ఈ-కేవైసీ..డీలర్లే వెనకేసి.. - Kurnool - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 15, 2019

ప్రధానాంశాలు

ఈ-కేవైసీ..డీలర్లే వెనకేసి..

● జిల్లాలో 5.35 లక్షల మంది ఎదురుచూపులు

● ఈ-పాస్‌ యంత్రంలో నమోదు చేయాల్సి ఉన్నా నిర్లక్ష్యం

● సర్వర్‌ సమస్యల పేరుతో మీ-సేవ కేంద్రాలకే తరలింపు

● సరకులు పోతాయన్న భయంతో డబ్బులిచ్చి మరీ వేలిముద్రలు


నంద్యాలలో మీసేవ కేంద్రం వద్ద ఈ-కేవైసీకి గుమిగూడిన లబ్ధిదారులు

ఈనాడు డిజిటల్‌ - కర్నూలు : రేషన్‌కార్డులో పేర్లున్నవాళ్లంతా వేలిముద్రలు వేయాలన్న నిబంధనను ప్రభుత్వం విధించింది. దీంతో ఈనెల 10వ తేదీ నుంచి ఈ-కేవైసీ నమోదుకు అధికారులు పిలుపునిచ్చారు. డీలర్లు తమ పరిధిలోని కార్డుదారుల కుటుంబ సభ్యులను పిలిపించి ఈ-పాస్‌ యంత్రంలో ఉచితంగా నమోదు చేయించాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ప్రజలు డబ్బులిచ్చి మీ-సేవా కేంద్రాల్లో నమోదుకు పరుగులు తీస్తూ, రోజుల తరబడి నిలబడుతూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలా ఈ-కేవైసీ లక్ష్యాన్ని డీలర్లే వెనక్కి నెట్టేశారని జనం గగ్గోలు పెడుతున్నారు.

ఈ-కేవైసీ నమోదు ఆగస్టు 25వ తేదీలోగా చేయించుకోవాలని ప్రభుత్వం తొలుత ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రజలు కేంద్రాల వద్ద కిక్కిరిసిపోతుండటంతో గడువు తేదీని సెప్టెంబర్‌ 5కు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ వీరపాండియన్‌ వెల్లడించారు. 18 సంవత్సరాలు పైబడిన వారంతా డీలర్ల వద్దకు వెళ్లి నమోదు చేయించుకోవాలని కోరారు. 5 సంవత్సరాలకు లోబడిన పిల్లలకు ఈ-కేవైసీ నుంచి మినహాయింపు ప్రకటించారు. 12 నుంచి 15 సంవత్సరాల వయసు గల సభ్యుల నమోదుకు సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు గడువు పెంచినట్లు తెలిపారు.

డీలర్లపై పర్యవేక్షణ కరవు

ఈ-కేవైసీలో ఎంతమంది నమోదయ్యారు? ఎంత మంది చేయించుకోవాల్సి ఉందో...ఈ సమాచారం అంతా డీలర్‌ ఈ-పాస్‌ యంత్రంలోనే తెలుస్తుంది. దీనిని బట్టి డీలర్లు తమ పరిధిలో కార్డుదారులను పిలిపించి ఉచితంగా ఈ-కేవైసీ నమోదు చేయించాల్సి ఉంది. ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు ఒక్కో డీలరు 100 చొప్పున లక్ష్యం పెట్టుకుని నమోదు చేయిస్తే శత శాతం పూర్తవుతుందని జేసీ ఆదేశించారు. కార్డుదారుల కుటుంబ సభ్యులు డీలర్‌ వద్దకు వస్తున్నా.. సర్వర్‌ పనిచేయడం లేదంటూ చేతులెత్తేశారు. ఇప్పుడు అసలుకే డీలర్లు దుకాణాలు మూసి ఉండటంతో చేసేది లేక మీ-సేవా కేంద్రాలకు ప్రజలు పరుగులు తీస్తున్నారు. త్వరలో గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ వస్తుండటంతో డీలర్ల ఉనికి ప్రశ్నార్థకమైన నేపథ్యంలో ఇలా చేస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తార్కాణంగా జిల్లాలో 2,442 మంది డీలర్లు ఉన్నా నమోదు చేయించింది వేలల్లోనే ఉండటమే. కర్నూలు అర్బన్‌లో 161 మంది డీలర్లు కేవలం 858 సభ్యులను మాత్రమే నమోదు చేయించారు. ఇక వీరిపై పర్యవేక్షణ చేసే తహసీల్దార్లు సచివాలయ పరీక్షల నిర్వహణపై తలమునకలయ్యారు. సీఎస్‌డీటీలు సైతం డీలర్ల పైన దృష్టిపెట్టకపోవడంతో లక్ష్యం నీరుగారింది.

జిల్లాలో ఇంకా దూరంగా...

జిల్లాలోని రేషన్‌కార్డుదారులందరి డేటా ప్యూరిఫికేషన్‌ కోసం ఈ-కేవైసీ, ప్రజాసాధికారిక సర్వే నమోదు తప్పనిసరి చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కార్డుదారులను బట్టి 6,73,939 మంది కుటుంబ సభ్యులు ఉన్నట్లు ఆన్‌లైన్‌ గణాంకాలు చెబుతుండగా... ఇంకా 5,35,406 మంది పెండింగ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు ప్రజాసాధికారిక సర్వేలో ఈ-కేవైసీ చేయించని వారి సంఖ్య అధికంగానే ఉంది. జిల్లాలో 3,54,248 మంది ప్రజాసాధికారిక సర్వే చేయించుకోవాల్సి ఉండగా ఇప్పటివరకు 60,813 మంది మాత్రమే సర్వే పూర్తి చేసుకున్నారు. ఇంకా 2.93 లక్షల మంది ప్రజాసాధికారిక సర్వేకు దూరంగా ఉన్నారు. ఆధార్‌, ప్రజాసాధికారిక సర్వే, ఈ-కేవైసీ ఈ మూడు ఉంటేనే రేషన్‌తోపాటు పలు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందగలుగుతారు.

ఇష్టారాజ్యంగా వసూళ్లు

కార్డుదారుల సభ్యులు సైతం వేలిముద్రలు వేస్తేనే సరకులు అందుతాయని పౌరసరఫరాల శాఖ సూచించింది. దీంతో ఎక్కడ సరుకులు పోతాయో అన్న గుబులుతో అందరూ ఒక్కసారిగా వేలిముద్రలు వేసేందుకు పరుగులు తీస్తున్నారు. డీలర్ల వద్ద ఈ-పాస్‌ యంత్రంలో ఉచిత సేవలు అందకపోవడంతో కార్డుదారుల కుటుంబ సభ్యులు మీ-సేవా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకున్న కేంద్ర నిర్వాహకులు ఒక్కొక్కరి వేలిముద్రకు రూ.15 నుంచి రూ.30-50 వసూళ్లు చేస్తున్నారు. వీరిపైనా పర్యవేక్షణ లేకపోవడంతో అందినకాడికి దోచుకుంటున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.