close

శనివారం, జనవరి 25, 2020

ప్రధానాంశాలు

కొలువుల మాటున కంత్రీలు

రూ.లక్షలు గుంజేసి.. చిరునామా మార్చేసి..

దేశ విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం

నిరుద్యోగుల బలహీనత ఆసరాగా గాలం

చేప చిక్కాలంటే వానపామును ఎరగా వెయ్యాలి.. ఈ సూత్రాన్నే కొందరు అక్రమార్కులు అనుసరిస్తున్నారు. నిరుద్యోగులను ముగ్గులోకి దింపడానికి ఉద్యోగాన్ని ఎరగా చూపుతున్నారు. కోరుకున్న చోట ఉద్యోగం కావాలంటే రూ.లక్షలు ఇవ్వాలని నమ్మబలుకుతున్నారు. జీవితం సెటిలైైపోయినట్లేనని మాయమాటలు చెబుతున్నారు. ఇంకేముంది.. గుడ్డిగా నమ్మి రూ.లక్షలు చేతిలో పెడితే.. కొన్నాళ్లపాటు కాలయాపన చేసి.. చిరునామాలు మార్చేస్తూ.. బోర్డులు తిప్పేస్తూ తర్వాత మెల్లగా జారుకుంటున్నారు. పాచిక పారితే సరే.. లేదంటే కటకటాల వెనక్కి వెళ్తున్నారు. దొరికితే దొంగలు.. లేదంటే దొరల్లా వ్యవహారం సాగిపోతోంది.

 

ఈనాడు, కాకినాడ

జిల్లాలో దేశ, విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసాలు చాపకింద నీరులా సాగుతున్నాయి. దుబాయ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు.. గల్ఫ్‌లో కొలువులున్నాయని ఇంకొందరు.. రక్షణ, రైల్వే రంగాల్లో.. ప్రైవేటు రంగంలో పేరున్న సంస్థల్లో ఇలా కోరుకున్నచోట కొలువు అంటూ మరికొందరు దగాచేస్తున్నారు. కడుపు మండి కొందరు పోలీసులను ఆశ్రయిస్తుంటే.. కేసుల వరకు వెళ్తే భవిష్యత్తు ..మిగతా 9లోనాశనం అవుతుందనే ఆందోళనతో కొందరు మిన్నకుండిపోతున్నారు. ఉద్యోగాలే కాక ఇతర చీటింగ్‌ కేసులూ జిల్లాలో ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఆన్‌లైన్‌ మోసాలు.. లాటరీలు పేలాయి.. ఇంత కడితే.. భారీగా చేతికి అందుతుందని మెసేజ్‌లతోనూ మాయచేస్తూ జేబులు కొల్లగొడుతున్నారు. మరికొందరైతే ఏకంగా రాజకీయ పలుకుబడులు ఉన్నాయని నమ్మబలుకుతూ అందినకాడికి దండుకుంటున్నారు.

కొలువు ముసుగులో.. దగా దగా..

జిల్లాలోని పిఠాపురం మండల పరిధిలో ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో డబ్బులు ఇచ్చి పలువురు మోసపోయారు. పిఠాపురం పట్టణంలోని వెలమపేటకు చెందిన బీటెక్‌ విద్యార్థి పి.సాయిసింహాద్రి బి.టెక్‌ చదివాడు. రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. సోషల్‌ మీడియా ద్వారా హైదరాబాద్‌కు చెందిన కొందరు పరిచయం అయ్యారు. ఉద్యోగం ఇప్పిస్తామని రూ.2.50లక్షలు ఆన్‌లైన్‌లో వేయించుకుని చేతులు ఎత్తేశారు. ఈనెల ఆరో తేదీన అతడి ఫిర్యాదు మేరకు పిఠాపురం పోలీసులను ఆశ్రయించాడు.

* కొత్తపల్లి మండలం నాగూలాపల్లికి చెందిన బీటెక్‌ విద్యార్థులు బి.సోమశేఖర్‌, రామభూపాల్‌ బి.టెక్‌ ఉద్యోగం కోసం ఓ వ్యక్తిని ఆశ్రయించి మోసపోయారు. కాకినాడలో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తామనే ప్రకటన బోర్డు చూసి వెళ్లారు. ఈ సంస్థ యజమాని బ్యాంకు ఖాతాకు అతను కోరిన రూ.2లక్షలు జమచేశారు. నిరీక్షించినా ఉద్యోగం దక్కకపోవడంతో పిఠాపురం గ్రామీణ పోలీసులను బాధితులు ఆశ్రయించారు.

* కాకినాడలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదివిన తొండంగి, కాకినాడకు చెందిన ఇద్దరు విద్యార్థులతోపాటు విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతానికి చెందిన ఇద్దరు, ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుకు చెందిన ఓ విద్యార్థి స్నేహితులు వీరికి ఓ ఇద్దరు వ్యక్తులు పరిచయం అయ్యారు. ఓ పేరున్న ప్రైవేటు సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రూ.5 లక్షలు చొప్పున వసూలు చేశారు. కాల్‌ లెటర్‌ వస్తుంది శిక్షణకు సిద్ధంగా ఉండాలని నమ్మబలికారు. గతేడాది సెప్టెంబర్‌ 10న ముంబైలో శిక్షణ ఉందంటూ ఓ నకిలీ కాల్‌ లెటర్‌ అందింది. ఎట్టకేలకు మోసపోయినట్లు గుర్తించిన బాధిత విద్యార్థులు లబోదిబోమన్నా ప్రయోజనం లేకపోయింది. దీంతో వీరంతా పోలీసులను ఆశ్రయించారు.

* కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఓ వ్యక్తిని మోసం చేసిన వ్యవహారంపై ముమ్మిడివరం పోలీస్‌ స్టేషన్‌లో ఇటీవల కేసు నమోదయ్యింది. రాజుపాలెంకు చెందిన జనిపెల్ల అశోక్‌కు రామచంద్రపురం మండలం చోడవరానికి చెందిన కొందరు వ్యక్తులు రూ.5 లక్షలు ఇస్తే తపాలా శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన అశోక్‌ సంబంధితుల బ్యాంకు ఖాతాలో రూ.4లక్షలు జమచేశాడు. మిగిలిన రూ.లక్ష కూడా ఇవ్వాలని వారు ఒత్తిడి చేస్తున్న క్రమంలో తన ఉద్యోగం సంగతి ఏంటని నిలదీశాడు. ఈ క్రమంలో వారి నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో బాధితుడు ఈనెల 8న పోలీసులకు పిర్యాదు చేశాడు.

* పిఠాపురం మండలం విరవ గ్రామానికి చెందిన చక్రధరరావు ఇంటర్‌ చదివాడు. బంధువుల ద్వారా పెద్దిపాలెం, గోకివాడ, మచిలీపట్నం ప్రాంతాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు పరిచమయ్యారు. తపాలాశాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించడంతో రూ. 2లక్షలు ముట్టజెప్పాడు. ఎంతకీ ఉద్యోగం దక్కకపోవడంతో న్యాయంచేయాలంటూ గ్రామీణ పోలీసులను ఆశ్రయించాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు.


 

గన్నవరం టు ఇజ్రాయిల్‌..

‘ఇజ్రాయిల్‌లో కొలువు ఇప్పిస్తానని నమ్మించి డబ్బు కాజేసిన వ్యక్తిపై పి.గన్నవరం పోలీసులు డిసెంబరు 4న చీటింగ్‌ కేసు నమోదుచేశారు. ఆర్‌.ఏనుగుపల్లిలోని కారుపల్లి ప్రాంతానికి చెందిన 25 మందిని ఉపాధి కోసం ఇజ్రాయిల్‌ పంపుతానని ముంబయిలోని బేలాపూర్‌ ప్రాంతానికి చెందిన మెల్విన్‌పుర్తాండో రెండు విడతలుగా వారి నుంచి డబ్బులు వసూలు చేశాడు.


 

రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామని..

‘ రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి తొండంగి మండలానికి చెందిన పి.సింహాచలం, కె.గంగరాజు, కె.కృష్ణల వద్ద 2017లో అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, అమలాపురానికి చెందిన మరో వ్యక్తితో కలిసి రూ.19 లక్షలు వసూలు చేశారు. ఉద్యోగానికి సంబంధించిన కాల్‌ లెటర్‌ వస్తుందని రెండేళ్లు నిరీక్షించినా ఫలితం లేకపోవడంతో ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది.’


 

ఉద్యోగాల పేరుతో మోసగిస్తే కఠిన చర్యలు

ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగులను మోసంచేస్తే కఠిన చర్యలు తప్పవు. ఈ తరహా మోసాలపై నిఘా ఉంచాం. ప్రజలు, ప్రధానంగా నిరుద్యోగులు ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలో ఉద్యోగాల పేరుతోపాటు పలు విధాలుగా ఆశచూపుతూ మోసపుచ్చుతున్న వ్యవహారంపై చీటింగ్‌ కేసులు అక్కడక్కడా నమోదవుతున్నాయి. బాధితుల నుంచి అందుతున్న ఫిర్యాదులపై కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నాం.

- అద్నాన్‌ నయీం అస్మి, జిల్లా ఎస్పీ


 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.