close

సోమవారం, నవంబర్ 18, 2019

ప్రధానాంశాలు

కారు చీకట్లోనూ దారి వెతికారు

  కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారికి సన్మాన సభ
  ఒకే కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురు ఎంపిక
  అభినందించిన ఇన్‌ఛార్జి కలెక్టర్‌, సీపీ, ఉన్నతాధికారులు

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: అంతా నిరుపేద విద్యార్థులు. ఉద్యోగం కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నవారు. ఆర్థిక సమస్యలు ఓ వైపు.. అవకాశాలలేమి మరోవైపు.. అయినా పట్టు విడవలేదు. వెనకడుగు అసలే వేయలేదు. తల్లిదండ్రులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు.. వాళ్ల కళ్లలో ఆనందం చూసేందుకు.. అహర్నిశలు శ్రమించారు. ఫలితంగా ఇటీవల వెలువడిన కానిస్టెబుల్‌ ఫలితాల్లో ఉద్యోగాలు ఒడిసి పట్టారు. వారందిరీకీ ఉచితంగా శిక్షణ ఇచ్చిన సైబరాబాద్‌ పోలీసులు అభినందన సభ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అభినందించారు. వారి తల్లిదండ్రులనూ ఘనంగా సత్కరించారు.

లక్షలు ఖర్చుచేసి శిక్షణ తీసుకొనే స్థోమత లేని ఔత్సాహికుల కోసం సైబరాబాద్‌ పోలీసులు ప్రత్యేక కానిస్టేబుల్‌ శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో శిక్షణ పొందిన 280 మంది కానిస్టేబుల్‌ ఉద్యోగాలు సాధించారు. ఇందులో 110 మంది మహిళలు ఉండటం విశేషం. మంగళవారం రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో అభినందన సభ నిర్వహించారు. ఈ సభలో రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ హరీశ్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డితో పాటు విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ ప్రవీణ్‌రావు, ఆర్డీవో చంద్రకళ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైబారాబాద్‌ సీపీ సజ్జనార్‌ కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్‌ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. నిజాయితీగా కష్టపడి పనిచేయాలని సూచించారు. శిక్షణ కార్యక్రమం ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించిన బాచుపల్లి సీఐ జగదీశ్వర్‌, రాజేంద్రనగర్‌ సీఐ సురేశ్‌ను సీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్‌ఛార్జి కలెక్టర్‌ హరీశ్‌ మాట్లాడుతూ.. దేశంలో ప్రత్యేక స్థానం ఉన్న తెలంగాణ పోలీసుశాఖలో ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్కరూ అందుకు తగినట్లుగా పనిచేయాలని సూచించారు.
 

ఒక్కొకరిది ఒక్కో నేపథ్యం..
ఉన్నతాధికారుల మధ్య సాగిన ఈ అభినందన సభలో అభ్యర్థుల కుటుంబ నేపథ్యాల గురించి వివరిస్తుంటే తల్లిదండ్రులు కంటతడిపెట్టుకున్నారు. కొందరు వేదిక మీదకు వచ్చి పోలీసు అధికారులకు కృతజ్ఞతలు చెబుతూ ఉద్వేగానికి గురయ్యారు. పది కుటుంబాల నుంచి అన్నాదమ్ములు, అక్క చెల్లెలు ఇలా ఇద్దరు ఎంపికకావడం విశేషం. ఇక రాజేంద్రనగర్‌కు చెందిన ఓ కుటుంబం నుంచి ఏకంగా ముగ్గురు అక్కాచెల్లెలు ఎంపికయ్యారు.

ఒకే  కుటుంబం నుంచి ముగ్గురు
రాజేంద్రనగర్‌ శివరాంపల్లి హరిజన బస్తీకి చెందిన మౌనిక, ప్రియాంక, రాధిక ముగ్గురు అక్కా చెల్లెలు. వీరి తండ్రి చాలా కాలం క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి తల్లి రేణుక కూలి పని చేస్తూ ముగ్గురు ఆడపిల్లలతో పాటు మరో కుమారున్ని పోషిస్తోంది. పిల్లలందరినీ ఉన్నత చదువులు చదివించింది. పోలీస్‌ కావాలని కోరిక ఉన్నా ఆర్థిక ఇబ్బందులున్నాయి. ఈ శిబిరంలో చేరి ఎట్టకేలకు పోలీసు శాఖ నిర్వహించిన కానిస్టేబుల్‌ నియామక పరీక్షల్లో ఉత్తీర్ణత పొంది ఉద్యోగాలు సాధించారు. విజేతలుగా నిలిచారు. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు అక్కాచెల్లెలు ఎంపిక కావడంతో ఆతల్లి ఆనందానికి అవుదులు లేవు.
సాధించి చూపించారు

బాలపూర్‌ మండలం శ్రీరామ్‌నగర్‌కాలనీకి చెందిన దర్జి పనిచేసే నర్సింహులు కుమారులు నవీన్‌, అరుణ్‌. నవీన్‌ డిగ్రీ పూర్తిచేయగా, అరుణ్‌ ప్రస్తుతం బాసర త్రిపుల్‌ ఐటీలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. నవీన్‌ గతంలో పోలీసుశాఖలో ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పటికీ కొంచెంలో తప్పాడు. అప్పటి నుంచి ఎలాగైనా విజయం సాధించాలని తపనతో ఉన్నాడు. అద్దె ఇంట్లో నివాసం ఉండే నీవన్‌ కుటుంబ సభ్యులు అతనికి మంచి శిక్షణ ఇప్పించే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ]్యంలో ఉచిత శిక్షణ గురించి తెలుసుకొని అతని తమ్ముడిని అతనితో పాటు తీసుకెళ్లాడు. పట్టుదలతో చదివి అక్కడ ఉపాధ్యాయులు, పోలీసుల సూచనలు పాటించి ఇద్దరు అన్నాదమ్ములు పోలీసులయ్యారు.

‘నాన్న నీ ఆశయం నెరవేరుస్తాం’
శివరాంపల్లికి చెందిన విశ్రాంత పోలీసు ఎస్సై రమేశ్‌ కుమారుడు ప్రశాంత్‌, కుమార్తె ఉషా ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. చిన్నప్పటి నుంచి పోలీసుగా తండ్రిని చూసిన వారు ఎలాగైనా పోలీసులు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఎస్సై కావాలనేది తన తండ్రి కోరిక అని.. వాళ్లిద్దరూ.. అభినందన సభలో ప్రసంగించి అందరినీ కంటతడి పెట్టించారు. తన తండ్రి కలను నెరవేర్చలేకపోయామనని, కానీ పోలీసు శాఖలో మాత్రం అడుగుపెడుతున్నామని అన్నారు. ‘నాన్న మమ్ని క్షమించు ఎప్పటికైనా పోలీసుశాఖలో ఉన్నత ఉద్యోగం సాధిస్తాం.. నీ కల నేరవేరుస్తాం’ అని ఉద్వేగానికి లోనయ్యారు.

అమ్మ కోసం ఏదైనా చేస్తాం..
రాజేంద్రనగర్‌ భవానీకాలనీకి చెందిన దేవెంద్రమ్మకు ఇద్దరు ఆడపిల్లలు. సొంతగ్రామం తాండూరు. పిల్లలు చిన్నప్పుడే భర్త చనిపోవడంతో పొట్టచేత పట్టుకొని తన తల్లిగారి ఇంటికి వచ్చింది. అక్కడే స్థానికంగా కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. పెద్ద కుమార్తె బి.మౌనిక డిగ్రీ పూర్తిచేయగా, మనీషా డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. చిన్నప్పటి నుంచి తమను పెంచడానికి తల్లిపడిన శ్రమను చూసిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు భవిష్యత్తులో తల్లిన బాగా చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానిస్టేబుళ్ల అర్హత పరీక్ష రాయడానికి ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరం గురించి తెలుసుకున్నారు. అక్కడ ప్రవేశం పొంది కష్టపడి చదివారు. ఎట్టకేలకు విజయం సాధించారు. తమ తల్లిని బాగా చూసుకోవడానికి అవకాశం ఏర్పడిందని సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.