Manalo Manam: నేనూ ప్రేమలో పడతానేమోనని భయమేస్తోంది!

నేను చదువులో టాపర్‌ని. ఆర్థిక ఇబ్బందులేం లేవు. అమ్మానాన్నలూ ప్రేమగా చూసుకుంటారు. నా సమస్య ఏంటంటే.. నా క్లోజ్‌ఫ్రెండ్‌ని ఒకబ్బాయి ప్రేమించి, మోసం చేయడంతో.. తను ఆత్మహత్య చేసుకుంది.

Updated : 09 Dec 2023 10:15 IST

నేను చదువులో టాపర్‌ని. ఆర్థిక ఇబ్బందులేం లేవు. అమ్మానాన్నలూ ప్రేమగా చూసుకుంటారు. నా సమస్య ఏంటంటే.. నా క్లోజ్‌ఫ్రెండ్‌ని ఒకబ్బాయి ప్రేమించి, మోసం చేయడంతో.. తను ఆత్మహత్య చేసుకుంది. రెండ్రోజుల నుంచి నాకూ అదే భయం మొదలైంది. నేనూ ప్రేమలో పడతాననీ, మోసపోతాననీ.. ఒకటే ఆలోచనలు, కలలు. ఉన్నట్టుండి ఉలిక్కి పడుతున్నా. రాత్రిళ్లు నిద్ర రావడం లేదు. దీన్నుంచి బయటపడేదెలా?

సీహెచ్‌ఏఆర్‌, ఈమెయిల్‌

దగ్గరి స్నేహితురాలు చనిపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది. కొద్దిరోజులు కాగానే ఎవరైనా ఆ ప్రభావం నుంచి బయట పడతారు. కానీ రోజులు గడిచినా ఆ బాధ నుంచి బయటికి రాలేకపోవడం, నాకూ అలా జరుగుతుందేమో.. అని భయాందోళనలకు గురవడాన్ని ‘ట్రామాటిక్‌ స్ట్రెస్‌’ అంటారు. ఇది దీర్ఘకాలం కొనసాగితే మానసిక రుగ్మతకు దారి తీస్తుంది. దీన్నే పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ (పీటీఎస్‌డీ) అంటారు. ఈ పరిస్థితికి రాకముందే మీరు మేల్కోండి. బాధ నుంచి బయటికొచ్చి ఒక్కసారి ప్రాక్టికల్‌గా ఆలోచించండి. మీతోపాటు మీ స్నేహితురాలికి ఒకరిద్దరైనా.. క్లోజ్‌ఫ్రెండ్స్‌ ఉంటారు. వాళ్లు బహుశా మీరున్న స్థితిలో ఉండకపోవచ్చు. మరి వాళ్లు ఆ బాధ నుంచి ఎలా బయటికొచ్చారో సలహా తీసుకోండి. ప్రేమలో ఓడిపోయినవాళ్లు అందరూ ఇలా చావును ఆశ్రయించడం లేదు కదా! ఆ ఆలోచనే తప్పు. మీరూ ప్రేమలో పడితే అలాంటి పరిస్థితే వస్తుందని ఎందుకు అనవసరంగా ఊహించుకుంటున్నారు? అసలు ప్రేమలో పడటం, పడకపోవడం అనేది మీ చేతుల్లోనే ఉంది కదా! సమస్య రాకుండా ఏం చేయాలో మీ చేతుల్లోనే ఉన్నప్పుడు ఇంక చావు ఆలోచనలు ఎందుకు? స్నేహితురాలి ఆలోచనలు మీ మెదడులోకి రాకుండా ఉండాలంటే.. మిమ్మల్ని మీరు తీరిక లేకుండా ఉండేలా చూసుకోండి. ఏ మాత్రం ఖాళీగా ఉన్నా.. పుస్తకం చదవడమో, టీవీ చూడటమో చేయండి. యోగా, ధ్యానం.. ఇలాంటివి మనసుని ప్రశాంతంగా ఉంచుతాయి. ఇన్ని చేసినా.. ఇంకా బాధ నుంచి తేరుకోకపోతే కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ (సీబీటీ)లో రిలాక్సేషన్‌ థెరపీ టెక్నిక్స్‌ ద్వారా ఆ ప్రభావం నుంచి బయట పడొచ్చు. ఇలాంటి సమస్య నుంచి కోలుకోవడం తేలికే. దిగులు పడొద్దు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని