close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఆరింటిపై గురి

సర్వశక్తులూ ఒడ్డేందుకు కాంగ్రెస్‌ సన్నద్ధం 
కీలక నేతలకు ప్రతిష్ఠాత్మకం 
ముఖ్య నాయకులు ప్రచారం చేసేలా కసరత్తు 
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆరు స్థానాల్లో గెలుపుపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లోనూ పోటీ చేస్తుండగా.. మల్కాజిగిరి, చేవెళ్ల, నల్గొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్‌ స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే లక్ష్యంతో కార్యాచరణను సిద్ధం చేసుకుంది. ఈ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించిన పార్టీ అధిష్ఠానం ఎన్నికల్లోనూ వ్యూహాత్మకంగా వెళ్లాలని నిర్ణయించుకుంది. అందుకే ఇక్కడ కీలక నేతలను అభ్యర్థులుగా బరిలో దింపింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్గొండ నుంచి పోటీకి దిగగా, సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి నుంచి బరిలో ఉన్నారు. 
మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డిని తొలి జాబితాలోనే అభ్యర్థిగా ప్రకటించారు. ఖమ్మం స్థానం నుంచి మాజీ ఎంపీ రేణుకాచౌదరిని, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌ను మహబూబాబాద్‌లో పోటీలో నిలిపింది. తెరాస నుంచి కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్‌ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని చేవెళ్ల నుంచి నిలబెట్టింది. 
పార్టీకి గట్టి పట్టు 
కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఆరు స్థానాల అభ్యర్థుల ఎంపిక మాత్రం పూర్తిగా అధిష్ఠానం నిర్ణయమని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ స్థానాల్లో కాంగ్రెస్‌కు పట్టుండటమే కాకుండా అన్నింటిలోనూ గతంలో కాంగ్రెస్‌ ప్రాతినిథ్యం వహించినవి కావడం గమనార్హం. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో ఎక్కువ ఓట్లు కాంగ్రెస్‌కే వచ్చాయి. బలమైన అభ్యర్థులు కావడంతో పాటు ఆరు స్థానాల్లో బలమైన కేడర్‌, కార్యకర్తల బలం, వంటి అంశాలను కాంగ్రెస్‌ పరిగణనలోకి తీసుకుంది. వీటి పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ పార్టీ ఒకటి రెండుసార్లు మినహా అత్యధిక సార్లు గెలుపొందినవి కావడం సానుకూలాంశంగా భావిస్తోంది. 
తెరాసకు కొత్త అభ్యర్థులు తమకు లాభమే అంటున్న కాంగ్రెస్‌ 
చేవెళ్ల, ఖమ్మం, నల్గొండ, మల్కాజిగిరి స్థానాలకు తెరాస కొత్త అభ్యర్థులను బరిలో దింపడం కూడా తమకు లాభించే అంశమని కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు. ఈ ఆరు స్థానాల్లో ముఖ్య నేతలను ఎన్నికల ప్రచారానికి తీసుకురావాలని వ్యూహరచన చేస్తున్నారు. ఈ స్థానాల్లో ఎన్నికల సభలపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో చర్చిస్తున్నారు. ఆరు లోక్‌సభ స్థానాల్లోని నేతలతో సమన్వయ బాధ్యతను డీసీసీ అధ్యక్షులకు అప్పగించారు. లోక్‌సభ బాధ్యులను పార్టీ అధిష్ఠానం నియమించి ప్రచారం సహా ఎన్నికల వ్యూహాలను రూపొందిస్తోంది. 
నల్గొండకు కలిసొచ్చే సీనియర్లు 
కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయం మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్గొండ లోక్‌సభ బరిలో నిలిచారు. ఇటీవల హుజూర్‌నగర్‌ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ఉత్తమ్‌ ఈ స్థానానికి బలమైన అభ్యర్థి అవుతారని భావించింది. ఈయనకు సెగ్మెంట్‌ పరిధిలోని హుజూర్‌నగర్‌, కోదాడలో మంచి పట్టు ఉంది. ఈ లోక్‌సభ పరిధిలోనే మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్‌ నేత జానారెడ్డికు నల్గొండ, నాగార్జునసాగర్‌, మిర్యాలగూడలో పట్టుండటం అనుకూల పరిణామంగా పేర్కొంటున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిన స్థానాల్లో నల్గొండ ఒకటి. తర్వాత పరిణామాల నేపథ్యంలో సిట్టింగ్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెరాసలో చేరారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమకు అనుకూలత కాంగ్రెస్‌ భావిస్తుంది. గుత్తాను కాకుండా కొత్త అభ్యర్థిని తెరాస బరిలో దింపడంతో మరింత సానుకూలత ఏర్పడిందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. 
ఖమ్మం, మహబూబాబాద్‌లో అసెంబ్లీ ఫలితాలే వస్తాయని ధీమా 
ఖమ్మంలో కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరిని నిలిపింది. పలువురు ఈ టికెట్‌ కోసం పోటీపడినా ఏఐసీసీ.. రేణుక వైపు మొగ్గు చూపింది. ఖమ్మం లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు చోట్ల కాంగ్రెస్‌ నెగ్గింది. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తున్న మధిర స్థానం కూడా ఖమ్మంలోనే ఉంది. ఇక్కడ నెగ్గిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ముగ్గురు తెరాసలో చేరారు. కాంగ్రెస్‌కు బలమైన వర్గం ఉందని, ఇది అనుకూల పరిణామమని అక్కడి నేతలు భావిస్తున్నారు. సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాకుండా తెదేపా మాజీ నేత నామా నాగేశ్వరరావును తెరాస అభ్యర్థిగా ప్రకటించింది. పొంగులేటి వర్గం అసంతృప్తి పరోక్షంగా తమ పార్టీకి దోహదపడుతుందని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. 
మహబూబాబాద్‌ నుంచి పోటీకి కొత్త అభ్యర్థులు ముందుకు వచ్చినా కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌కే టికెట్‌ ఇచ్చింది. ఈయనకు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పట్టుండటంతో పాటు ఇటీవల శాసనసభ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు నాలుగు చోట్ల కాంగ్రెస్‌ నెగ్గింది. ఇక్కడ గెలిచిన వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉందనే ధీమాతో కాంగ్రెస్‌ ఉంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కవితను తెరాస అభ్యర్థిగా బరిలో దింపింది.

కోమటిరెడ్డి బరి.. భువనగిరి

భువనగిరి స్థానాన్ని కాంగ్రెస్‌ గెలుపునకు అవకాశమున్న కీలక స్థానంగా భావిస్తోంది. ఇక్కడ కూడా పలువురు టికెట్‌కు పోటీ పడినా మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బరిలో దింపింది. వెంకటరెడ్డి సోదరుడు ప్రస్తుత ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి భువనగిరి లోక్‌సభ స్థానంలో 2009లో నెగ్గారు. కోమటిరెడ్డి సోదరులకు ఈ నియోజకవర్గంలో పట్టు ఉంది. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ఈ లోక్‌సభ పరిధిలోని మునుగోడు, నకిరేకల్‌ను కాంగ్రెస్‌ గెలుచుకుంది. పార్టీ బలంతో పాటు అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లేందుకు కోమటిరెడ్డి సోదరులు ప్రయత్నిస్తున్నారు.

మల్కాజిగిరిలో వ్యూహాత్మకంగా రేవంత్‌

హైదరాబాద్‌తో ముడిపడి ఉన్న మల్కాజిగిరి స్థానం నుంచి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా బరిలో దింపింది. తెదేపా మాజీ నాయకుడు రేవంత్‌రెడ్డి అభ్యర్థి అయితే అందరి మద్దతు ఉంటుందని కాంగ్రెస్‌ భావించింది. ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు స్థానాలను ఇటీవల తెరాస దక్కించుకుంది. 2014 ఎన్నికల్లో ఈ ఏడింటిలో తెదేపా నాలుగు స్థానాల్లో నెగ్గింది. 2009లో మల్కాజిగిరి లోక్‌సభను కాంగ్రెస్‌ దక్కించుకోగా, 2014లో తెదేపా గెలుచుకుంది. రేవంత్‌రెడ్డి అభ్యర్థిగా ప్రకటించిన మరుసటి రోజునుంచే ప్రచారంలో ముందున్నారు.

చేవెళ్లపై కొండంత ఆశ

తెరాస సిట్ట¨ంగ్‌ స్థానమైన చేవెళ్లలో సిట్ట¨ంగ్‌ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కీలక నేత సబితా ఇంద్రారెడ్డి తెరాసలో చేరడం కాంగ్రెస్‌పై ప్రతికూలాంశమైనప్పటికీ పార్టీ కేడర్‌ అంతా తమతోనే ఉందని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో మహేశ్వరం, తాండూరు స్థానాల్లో కాంగ్రెస్‌ నెగ్గింది. వికారాబాద్‌లో కాంగ్రెస్‌ నేతల మధ్య విభేదాలను పరిష్కరించింది. ఇక్కడ తెరాస కొత్త అభ్యర్థిని బరిలో దింపింది. ఇప్పటికే కాంగ్రెస్‌ ప్రచారాన్ని ప్రారంభించింది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.