close

ప్ర‌త్యేక క‌థ‌నం

5 ఏళ్లు.. ఐటీ 10 రెట్లు

‘లక్ష’ణంగా ఐటీ ఉపాధి!
2012-13లో రూ.1630 కోట్ల టర్నోవర్‌
2017-18లో రూ.17,500 కోట్లు
ఏపీలో ప్రత్యక్షంగా 50 వేలు, పరోక్షంగా మరో 2 లక్షల మందికి ఉపాధి
రాబోయే అయిదేళ్లలో మరో లక్ష మందికి ఉద్యోగాలే లక్ష్యం
కాకుమాను అమర్‌కుమార్‌

ఈనాడు వాణిజ్య విభాగం

చంద్రబాబు.. ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలను ఆకర్షించే పేరిది. కంపెనీల స్థాపనకు సానుకూల ప్రభుత్వ విధానాలు అమలు చేస్తూ, భూముల కేటాయింపుతో పాటు విద్యుత్తు, అధికవేగం బ్రాడ్‌బ్యాండ్‌ వంటి మౌలిక వసతులు, మెరుగైన సామాజిక వసతులు కల్పించడమే ఇందుకు కారణం. హైదరాబాద్‌లో ఐటీ రంగంలో దాదాపు 4 లక్షల మంది ఉపాధి పొందుతూ, ఏటా రూ.వేల కోట్ల సంపద సృష్టిస్తున్నారంటే, చంద్రబాబు వేసిన పునాదులే కారణం. 2014లో హైదరాబాద్‌ లేకుండా నవ్యాంధ్ర ఏర్పడినపుడు, మనకు ఐటీ ఉద్యోగాలు ఎలా అని యువత బెంబేలు పడటం వాస్తవం. వారికి భరోసా ఇస్తూ ‘జాబు రావాలంటే, బాబు రావాలి’ అనే నినాదంతో నాడు ఎన్నికలకు వచ్చిన చంద్రబాబుకు యువత జేజేలు పలికింది. ఈ అయిదేళ్లలో ఐటీ టర్నోవర్‌ను 10 రెట్లు పెంచడంతో పాటు, ఐటీ ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయగలిగింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికే ఏర్పాటైన వసతులు, ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీల భరోసాతో తదుపరి అయిదేళ్లలో మరో లక్ష మందికి ఐటీ రంగమే ఉపాధి కల్పించేలా ‘మీ భవిష్యత్తు నా బాధ్యత’  అంటూ చంద్రబాబు ముందుకొస్తున్నారు.

‘సాఫ్ట్‌వేర్‌ రంగంలో నవ్యాంధ్ర పాత్ర నామమాత్రం.. అక్కడ కాల్‌సెంటర్లు మాత్రమే ఉన్నాయ్‌..’ అంటూ ఎద్దేవా చేస్తున్న వారే ఆశ్చర్యపడేలా గత అయిదేళ్లలో ఐటీ రంగం పురోగమించింది.

ఇక్కడి చదువుకున్న యువత ఉద్యోగం కోసం హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు పరుగులు తీయాల్సిన అవసరాన్ని తప్పిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఐటీ కంపెనీల స్థాపనకు ప్రభుత్వం చాలా వేగంగా చర్యలు తీసుకుంది. తక్కువ నైపుణ్యం సరిపోయే ప్రారంభస్థాయి ఉద్యోగాలతో పాటు, అనుభవజ్ఞులకూ ఉపాధి లభించే కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. విశాఖపట్నం, అమరావతి (విజయవాడ-గుంటూరు)తో పాటు కాకినాడ, తిరుపతి వంటి పెట్టుబడిదార్లకు ఆసక్తి ఉన్న మరిన్ని ప్రాంతాల్లోనూ ఐటీ కంపెనీలను సమాంతరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ సంస్థలు కృత్రిమమేధ, డిజైనింగ్‌, అనలిటిక్స్‌, పరిశోధన-అభివృద్ధికి అవసరమైన వారిని ఎక్కువగా నియమించుకుంటున్నందున, గత అయిదేళ్లలో వీటిపైనే దృష్టి కేంద్రీకరించారు. ఏర్పాటవుతున్న సంస్థల్లో  20 శాతం బిజినెస్‌ ప్రాసెసింగ్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు కాగా 80 శాతం ప్రాసెసింగ్‌, విశ్లేషణా విధులు నిర్వహించే కంపెనీలే. ఈ కుటంబాలకు అవసరమైన విద్యా, వైద్య, వినోద సంస్థలతో భారీగా ఉద్యోగావకాశాలు, ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోంది. దేశ, విదేశాల్లోని పేరొందిన విద్యా-వైద్యసంస్థలు తరలి వస్తున్నాయి.

మౌలిక సదుపాయాలు, నిపుణుల లభ్యతే ఆంధ్రాకు వరం

ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ), భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం (ఏఐయూ), భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వంటి దిగ్గజాలు రూపొందించిన  ‘భారత్‌ నైపుణ్యాల నివేదిక 2019’ ప్రకారం.. ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణుల్లో ఉద్యోగ సామర్థ్యం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో 2018లో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానానికి దూసుకెళ్లింది. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, అగ్రశ్రేణి కార్పొరేట్‌ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని, సంబంధిత నిపుణులతో 2-3 అంచెల పట్టణాల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులకు శిక్షణ ఇప్పించే ‘కాలేజ్‌ కనెక్ట్‌’ పథకాన్ని ముఖ్యమంత్రి ఐటీ సలహాదారు జేఏ చౌదరి ఆధ్వర్యంలో అమలు చేయడం కలిసొచ్చింది.

* డిగ్రీ/ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులు విదేశాల్లో పీజీ చేసేందుకు ఏటా కాపు కులాల్లోని 1500 మందికి, బీసీల్లో 1500 మంది.. ఒక్కొక్కరికీ.15 లక్షల చొప్పున, ముస్లింలు 500 మందికి ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున ఆర్థికసాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.. కంపెనీలు స్థాపించే సత్తా కలిగిన యువనిపుణుల ఆవిర్భావానికి ఇది దోహద పడనుంది.

* విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాల వల్ల సింగపూర్‌, దుబాయ్‌ వంటి ప్రాంతాలకు నేరుగా విమాన సదుపాయం అందుబాటులోకి  రావడంతో విదేశీ ఖాతాదార్ల రాకపోకలు సులువయ్యాయి.

ఐదేళ్ల ప్రగతికి ఈ గణాంకాలే సాక్ష్యం

2012-13
* 2012-13లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఐటీ పరిశ్రమ టర్నోవర్‌ రూ.64,354 కోట్లు. అందులో విశాఖ-తిరుపతి-కాకినాడ-విజయవాడల్లోని కంపెనీల నుంచి జరిగిన వ్యాపారం రూ.1629 కోట్లే.

* అప్పట్లో హైదరాబాద్‌లో 3.20 లక్షల మంది ఉపాధి పొందుతుంటే, కోస్తా ప్రాంతాల్లో 223 సంస్థల్లో 22,000 మంది ప్రారంభస్థాయి ఉద్యోగాలు చేసేవారు.

2017-18
* 2017-18లో ఆంధ్రప్రదేశ్‌ ఐటీ పరిశ్రమ వ్యాపారం రూ.17,500 కోట్లకు పెరిగింది. అంటే అయిదేళ్లలో 10 రెట్లకు పైగా అభివృద్ధి సాధించింది. కొత్తగా ఏర్పాటైన 219 సంస్థల్లో మరో 25,000 మంది ఉద్యోగాలు పొందారు. ఇందువల్ల పరోక్షంగా మరో 2 లక్షల మందికి ఉపాధి లభించిందని అంచనా.

* కేంద్రప్రభుత్వ ఆధీనంలోని ఎస్‌టీపీఐ (సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్క్‌ ఆఫ్‌ ఇండియా) ప్రకారమే చూసినా, 2017-18 ఆర్థిక సంవత్సర ఐటీ ఎగుమతులే రూ.750 కోట్లు దాకా ఉన్నాయి.

* రాబోయే 5 ఏళ్లలో మరో లక్షమందికి ఐటీ ఉద్యోగాలు కల్పించాలన్నది చంద్రబాబు లక్ష్యం. అది సాకారమైతే పరోక్షంగా మరో 4 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది.

స్థిర విధానాలతోనే కంపెనీలు వస్తాయ్‌

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన నిర్విరామ కృషితో 1998లో హైదరాబాద్‌లో అద్దె కార్యాలయంలో అమెరికా దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కార్యకలాపాలు ప్రారంభించింది. చంద్రబాబు 1999లో రెండోసారి అధికారంలోకి వచ్చి, విధానాలు స్థిరంగా ఉంటాయనే నమ్మాకే, 2002లో  సొంత యూనిట్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. తదుపరి అనేక ఇతర ఐటీ కంపెనీలు వెల్లువలా తరలి వచ్చాయి. ఇప్పుడు నవ్యాంధ్ర పరిస్థితీ ఇంతే.. చంద్రబాబు తొలి అయిదేళ్ల పాలనలో రూపొందించిన ఐటీ విధానాలు, కల్పిస్తున్న మౌలిక వసతులను కంపెనీలు అధ్యయనం చేశాక, ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. అమరావతితో పాటు మరిన్ని పట్టణాలు నవీన నగరాలుగా మారే క్రమంలో డిజిటల్‌ వ్యవస్థలకు ఎంత గిరాకీ ఉంటుందో అంచనా వేసుకున్న సిస్కో వంటి సంస్థలు ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి.

విశాఖలో

* విశాఖలో జిరాక్స్‌ కంపెనీకి చెందిన కాండ్యుయెంట్‌ (1600 మంది సిబ్బంది), ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌తో పాటు పేటీఎం వంటి సంస్థలు కొత్తగా ఏర్పాటయ్యాయి. హెచ్‌ఎస్‌బీసీ, ఐబీఎం, విప్రో, టెక్‌ మహీంద్రా వంటి సంస్థలు విస్తరించనున్నాయి. కాకినాడలో సైయెంట్‌ కూడా వృద్ధి చెందుతోంది.

విజయవాడలో

* విజయవాడలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అతిపెద్ద యూనిట్‌ ప్రారంభించింది. దీని అనుబంధ ఆర్థిక సేవల సంస్థ అయిన స్టేట్‌స్ట్రీట్‌ మేధ టవర్స్‌లో 1600 మందితో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మరో 650 సీట్లకు దరఖాస్తు చేశారు.

గుంటూరులో

* సెమీ కండక్టర్‌ డిజైన్‌ సంస్థ ఇన్‌వీకస్‌ అత్యంత ప్రధానం కానుంది. హైఎండ్‌ నిపుణులు 200 మందితో ప్రస్తుతం గుంటూరులో కార్యకలాపాలు సాగిస్తోంది. నీరుకొండలో చిప్‌ డిజైనింగ్‌ కోసం ప్రత్యేక  పార్క్‌ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇంటెల్‌, క్వాల్‌కామ్‌, ఏఎండీ, గ్లోబల్‌ఫౌండ్రీస్‌ వంటి సంస్థలకూ ఈ పార్క్‌లో చోటు కల్పించాలన్నది లక్ష్యం.

అవగాహనా ఒప్పందాలు జరిగాయి కూడా.

* స్పెయిన్‌కు చెందిన గ్రూపో ఎంటర్‌లీన్‌ ఆటోమోటివ్‌ ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో ప్రపంచ అగ్రగామి సంస్థ. హైఎండ్‌ నిపుణులు 150 మందితో శ్రీకారం చుట్టింది.
* 3డీ యానిమేషన్‌, డిజైనింగ్‌ సంస్థ వీఎఫ్‌ఎక్స్‌ హాలీవుడ్‌ 500 మందితో సేవలు అందిస్తోంది. మరో 650 మందిని నియమిస్తామని ప్రకటించింది.

ఎన్నికలలో చంద్రబాబు గెలిస్తే ఇవన్నీ
రవి వేమూరి, ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ ఛైర్మన్‌

అమెరికా సహా ప్రపంచంలోని అగ్రగామి ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న తెలుగు వారిలో గుంటూరు, కృష్ణా వాసులు ఎక్కువగానే ఉన్నారు. చంద్రబాబు విధానాలపై నమ్మకంతోనే వీరు తమ ప్రాంతంలో కంపెనీలు స్థాపిస్తున్నారు. మా సొసైటీ ఆధ్వర్యంలో అమరావతి  (గుంటూరు-విజయవాడ)లో 65, విశాఖపట్నంలో 25, తిరుపతిలో 5, నెల్లూరులో 2, అనంతపురంలో 1 కంపెనీ ఏర్పాటయ్యాయి. వీటిద్వారా 10,000 ఉద్యోగాలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన మల్టీ సర్వీసెస్‌ సేవల సంస్థ యూఎస్‌టీ గ్లోబల్‌, వర్చువైజేషన్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ వీఎం వేర్‌ రానున్నాయి. సోనీ కూడా 50 శాతం వీఎఫ్‌ఎక్స్‌ పనిని స్థానికంగా కేటాయించేందుకు అంగీకరించింది. మేధా టవర్స్‌ రెండోదశలో హ్యూలెట్‌ ప్యాకార్డ్‌కు చెందిన ప్రాసెసింగ్‌ సేవల సంస్థ డీఎక్స్‌సీ రానుంది. చంద్రబాబు ఈ ఎన్నికలలో విజయం సాధించగానే, వచ్చే ఏడాదిలో దిగ్గజ కంపెనీలన్నీ యూనిట్లు స్థాపిస్తాయ్‌.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.