అసంక్రమిత వ్యాధులు.. కబళిస్తున్నాయ్‌ - Karimnagar - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 22, 2019

ప్రధానాంశాలు

అసంక్రమిత వ్యాధులు.. కబళిస్తున్నాయ్‌

జిల్లాలో పెరుగుతున్న బాధితులు
చికిత్సకు ఎన్‌సీడీ కేంద్రం ఏర్పాటు
ఉచిత మందులు.. వైద్యుల సూచనలు
న్యూస్‌టుడే, చైతన్యపురి(కరీంనగర్‌)

జిల్లాలో అసంక్రమిత వ్యాధుల బారిన పడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జీవన శైలిలో వస్తున్న మార్పులు, తగ్గుతున్న శారీరక శ్రమ.. జంక్‌ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి, ధూమ, మద్య పానం తదితర కారణాలతో పాటు జన్యుపరమైన సమస్యలు ఉండటంతో రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌ లాంటి అసంక్రమిత వ్యాధుల బాధితులు జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్నారు. ఈ బాధితులకు వైద్య సేవలు అందించేందుకు జిల్లా ఆసుపత్రిలో ఎన్‌సీడీ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం..

జాతీయ ఆరోగ్య సంస్థ తన నివేదికలో 50 శాతం మరణాలు దీర్ఘకాలిక (అసంక్రమిత) వ్యాధుల మూలంగానే సంభవిస్తున్నట్లు పేర్కొంది. ఆధునిక జీవనంలో ప్రమాదకర క్యాన్సర్‌తో పాటు బీపీ, షుగర్‌ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ వ్యాధులతో బాధపడే వారిని గుర్తించి మెరుగైన వైద్య సేవలందించాలన్నదే ఎన్‌సీడీ కేంద్రం లక్ష్యం. గతేడాది డిసెంబర్‌లో కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభమైన ఎన్‌సీడీ(నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీజ్‌) కేంద్రం నిత్యం వంద మందికి పైగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు ఉచితంగా మందులు, వైద్య సలహాలతో పాటు కౌన్సెలింగ్‌ అందిస్తూ మన్ననలు పొందుతోంది.

వేలల్లో బాధితులు
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ  జీవనశైలి వ్యాధులపై చేసిన సర్వే ప్రకారం 3,45,744 మందికి స్క్రీనింగ్‌ చేయగా అందులో బీపీ 19,528, మధుమేహం 13,945 మంది బాధితులు ఉన్నట్లు తేలింది. వ్యాధి తీవ్రతను గుర్తించకపోవడం, సకాలంలో సరైన చికిత్స తీసుకోకపోవడంతో వాటి ప్రభావం గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలపై పడి మనిషి రోగాల కుప్పగా మారుతున్నాడు. అలాంటి వారిని ముందుగా గుర్తించి ఎన్‌సీడీ కేంద్రం ద్వారా అవసరమైన మందులతోపాటు, కౌన్సెలింగ్‌ సలహాలు, సూచనలిస్తూ రక్తపోటు, మధుమేహంలను అదుపులో ఉంచడంలో ఎన్‌సీడీ కేంద్రం కీలకంగా వ్యవహరిస్తోంది.

జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక విభాగం
కరీంనగర్‌ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులు ఆరుగురు నర్సులు, ఆరుగురు సిబ్బంది, ఇద్దరు కౌన్సిలర్లు, ఓ మానసిక వైద్యునితో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. మొదట ఎన్‌సీడీ కేంద్రానికి వచ్చిన రోగికి బీపీ, షుగర్‌ పరీక్షలు చేసి వ్యాధి ప్రారంభ దశలో ఉన్నవారికి అవసరమైన మందులు అందజేయడంతోపాటు వ్యాధులను అదుపులో ఉంచుకునేందుకు సలహాలు, సూచనలిస్తారు. వ్యాధి రెండో దశలో ఉన్న వారికి ప్రత్యేక కార్డుతో ప్రతి నెలా ఉచితంగా మందులు అందజేయడంతోపాటు ప్రత్యేక కౌన్సిలర్‌ పలు సూచనలు చేస్తాడు. తీసుకోవాల్సిన ఆహారం.. వ్యాయామం, తదితర అంశాలపై వివరిస్తారు. వ్యాధిగ్రస్థుల వివరాలను నమోదు చేసుకొని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి ఎప్పుడు రావాలో చరవాణిలో సమచారం అందిస్తారు.

తల తిరగడం తగ్గింది
-భాగ్యలక్ష్మి కరీంనగర్‌
గతంలో ఉన్నట్టుండి తల తిరిగి పడిపోయేదాన్ని.. వైద్య పరీక్షలు చేయించగా బీపీ ఎక్కువగా ఉంది. మందులు వాడాలని వైద్యులు చెప్పారు. మూడు నెలలుగా ఎన్‌సీడీ కేంద్రంలో అందించిన మందులు వాడటంతో తల తిరగడం తగ్గి బీపీ అదుపులో ఉంటోంది. అహారం తదితర విషయాలపై కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో పాటు ప్రతి నెలా ఉచితంగా మందులు అందజేస్తున్నారు.

ఐదేళ్లుగా మందులు వాడుతున్నా..
-లక్ష్మీనారాయణ, కిషన్‌నగర్‌
అయిదేళ్లుగా బీపీ, షుగర్‌కు మందులు వాడుతున్నా.. ప్రారంభంలో ప్రైవేట్‌లో మందులు తీసుకునేవాన్ని.. ఆరు నెలలుగా ఇక్కడే మందులు తీసుకుంటున్నా.. ప్రతి వ్యక్తికి ప్రత్యేక కార్డుతో ప్రతి నెలా మందులు ఉచితంగా ఇస్తున్నారు. మందులు తీసుకోవాల్సిన తేదీ సిబ్బంది ముందుగానే ఫోన్‌ద్వారా సమాచారం అందిస్తున్నారు.

ప్రారంభంలో గుర్తిస్తే అదుపులో పెట్టవచ్చు
-డాక్టర్‌ మాధవి, ఫిజిషియన్‌, ఎన్‌సీడీ కేంద్రం
బీపీ, షుగర్‌ అదుపులో లేకపోతే వాటి ప్రభావం శరీరంలోని ఇతర అవయవాలైన గుండె, మూత్రపిండాలు, కాలేయంపై పడవచ్చు. ప్రారంభంలో గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే బీపీ, షుగర్‌ను అదుపులో పెట్టుకోవచ్చు. అసంక్రమిత వ్యాధులతో బాధపడే వారు నిత్యం 30 నిమిషాలు నడక, 20 నిమిషాలు యోగా సాధన చేయడం మంచిది. పొగాకు వినియోగం, మద్యం తీసుకోవడం తగ్గించాలి. తాజా ఆహారం తీసుకోవాలి. కూర్చుని పని చేసేవారు గంటకోసారైనా లేచి అటూ ఇటూ నడవాలి.

ఉచితంగా మందులు, వైద్య సూచనలు అందిస్తాం
-డాక్టర్‌ విప్లవశ్రీ, ఎన్‌సీడీ కేంద్రం వైద్యాధికారి
చికిత్స నిమిత్తం కేంద్రానికి వచ్చిన వారికి ఉచిత మందులతో పాటు వైద్యపరంగా రోగికి కావాల్సిన సలహాలు సూచనలు అందిస్తాం. రెండో దశలో ఉన్నవారికి ప్రత్యేక కార్డు ఏర్పాటు చేసి ప్రతి నెలా తీసుకునే మందుల వివరాలను అందులో నమోదు చేస్తాం. మందుల వినియోగం, కేంద్రానికి రావాల్సిన తేదీ తదితర వివరాలను ఫోన్‌ ద్వారా వ్యాధిగ్రస్థుడికి తెలియజేస్తాం. వైద్య నివేదికల అధారంగా రోగికి అవసరమైన మందుల డోస్‌ పెంచడం.. తగ్గించడం జరుగుతుంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.