెండో విడత గొర్రెలు ఇస్తామని చెప్పిన అధికారులు ఇప్పటివరకు అందించలేదు. ఎప్పుడు అందించేది చెబితే డీడీలు తీసేందుకు కావాల్సిన డబ్బులు సిద్ధం చేసుకుంటా.

వాతావరణం అనుకూలించక మృత్యువాత
- శ్రీశైలం, గొర్రెల కాపరి, కడ్మూరు
ప్రభుత్వం అందించే గొర్రెలు మన ప్రాంతానికి చెందినవే అయితే బాగుంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడంతో గొర్రెలు వాతావరణం అనుకూలించక అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతున్నాయి. ఈ విషయంపై అధికారులు దృష్టి సారించి ప్రయోజనం కలిగించేలా చూడాలి.

వ్యాధులు రాకుండా చర్యలు
- శ్వేత, పశువైద్యాధికారిణి, పూడూరు
మలి విడత పంపిణీ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మొదటి జాబితాలో ఎంపికై డీడీలు చెల్లించని వారి పేర్లు పక్కన పెట్టాం. జులై నుంచి రైతులకు గొర్రెలు ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటివరకు రైతులు పొందిన గొర్రెలు మృత్యువాత పడ్డవాటికి బీమా ఉంది. వర్షాకాలం కావడంతో సీజనల్‌ వ్యాధులు రాకుండా శిబిరాలు పెట్టి మందులు పంపిణీ చేస్తున్నాం.

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.