close

శుక్రవారం, ఆగస్టు 14, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉపాధి కల్పనే అభివృద్ధికి ఊతం  

ఈనాడు డిజిటల్, కడప : వ్యవసాయం, పండ్లతోటలు, మైనింగు, వాణిజ్యంలో పేరొందిన జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వ పరంగా ఇంకా చాలా చేయాల్సి ఉందని అనేకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో విడిది చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తగిన చర్యలకు ఉపక్రమించాలని కోరుతున్నారు. 
*జిల్లా పరిధిలో యువతకు వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రత్యేక కృషి చేయాల్సిన అవసరం ఉంది. జిల్లాలో సరైన పనులు లభించక చాలామంది కువైట్, ఇతర గల్ఫ్‌ దేశాలకు వలస వెళుతున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆయా దేశాలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తమ దేశంలోని వలసదారులను 30 శాతానికి కుదించాలని ఇటీవల కువైట్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది అమల్లోకి వస్తే జిల్లాకు చెందిన ఎక్కువ శాతం మంది ప్రవాసీలు తిరిగి స్వదేశాలకు రావాల్సి ఉంటుంది. అలాంటి వారికి జిల్లాలోనే ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 
*జమ్మలమడుగులో నిర్మించ తలపెట్టిన ఉక్కు కర్మాగారం, సకాలంలో పూర్తి చేయటం, కడప నగర శివారులోని కొప్పర్తి పారిశ్రామికవాడ ద్వారా ఉపాధి కల్పన పనులను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయాల్సి ఉంది. 
*జిల్లాలో 83 వేలకుపైగా హెక్టార్లలో పండ్ల తోటలు సాగులో ఉన్నాయి. గతంలో రైల్వేకోడూరు మండలం అనంతరాజుపల్లెలో అప్సా పండ్ల రసాల తయారీ కర్మాగారం ఉండేది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే పండ్ల రసాలకు దేశవ్యాప్తంగా మంచి గిరాకీ లభించేది. కాలక్రమంలో నిర్వహణ కష్టమై ఇది మూతపడింది. తిరిగి పునఃప్రారంభిస్తామని నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ విషయంలో ప్రస్తుత ప్రభుత్వం చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు. 
*రాజంపేట నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు లేక యువత ఇబ్బందులు పడుతోంది. నియోజకవర్గంలోని నందలూరులో 33 ఏళ్ల కిందట అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ఫ్రిజ్‌లు తయారుచేసే ఆల్విన్‌ పరిశ్రమను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇక్కడ ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 వేల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు ఉండేవి. 20 ఏళ్ల క్రితం నష్టాలు వస్తున్నాయన్న సాకుతో ఈ పరిశ్రమను మూసేశారు. గడిచిన కొన్నేళ్లుగా ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని పాలకులు చెబుతున్నా ఇప్పటికీ హామీ నెరవేరలేదు. 
*పసిడి వర్తకంలో ప్రొద్దుటూరుకు 160 ఏళ్ల ఘనచరిత్ర ఉంది. సీమ జిల్లాలతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి బంగారు ఆభరణాల కొనుగోళ్లకు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. బంగారు ఆభరణాల తయారీ చేతివృత్తిపై ఆధారపడి సుమారు 2 వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇటీవల యంత్రాల వాడకం పెరుగుతుండటంతో స్వర్ణకారులు ఇతర వృత్తులవైపు మొగ్గు చూపుతున్నారు. యంత్రాలకు దీటుగా స్వర్ణకారులు ఆభరణాలను, ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలంటే వారికి స్వర్ణకారీ రంగంలో శిక్షణ ఇప్పించాలి. దీనికోసం ప్రొద్దుటూరు పట్టణంలో నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను స్వర్ణకారులు కోరుతున్నారు. 
*2005-06లో చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో రూ.7.38 కోట్ల వ్యయంతో మైలవరం మండలంలో టెక్స్‌టైల్‌ పార్కును నిర్మించేందుకు అప్పటి ప్రభుత్వం సంకల్పించింది. దొమ్మర నంద్యాల, వేపరాల, మైలవరం, మోరగుడి, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లోని నేత కార్మికులు, అద్దకం పరిశ్రమలపై ఆధారపడిన ఉత్పత్తిదారులకు ఇది ఉపయోగపడుతుంది. మాస్టర్‌ వీవర్స్‌కు మేలు చేయాలనే ఉద్దేశంతో 62.18 ఎకరాలను దీని కోసం కేటాయించారు. సుమారు రూ.7 కోట్లు వెచ్చించి స్థలాన్ని ప్లాట్లుగా విభజించడంతోపాటు రహదారి, డ్రైనేజీ, రక్షణగోడ, గదులు, పరిపాలనా భవనాలు నిర్మించారు. ఇంత వ్యయం చేసినా పలు కారణాలతో ఈ పార్కు నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. 
*ప్రొద్దుటూరులోని పాల పరిశ్రమ, చెన్నూరులోని చక్కెర కర్మాగారాన్ని తిరిగి ప్రారంభిస్తే రైతులకు మేలు జరగడంతోపాటు పలువురికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు. 


 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.