close

ప్ర‌త్యేక క‌థ‌నం

బోరు నడవదు.. గొంతు తడవదు

పట్టణాల్లో నీటికి ప్రజల కటకట 
నాలుగైదు రోజులకోసారి నీళ్లు 
నెలాఖరు తరువాత మరింత కష్టం 
వర్షాల కోసం నిరీక్షణ 
ఈనాడు - అమరావతి

పట్టణవాసులు దాహార్తితో అల్లాడుతున్నారు. పట్టణాలకు నాలుగైదు రోజులకోసారి నీరు సరఫరా అవుతోంది. ఏడేళ్లలో ఎప్పుడూ ఎదురుకాని గడ్డు పరిస్థితులను ఈసారి  ఎదుర్కొంటున్నారు. కుళాయిల నుంచి గంటపాటు ధారాళంగా నీళ్లొచ్చే పరిస్థితి ఎక్కడా లేదు. పేరుకు ట్యాంకర్లు వస్తున్నా అరకొర సరఫరాతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. విజయనగరం, ఒంగోలు, గిద్దలూరు, కడపలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. మరో 20 పట్టణాల్లో రెండు, మూడు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. నెలాఖరులోగా వర్షాలు కురవకపోతే ఈ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయమయ్యే అవకాశాలున్నాయి. మరో 32 పట్టణాల్లో తాగునీటి సమస్య మొదలవుతుందని అంచనా వేస్తున్నారు.

వర్షాభావం ప్రభావంతో.. 
గతేడాది వర్షాభావ పరిస్థితులు ఈ వేసవిలో తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం చూపాయి. 38 జలాశయాలు ఏప్రిల్‌కే పూర్తిగా అడుగంటాయి. మరో 25 నదుల్లో నీటి ప్రవాహం నిలిచిపోవడంతో పట్టణ ప్రజలకు నీటిని అందించడంలో కీలకమైన ప్రధాన పంపుహౌసుల్లో పంపింగుకు అంతరాయం ఏర్పడింది. భూగర్భజలాలు సైతం 80 అడుగుల నుంచి మొదలై క్రమంగా 110, 120, ప్రస్తుతం 150 అడుగులకు పడిపోయింది. ఇళ్లలో బోర్లు పని చేయడం లేదు. ప్రస్తుతం 25 నుంచి 30 పట్టణాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. మిగతా చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వల్ల ప్రస్తుతానికి నీళ్లందుతున్నా భవిష్యత్తులో అక్కడా కష్టమేనని అధికారులు అంచనా వేస్తున్నారు. అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం, చిత్తూరు, కృష్ణా, గుంటూరు జిల్లాలలోని పలు పురపాలక, నగరపాలక సంస్థల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. 
నాలుగైదు రోజులకోసారి నీళ్లు సరఫరా చేస్తున్నవి : 

* విజయనగరం

* ఒంగోలు

* గిద్దలూరు

* కడప

 

రెండు, మూడు రోజులకోసారి అందిస్తున్నవి 
ఆత్మకూరు (కర్నూలు జిల్లా), బద్వేల్‌, గుత్తి, హిందూపురం, మచిలీపట్నం, మదనపల్లె, మార్కాపురం, నందిగామ, నర్సీపట్నం, పామిడి, పలమనేరు, పెడన, ప్రొద్దుటూరు, పుత్తూరు, రాయచోటి, రేపల్లె, తిరువూరు, ఎమ్మిగనూరు, ఎర్రగుంట్ల విజయనగరానికి మూడు రోజులకోసారి నీరు విశాఖకు నీరందిస్తున్న తాటిపూడి జలాశయం నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో విజయనగరం కోసం ప్రతిరోజూ ఒక మిలియన్‌ గ్యాలన్‌ నీటిని గోస్తనీ నదిలో విడిచిపెడుతున్నారు. అదే విధంగా చంపావతి నదిలోకి తోటపల్లి జలాశయం నుంచి 400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో రెండు ప్రాంతాల్లోని ఊటబావుల్లో పెరిగే 14 నుంచి 15 మిలియన్‌ లీటర్ల నీటిని రోజూ సమీకరిస్తున్నారు. ఈ నీటిని విజయనగర వాసులకు మూడు రోజులకోసారి అందిస్తున్నారు. ఇప్పటికీ పైపులైన్లకు నోచుకోని ప్రాంతాల్లో భూగర్భజలాలు వంద అడుగుల్లోకి పడిపోయి ఇళ్లలోనూ బోర్లు పనిచేయడం లేదు. అలాంటి ప్రాంతాలకు 16 ట్యాంకర్లతో రోజు విడిచి రోజు ఇస్తున్నారు.


గిద్దలూరులో ఐదు రోజులకోసారి.. 

భూగర్భజలాలు 500 నుంచి 550 అడుగులకు పడిపోవడంతో ప్రకాశం జిల్లా గిద్దలూరులో నాలుగు నుంచి ఐదు రోజులకోసారి నీరు ఇస్తున్నారు. ఈ నగర పంచాయతీలో వేసవి ప్రారంభమైందంటే తాగునీటి కష్టాలు మొదలైనట్లే. ఈ ఏడాది నగర పంచాయతీ ఆధ్వర్యంలో బోర్లతోపాటు ఇళ్లలోని బోర్లు రెండు నెలల క్రితమే పూర్తిగా మొరాయించడంతో ఇతర ప్రాంతాల నుంచి 53 ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి ట్యాంకర్లతో అధికారులు రప్పించి ప్రజల దాహార్తిని తీర్చుతున్నారు.


 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.