close

ప్ర‌త్యేక క‌థ‌నం

విద్యావనంలో విష వృక్షం

బాసర ఆర్జీయూకేటీలో  హెచ్‌వోడీ లైంగిక వేధింపులు
మార్కులు వేస్తానంటూ విద్యార్థినులకు ప్రలోభాలు
బాలికల వసతి గృహంలోనే తిష్ఠ
పదుల సంఖ్యలో బాధితులు
బాసర - న్యూస్‌టుడే

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ అధ్యాపకుడు సభ్య సమాజం తలదించుకునేలా చేశాడు. వసతి గృహంలో ఉన్న విద్యార్థినులకు గురువుగా మార్గదర్శకంగా ఉంటూ, తల్లిదండ్రుల వలే సంరక్షించాల్సింది పోయి వారిని లైంగికంగా వేధించాడు. మార్కులు వేస్తానంటూ, ప్రశ్నపత్రం లీక్‌ చేస్తానంటూ ప్రలోభపెట్టి చాలాకాలంగా విద్యార్థినులను వేధిస్తున్నాడు. బాధిత విద్యార్థినులు పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలిసింది.

నిర్మల్‌ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలోని ఓ విభాగాధిపతి అకృత్యాలు తాజాగా వెలుగుచూశాయి. ఓ విద్యార్థినికి అసభ్య సందేశాలు పంపి అధికారులకు దొరికిపోయాడు. ఆర్జీయూకేటీలో చదువుతున్న ఓ విద్యార్థిని కొన్ని రోజుల కిందట రెమీడియల్‌ (సప్లిమెంటరీ) పరీక్షల నిమిత్తం విద్యాలయానికి వచ్చింది. శుక్రవారం సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు ఔట్‌పాస్‌ నిమిత్తం మహిళా అధికారిణి (చీఫ్‌ వార్డెన్‌) దగ్గరకు వెళ్లగా, బయటకు వెళ్లాలంటే తల్లిదండ్రుల అనుమతి కావాలని, వారితో మాట్లాడిస్తే ఔట్‌పాస్‌ ఇస్తానన్నారు. దీంతో ఆ విద్యార్థిని తన తల్లికి ఫోన్‌ చేసివ్వగా.. చీఫ్‌వార్డెన్‌ మాట్లాడుతున్న సమయంలో సెల్‌ఫోన్‌కు అసభ్య సందేశాలు వచ్చాయి. పరీక్షలో పాస్‌కావాలంటే రాత్రికి నిజామాబాద్‌లోని తన ఇంటికి రావాలని, రుతుక్రమం తదితర అంశాలతో అసభ్యకర సందేశాలు రాగా.. గమనించిన ఆ అధికారిణి విద్యార్థినిని విచారించారు. ఎవరి సెల్‌ఫోన్‌ నుంచి ఈ సందేశాలు వచ్చాయో గుర్తించిన ఆ అధికారిణి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు విద్యార్థినిని ఆర్జీయూకేటీ మహిళాసెల్‌కు అప్పగించారు. వారు ఆమెను తమ అధీనంలో ఉంచుకుని ఫోన్‌ను సీజ్‌ చేశారు. శనివారం ఉదయం విద్యార్థిని తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో మరోసారి విచారించారు. దీంతో సదరు అధ్యాపకుని లీలలు బయటపడ్డాయి.

చాలా కాలంగా ఆరోపణలు
‘‘అధ్యాపకుడిపై చాలాకాలంగా పై ఆరోపణలు ఉన్నప్పటికీ దొరక్కుండా తప్పించుకున్నాడు. మార్కులు వేస్తానంటూ, ప్రశ్నపత్రం ముందుగానే ఇస్తానంటూ మైనర్‌ (పీయూసీ 1, పీయూసీ 2) విద్యార్థినులను లోబరుచుకునేవాడు. ఔట్‌పాస్‌ పేరిట విద్యార్థినులను బయటకు పంపి రెండు, మూడు రోజులపాటు తనతో బయటకు తీసుకెళ్లేవాడు. సెలవుల్లో సైతం విద్యార్థినులను ఇంటి నుంచి రప్పించుకునేవాడు.  ఈ విషయాలు అధికారుల దృష్టికి వచ్చినా ఊదాసీనంగా వ్యవహరించడంతో అతడి ఆగడాలు మరింత శృతిమించాయి. గతంలోనే అతనిపై ఫిర్యాదులు అందినా సరైన ఆధారాల్లేక చర్యలు తీసుకోలేకపోయారు’’ అని పలువురు విద్యార్థుల ద్వారా తెలియవచ్చింది. తాజాగా అతడి చీకటి పనులు బయటపడటంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఓ కమిటీని నియమించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

బాలికల వసతి గృహమే అడ్డా..
విభాగ అధిపతిగా తన అధికారాన్ని ఉపయోగించి సదరు అధ్యాపకుడు బాలికల వసతి గృహంలోనే తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మిగతా వారికి అక్కడ కార్యాలయాలు కేటాయించినా ఎవరూ వాటిని వినియోగించరు. తరగతి గదుల్లోనే ఎక్కువ సమయం ఉండి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తారు. అనంతరం ఇళ్లకు వెళ్లిపోతారు. కానీ ఈ అధ్యాపకుడు మాత్రం బాలికల వసతిగృహంలోని తన క్యాబిన్‌లోనే ఎక్కువసేపు గడిపేవాడు. చుట్టూ ఎప్పుడు విద్యార్థినులతో తరగతి గదుల్లో కన్నా క్యాబిన్‌లోనే అధికసమయం గడిపేవాడు. మరి కొందరు విద్యార్థినులను శనివారం సుదీర్ఘంగా విచారించిన అధికారులు వారి వాంగ్మూలాలను సైతం నమోదు చేసుకున్నారు.

ఫోన్లో వేధింపులు నిజమే: విద్యాలయ ఏవో శ్రీహరి
విద్యార్థినులకు వేధింపుల విషయమై విద్యాలయ పరిపాలన అధికారి శ్రీహరి వివరణ కోరగా.. విద్యార్థినిని తన ఇంటికి రమ్మని ఆమె సెల్‌ఫోన్‌కు రసాయనశాస్త్ర విభాగాధిపతి రవి వరాల సందేశాలు పంపాడని, పరీక్షల్లో మార్కులు వేసేందుకు డబ్బులు తీసుకున్నాడని తమ విచారణలో తేలిందన్నారు. మరికొందరు విద్యార్థినులను విచారిస్తామని తెలిపారు. సమగ్ర విచారణకు కమిటీని నియమించామని చెప్పారు. కమిటీ నివేదిక మేరకు అధ్యాపకునిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.