close

ప్ర‌త్యేక క‌థ‌నం

సంస్కరణ కాదు.. ఆకర్షణే?

కేంద్ర బడ్జెట్‌ పేరుకు తాత్కాలికమే కావొచ్చుగానీ.. మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలను పెట్టుకుని మోదీ ప్రభుత్వం దీన్ని తాత్కాలికంగా తీసుకునే అవకాశం కనబడటం లేదు. అధికారికంగా ఎన్నికల ప్రకటన విడుదలైతే ఎలాంటి ప్రత్యేక పథకాలూ ప్రకటించే అవకాశం ఉండదు కాబట్టి ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాకముందే ఏదో రూపంలో సాధ్యమైనన్ని జనాకర్షక పథకాలకు బడ్జెట్‌లో స్థానం కల్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో భాజపాకు ఎదురుగాలి వీచటం కూడా మోదీ సర్కారు బడ్జెట్‌ విషయంలో కాస్త దూకుడుగా వెళ్లేందుకు దోహదం చేసే అవకాశం ఉంది. వీటన్నింటి  దృష్ట్యా రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్రకటనలు, చిన్న వ్యాపారులను ఆకట్టుకునేందుకు సహాయం, ప్రత్యేక ప్రకటనల తాయిలాలు తప్పనిసరిగా బడ్జెట్లో ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మధ్య తరగతిని ఆకట్టుకునేందుకు ఆదాయపు పన్ను విషయంలోనూ కొన్ని మినహాయింపు ప్రకటనలు ఉండొచ్చని అంటున్నారు.


 

రైతన్నల కోసం...

గత రెండేళ్లుగా దేశవ్యాప్తంగా రోడ్డెక్కి నిరసనలు చేస్తున్న రైతన్నలను మోదీ ప్రభుత్వం విస్మరించే అవకాశం లేదు. ముంబయి వీధుల్లో, మధ్యప్రదేశ్‌ మందసర్‌లో, మహారాష్ట్రలో, చివరికి దిల్లీ వీధుల్లో కూడా వీరి ఆగ్రహం వెల్లువెత్తింది. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మద్దతు ధరలూ, రుణమాఫీలంటూ రకరకాల హామీలిచ్చినా పరిస్థితిలో ఏమంత మార్పు రాలేదు. మరోవైపు అన్నదాతలను కూడగట్టేందుకు విపక్షాలన్నీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల ముంగిట రైతన్నలను ప్రసన్నం చేసుకునేందుకు మోదీ ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను వేదికగా చేసుకోవటం అనివార్యంగా కనబడుతోంది. రైతుల కోసం బడ్జెట్లో తప్పనిసరిగా కొన్ని పథకాలో, ప్రోత్సాహకాలో ఖాయమని విశ్లేషకులంతా అంటున్నారు. ప్రభుత్వ, అధికార వర్గాలు కూడా ఈ దిశగా ఇప్పటికే కొన్ని సంకేతాలిచ్చాయి. కాకపోతే ఇవి ఏ రూపంలో ఉంటాయన్నదే ఇప్పుడు చర్చనీయాంశం. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు తరహాలో నేరుగా రైతులకు నగదు బదిలీ ప్రకటన చేసే అవకాశాలూ ఉన్నాయి. అయితే ఎన్నికలు ఎదుర్కొనబోతున్న ప్రభుత్వం ఆర్థికంగా దీర్ఘకాలిక ప్రభావం చూపే, ఖజనాపై భారాన్ని మోపే నిర్ణయాలేవీ తీసుకోవటానికి లేదంటూ ఇప్పటికే విపక్షాలు నానా రభసా చేస్తుండటంతో మోదీ ప్రభుత్వం ఆర్థికంతో సంబంధం లేని, రైతులను ఆకట్టుకునే మార్గాలు ఏమున్నాయన్నది తరచి చూస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది- రైతన్నలు తమ పంటలను ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా అమ్ముకునేందుకు వీలు కల్పిస్తూ.. అత్యవసర వస్తువుల చట్టం(ఈసీఏ)లోని కొన్ని నిబంధనలను రద్దుచేసే అవకాశం ఉంది. దీనివల్ల ఉల్లి, ఆలూ, పప్పులు, పంచదార, పాల వంటి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధాలు, నియంత్రణలన్నీ తొలగిపోయి, వీటిని విదేశాలకు విక్రయించుకునే వెసులుబాటు దొరుకుతుంది. అలాగే ఏ స్థాయిలో సరుకు నిల్వ ఉంచుకోవచ్చన్న దానిపైనా నియంత్రణలు తొలగిపోతాయి.

రెండోది- 2017-18 బడ్జెట్లో మోదీ ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టంలోని 40ఎ(3) నిబంధనకు సవరణలు చేస్తూ.. ఒక్క రోజులో ఎవరూ రూ.10,000లకు మించి నగదు రూపంలో చెల్లింపులు చెయ్యటానికి లేదన్న  నిబంధనను పట్టుకొచ్చింది. దీనివల్ల రైతాంగం కొంత ఇక్కట్ల పాలవుతోంది. తాజా బడ్జెట్‌లో ఈ నిబంధనను తొలగిస్తూ.. రైతులకు మాత్రం ఒక్కరోజులో రూ.2 లక్షల వరకూ చెల్లింపులు చెయ్యొచ్చనీ, దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లో నగదు మరింతగా చెలామణిలోకి వచ్చి రైతుల కష్టాలు కొంత వరకూ తీరతాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.


 

చిన్నవ్యాపారుల కోసం..

చిరకాలంగా భాజపాకు పెద్ద అండగా ఉంటున్న చిన్న వ్యాపారులు మోదీ సర్కారు పట్ల కొంత అసంతృప్తితో ఉన్నారన్న వాదనా ఉంది. ముఖ్యంగా రాత్రికి రాత్రి ప్రకటించిన పెద్దనోట్ల రద్దు వ్యవహారం, ఆ తర్వాత తీసుకువచ్చిన జీఎస్టీ విధానం- రెండూ చిన్న వ్యాపారాలను కుదిపేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రూ.40 లక్షల లోపు టర్నోవరు ఉన్న వ్యాపారాలకు పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. దీనికి తోడు తక్కువ వడ్డీ రుణాల వంటివి కూడా ప్రకటించే అవకాశం ఉందన్న వాదన వినపడుతోంది.
మొత్తమ్మీద.. ఎన్నికల అనివార్యతల రీత్యా మోదీ ప్రభుత్వం ఆర్థిక రంగాన్ని చక్కదిద్దే సంస్కరణలను పక్కనబెట్టటం తథ్యమని, ప్రకటనల రూపం ఏదైనా.. అంతిమంగా బయటకు రాబోతున్నది మాత్రం ‘ఎన్నికల  బడ్జెట్టేననీ’, దీని సారం జనాకర్షణే అవుతుందని నిపుణులు బలంగా నమ్ముతున్నారు.


 

ఇదీ బడ్జెట్‌ దిశ??

* వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీలు
* ‘నగదు బదిలీ’ తరహాలో రైతులకు ఆర్థిక భరోసా
* అన్నదాతలకు వడ్డీ రహిత రుణాలు
* ఆదాయపు పన్నులో కొత్తగా మినహాయింపులు
* చిన్న వ్యాపారులకు పన్ను రాయితీలతో భరోసా

-ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.