close

ప్ర‌త్యేక క‌థ‌నం

అర్థబలుల కోట్లాట..!

రాష్ట్రంలో రూ. 1200 కోట్ల వరకు పంపిణీ!
విజయమే ధ్యేయం... విచ్చలవిడిగా ధన ప్రవాహం
ఐ.ఆర్‌.శ్రీనివాసరావు, వలసాల వీరభద్రం
ఈనాడు, హైదరాబాద్‌

ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ మాటల యుద్ధంతోపాటు ‘కోట్ల’ఆటకూ తెరలేస్తోంది. విజయమే లక్ష్యంగా వివిధ లోక్‌సభ స్థానాల బరిలోకి దిగిన అభ్యర్థులు ప్రత్యర్థుల వ్యూహాన్ని నోట్లతో కొల్లగొట్టడానికి సిద్ధమయ్యారు. ప్రచారానికి గడువు దగ్గర పడుతుండటంతో ఓటర్లకు డబ్బును పంపిణీ చేయడానికి నాయకులు ‘సంచుల’తో బయలుదేరుతున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తక్కువలో తక్కువగా రూ.5 కోట్ల వరకు పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికల సంఘం నిఘా ఎక్కువగా ఉన్నచోట్ల డబ్బును పంపిణీ చేయడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. ఈ డబ్బును ఇప్పటికే  అభ్యర్థులు తమ అనుయాయులు, పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు చేరవేసినట్లు సమాచారం.
రాష్ట్రంలోని పలు లోక్‌సభ నియోజకవర్గాల్లో నోట్ల‘కట్ట’లు తెంచుకుంటున్నాయి. ఖర్చులు అదుపు తప్పుతున్నాయి. అధికారులు ప్రేక్షకులుగా మారారు. వివిధ ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు పట్టుబడుతున్నా.. అందులో ఎక్కువగా రాజకీయేతరుల సొమ్మేకావడం విశేషం. కొన్ని నియోజకవర్గాల్లో కోటీశ్వరులైన అభ్యర్థులు గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ నియోజకవర్గాల్లో డబ్బు ప్రభావం అధికంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకుగాను 10 స్థానాల్లో డబ్బు విచ్చలవిడిగా ఖర్చు అవుతుందని ఎన్నికల సంఘం అంచనాకు వచ్చింది. డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం 34 మంది వ్యయ పరిశీలకులను నియమించింది. అయినా.. ఖర్చు విషయంలో కొందరు అభ్యర్థులు వెనుకాడటం లేదు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక్కో అభ్యర్థి రూ. 70 లక్షలకు మించి ఖర్చు చేయకూడదు. ఈ నిబంధన కాగితాలకే పరిమితమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అత్యధిక నియోజకవర్గాలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎన్నికల వ్యయం రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు ఉంటుందన్నది అనధికారిక అంచనా.

ఈ నియోజకవర్గాలు చాలా ఖరీదు గురూ..!
రాష్ట్రంలోని మల్కాజిగిరి, చేవెళ్ల, నిజామాబాద్‌, ఖమ్మం, నల్గొండ, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో కోటీశ్వరులైన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయల పంపకాలు విచ్చలవిడిగా జరుగుతాయని పలువురు బహిరంగంగానే పేర్కొంటున్నారు. ప్రధానంగా మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో డబ్బును ఎక్కువగా పంచుతారన్న విషయం ప్రస్తుతం అందరి నోట్లో నానుతోంది. తరవాత స్థానాల్లో నిజామాబాద్‌, ఖమ్మం, చేవెళ్ల, నల్గొండ, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాల పేర్లు వినిపిస్తున్నాయి. పెద్దపల్లి, కరీంనగర్‌, నిజామాబాద్‌, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, చేవెళ్ల, నల్గొండ, వరంగల్‌, ఖమ్మం లోక్‌సభ స్థానాలు అధిక వ్యయ ప్రభావితమైనవిగా ఎన్నికల సంఘం గుర్తించింది. ప్రతి లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కో లోక్‌సభ నియోజకవర్గానికి ఒక వ్యయ పరిశీలకుడిని ఎన్నికల సంఘం నియమిస్తుంది. ఈ సారి ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు వ్యయ పరిశీలకుల చొప్పున నియమించిందంటే పంపకాలు ఎంతమేరకు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

రూ. 1200 కోట్లపై మాటే..
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా సుమారు రూ.1200 కోట్ల వరకు పంపకాలు కానున్నట్లు అంచనా. ఎన్నికల సంఘం గుర్తించిన 10 లోక్‌సభ స్థానాల్లోనే రూ.700 కోట్ల నుంచి రూ.800 కోట్ల వరకు పంపకాలు జరగనున్నట్లు అనధికారిక లెక్క. ఒక్కో పార్టీ కొన్ని లోక్‌సభ స్థానాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని డబ్బును విపరీతంగా ఖర్చు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల, మల్కాజిగిరి, నల్గొండ, భువనగిరి, ఖమ్మం నియోజకవర్గాలను ఎలాగైనే ‘చే’జిక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఎంతమొత్తంలో ఖర్చైనా వెనుకాడొద్దని కొందరు సీనియర్‌ నేతలు నిర్ణయించినట్లు సమాచారం. ఈ స్థానాల్లో తెరాస కూడా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తూ కాంగ్రెస్‌కు ఎంపీ సీట్లు దక్కకుండా డబ్బులను పంపిణీ చేయడానికి పావులు కదుపుతున్నట్లు తెలిసిందే. రాష్ట్రంలోని 16 లోక్‌సభ నియోజకవర్గాలు తెరాసకు ప్రతిష్ఠాత్మకమే అయినా.. కాంగ్రెస్‌ గట్టిపోటీ  ఇచ్చే లోక్‌సభ నియోజకవర్గాల్లో డబ్బు పంపిణీ విషయంలో ‘తగ్గొద్దని’ తెరాస నిర్ణయానికొచ్చినట్లు ఆ పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అదేవిధంగా భాజపా మహబూబ్‌నగర్‌, సికింద్రాబాద్‌ స్థానాలకు అధిక ప్రాధాన్యమిస్తూ భారీగా డబ్బును పంపిణీ చేయాలన్న యోచనలో ఉన్నట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

శాసనసభ ఎన్నికల్లో రూ. 3 వేల కోట్లు
రాష్ట్రంలో గత డిసెంబరు శాసనసభ ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులు కలిసి రూ.3,200 కోట్ల నుంచి రూ.3,600 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు అంచనా. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో అత్యధిక ఎన్నికల వ్యయ రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ తొలి మూడు స్థానాల్లో ఉండేది. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లోనే ఇంత భారీ మొత్తంలో ఖర్చవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

జహీరాబాద్‌, మెదక్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తున్న 13 మంది అభ్యర్థుల ఆస్తులు రూ. కోట్లలో ఉన్నాయి. ఈ స్థానాల్లో పోటీ చేస్తున్న ఒక్కో అభ్యర్థి ఆస్తుల విలువ రూ.54.61 కోట్లకు పైగానే ఉన్నాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.