close

తాజా వార్తలు

ప్రధాని ఎవరైనా మాకు సమ్మతమే!

ప్రధాన లక్ష్యం మోదీని గద్దె దించడం :ఆజాద్‌

 

పట్నా: కేంద్రంలో ఎన్డీయే కూటమి కానీ, భాజపా కానీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభలో కాంగ్రెస్‌ ప్రక్షనేత గులాంనబీ ఆజాద్‌ తేల్చి చెప్పారు. నరేంద్రమోదీ రెండోసారి ప్రధాని అయ్యే అవకాశం లేదని.. ఎన్డీయే, భాజపాయేతర ప్రభుత్వం ఏర్పడనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా విస్తృతమైన ప్రచారంలో పాల్గొంటున్న నేపథ్యంలో తన రాజకీయ అనుభవం వల్ల ఈ విషయం అవగతమైందని వెల్లడించారు. బుధవారం పట్నాలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఫలితాలు వెలువడ్డాక ప్రధానిగా ఎవరు ఉండాలన్న అంశంపై స్పందిస్తూ.. ‘‘కాంగ్రెస్‌ నుంచి ప్రధానిని ఎంపిక చేయాలని అన్ని పార్టీలు ఏకీభవిస్తే మంచిదే. అలా కాకుండా అంతా కలిసి మరో పార్టీకి చెందిన నేతను ఎంచుకున్నా మాకేం అభ్యంతరం లేదు.’’ అని స్పష్టతనిచ్చారు. ఈ సమయంలో కాంగ్రెస్‌ ప్రధాన కర్తవ్యం ఎన్డీయేను గద్దె దించడమేనని వ్యాఖ్యానించారు.  బీజేపీ ఈసారి 125 లోక్‌సభ సీట్లకు మించి గెల్చుకోలేకపోవచ్చని ఆజాద్‌ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే భాజపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశాన్ని విభజించి పాలించిందని ఆరోపించారు. ఆ పార్టీ ప్రధాన సిద్ధాంతం ఎప్పుడూ పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాయడమేనని ధ్వజమెత్తారు. వ్యవసాయదారులు, యువత, మహిళలు, కార్మికులు ప్రస్తుతం అధ్వాన్న పరిస్థితిలో ఉన్నారని, దీనికి కారణం భాజపా తప్పుడు విధానాలే అని విమర్శించారు. ఐదేళ్లలో 10 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మోదీ కేవలం నోట్ల రద్దు,  జీఎస్టీ వంటి వాటిని మాత్రమే అమలు పర్చారని అన్నారు.



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net