
ప్రత్యేక కథనం
మొక్కజొన్న ధర పెరగడంతో ఉత్పత్తి వ్యయం పైపైకి
మండువేసవి కొనసాగుతుండటంతో పరిశ్రమ నిర్వాహకుల ఆందోళన
ఈనాడు - గుంటూరు
రాష్ట్రంలో కోళ్ల పరిశ్రమ కష్టాల కొలిమిలో మగ్గుతోంది. దిగిరాని దాణా ధరలు, కొనసాగుతున్న మండుటెండలు తదితర కారణాలతో గుడ్ల ఉత్పత్తి ఖర్చు గణనీయంగా పెరిగింది. జూన్‌లో సగం రోజులు గడిచినా తొలకరి మాటే లేక అధిక ఉష్ణోగ్రతల్లో కోళ్లను రక్షించుకోవడానికి నిరంతరం నీటిని చల్లుతు ఉపశమనం కలిగిస్తున్నారు. లభ్యత తగ్గిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని కొనాల్సి వస్తోంది. అష్టకష్టాలు పడి కోడిగుడ్లు ఉత్పత్తి చేస్తున్నా మార్కెట్లో గిట్టుబాటు ధర లభించడం లేదు.
మే నెలలో కనిష్ఠంగా రైతులు రూ.2.70లకు కూడా గుడ్లు విక్రయించారు. ఏప్రిల్, మే నెలల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవుల కారణంగా గుడ్ల వినియోగం తగ్గింది. వేసవిలో ప్రజలు గుడ్లు తక్కువగా తీసుకోవడం వల్ల ధరలు క్షీణించాయి. జూన్ నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరవడంతో వాటి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ నుంచి ఎండలు తీవ్రం కావడంతో సగటున 10శాతం గుడ్ల ఉత్పత్తి పడిపోయింది. ఏప్రిల్, మే నెలల్లో ఉండే ఈ పరిస్థితి ఈసారి జూన్‌లోనూ కొనసాగుతోందని నిర్వాహకులు వాపోతున్నారు.
నానాటికీ పెరుగుతున్న ఖర్చు
కోళ్ల పెంపకంలో సింహభాగం 80శాతం సొమ్ము దాణాకే వెచ్చిస్తున్నారు. దాని తయారీకి మొక్కజొన్న, బియ్యం నూకలు ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా మొక్కజొన్న ఉత్పత్తి తగ్గడంతో ఈ ఏడాది ధరలు పెరిగాయి. క్వింటా రూ.1400ల నుంచి రూ.2200 వరకు ధర పలుకుతోంది. నూకల ధరలూ అదేస్థాయిలో పెరిగాయి. మధ్యలో మొక్కజొన్న కన్నా కాస్త తక్కువ ధరకు లభించటంతో గోధుమలనూ దాణాగా వినియోగించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఒక్కో గుడ్డు ఉత్పత్తికి సగటున రూ.4.20లు వరకు ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉత్పత్తయ్యే కోడిగుడ్లలో 30శాతం స్థానికంగా వినియోగిస్తున్నారు. 70శాతం ఉత్తరాదికి ఎగుమతి అవుతున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్, బిహార్, ఒడిశాలో అక్కడి ప్రభుత్వాలు రాయితీలిచ్చి ప్రోత్సహిస్తుండడంతో కోళ్ల పరిశ్రమలో పోటీ వాతావరణం ఏర్పడింది. ఇలా రకరకాల ఒడిదొడుకుల కారణంగా కోళ్ల పరిశ్రమ నష్టాలను చూడాల్సి వస్తోంది.
ఎండవేడితో తగ్గిన ఉత్పత్తి
సాధారణంగా కోళ్లు 26 డిగ్రీల నుంచి 32 డిగ్రీల వాతావరణంలో బాగా పెరుగుతాయి. ఈసారి వేసవిలో చాలా ప్రాంతాల్లో 46డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడం సంకటంగా మారి గుడ్ల ఉత్పత్తి పడిపోయింది. కోస్తాలో సెప్టెంబరు వరకు ఉష్ణోగ్రతల వల్ల ఇలాంటి ఇబ్బంది తప్పదని పౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు. వేసవిలో రాత్రిపూట ఒంటిగంట వరకు నీటిని చల్లాల్సి వస్తోంది. గుడ్ల ఉత్పత్తి కంటే కూడా కోళ్ల సంరక్షణపైనే యాజమాన్యాలు దృష్టిసారించాయి. కోళ్లకు తాగడానికి రోజుకు 250మిల్లీలీటర్లు, బతికించుకోవడానికి 750 మిల్లీలీటర్ల నీటిని వినియోగిస్తున్నారు. భూగర్భజలాలు అడుగంటిన చోట నిర్వాహకులు ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేసి వాడుతున్నారు. ఉష్ణోగ్రతలు ఏటా పెరుగుతుండటంతో ఖర్చుపెరిగినా శీతల వాతావరణం(ఏసీ షెడ్ల)లో కోళ్లు పెంచే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని గుంటూరుకు చెందిన కోళ్ల పరిశ్రమ యజమాని పరుచూరి ధర్మతేజ తెలిపారు. దీనివల్ల విద్యుత్తు బిల్లులు పెరిగినా నీరు, దాణా కొంతమేరకు ఆదా అవుతున్నాయని, కోళ్లలో మరణాలు తగ్గడం, పరిసర ప్రజలకు దుర్వాసన సమస్య ఉండదన్న ఉద్దేశంతో ఏసీ షెడ్లు ఏర్పాటుచేస్తున్నామన్నారు. దాణా ధరలతో పాటు వేసవికాలం వ్యవధి పెరగడం పరిశ్రమ మనుగడకు శాపంగా మారిందని ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు మూల్పూరి హరికృష్ణ తెలిపారు. రాయితీపై మొక్కజొన్న సరఫరాతో పాటు, ఆక్వాసాగుకు ఇచ్చినట్లు విద్యుత్తునుయూనిట్ రూ.1.50లకే అందించి ప్రభుత్వం పరిశ్రమను ఆదుకోవాలని ఆయన కోరారు.
మరిన్ని

దేవతార్చన
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- శరణార్థులకు పౌరసత్వం
- భాజపాకు తెరాస షాక్!
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- అమ్మ గురుమూర్తీ!