రాయలసీమ ఎత్తిపోతలపై తీర్పు రిజర్వు

తాజా వార్తలు

Published : 03/09/2020 18:54 IST

రాయలసీమ ఎత్తిపోతలపై తీర్పు రిజర్వు

దిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తీర్పును జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం రిజర్వు చేసింది. ఈ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లేవంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. పిటిషనర్‌తో పాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తరఫున వాదనలు విన్న జస్టిస్‌ రామకృష్ణన్‌ ధర్మాసనం తీర్పును రిజర్వు చేస్తున్నట్లు పేర్కొంది.  అంతకుముందు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తమకున్న అభ్యంతరాలను తెలంగాణ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రామచంద్రరావు వినిపించారు. తెలంగాణ అభ్యంతరాలపై ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది వెంకటరమణి వాదించారు. కృష్ణా నదీ జలాల్లో కేటాయింపునకు అనుగుణంగానే ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు వాదనలు వినిపించారు.

దీనిపై తెలంగాణ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రామచంద్రరావు స్పందిస్తూ ఈ పథకాన్ని ఇరిగేషన్‌ ప్రాజెక్టుగానే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొందని.. దీనికి పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిన అవసరముందని చెప్పారు. గతంలో ఎన్జీటీ నియమించిన నిపుణుల కమిటీని ఏపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టించి ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరం లేదనే విధంగా నివేదిక ఇప్పించారని ఆయన వాదించారు. మరోవైపు ప్రాజెక్టు సామర్థ్యాన్ని 40వేల క్యూసెక్కుల నుంచి 80వేలకు ఏపీ ప్రభుత్వం మార్పు చేసిందని.. ఈ మార్పులతో తెలంగాణకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశముందని రామచంద్రరావు వాదనలు వినిపించారు. దీనిపై ఏపీ న్యాయవాది వెంకటరమణి స్పందిస్తూ రాయలసీమ ఎత్తిపోతల పథకం పాత ప్రాజెక్టేనని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఎన్జీటీ చెన్నై ధర్మాసనం.. తీర్పును రిజర్వులో ఉంచింది. దీనిపై ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా అందించాలని సూచించింది.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని