ఆరోగ్య ఫలసాయం...దేశవాళీ విత్తనాలతో వ్యవసాయం.. 

తాజా వార్తలు

Updated : 23/11/2020 05:26 IST

ఆరోగ్య ఫలసాయం...దేశవాళీ విత్తనాలతో వ్యవసాయం.. 


 

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఆరుగాలం కష్టపడే రైతులు.. అనారోగ్యం పాలవటం అతడిని ఆలోచింపచేసింది. తీసుకునే ఆహారం విషతుల్యమై వివిధ రోగాలకు కారణమవుతున్న వేళ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారధాన్యాల వైపు దృష్టి పెట్టేలా చేసింది. ఉన్న ఉద్యోగం వదిలి మట్టి ఒడిలోకి అడుగు పెట్టేలా చేసింది. దేశవాళీ విత్తనం, ప్రకృతి సేద్యం అనే జోడెడ్లతో సంప్రదాయ వ్యవసాయానికి సరికొత్త నిర్వచనం ఇచ్చేలా చేసింది. దేశవాళీ విత్తనాలే ముద్దు ఇంకేవి మనకొద్దు అంటూ మనఊరు - మన విత్తనం పేరిట ఉద్యమమే నడుపుతూ రైతులోకానికి ఆదర్శంగా మారిన ఆ యువకుడే బాపారావు.

తినే ఆహారమే మందుగా పనిచేయాలి తప్ప. మందులే ఆహారంగా మారకూడదు. కానీ.. రసాయన ఎరువుల వాడకం పెరిగిన తరువాత కడుపు నిండా భోజనం చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సేద్యంలో ఉన్న లోటుపాట్లు వెతికి సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు బాపారావు. విత్తనం మంచిదైతే పంట మంచిదవుతుందని చెబుతూ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. బాపారావుది గుంటూరు జిల్లాలోని అత్తోట. చదువు పూర్తైన తరువాత కొన్నాళ్లు గ్రాఫిక్‌ డిజైనర్‌గా పనిచేశాడు. అతడి కుటుంబంలో కొందరు క్యాన్సర్‌ బారిన పడి మృతిచెందారు. దాంతో..నిత్యం కష్టపడి పనిచేసే రైతు కుటుంబాలు రోగాల బారిన పడటం ఏమిటన్న ప్రశ్న అతడిని వేధించింది. దాని వెనుక ఉన్న కారణం తెలుసుకోవటానికి తీవ్రంగా ప్రయత్నించాడు. రసాయనాలతో కూడిన వ్యవసాయ విధానమే ఇందుకు ప్రధాన కారణమని గ్రహించాడు. అప్పుడే ప్రకృతి సేద్యం చేయాలన్న ఆలోచన వచ్చిందతడికి. దాని గురించి అధ్యయనం చేసే సమయంలోనే దేశవాళీ విత్తనాల గురించి తెలుసుకున్నాడు. విత్తన బ్యాంకులు, పరిరక్షణా సంస్థలు, గ్రామాల నుంచి వీటిని సేకరించాడు. తన పొలాన్నే ప్రయోగశాలగా మార్చాడు.

అయితే ప్రకృతి సేద్యం చేయటం వల్ల ఇంతకుముందు కంటే దిగుబడి తగ్గింది. కానీ.. వండుకుని తినేటప్పుడు రుచిలో తేడా కనిపించిందతడికి. ఈ రకమైన పంటలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉపయోగపడతాయని గుర్తించిన బాపారావు, తాను పాటిస్తున్న విధానం గురించి ఇతరులకు పరిచయం చేశాడు. తాను కౌలుకు తీసుకున్న అయిదెకరాల పొలంలో దేశవాళీ వరి విత్తనాలు అభివృద్ధి చేశాడు. వాటిని ఇతరులకూ అందించాడు. వారు ఎంతోకొంత విస్తీర్ణంలో ఈ వరి రకాలను పండించి మరికొందరికి అందించేలా ప్రోత్సహించాడు. ఇలా నాలుగైదు రకాల విత్తనాలతో ప్రారంభమైన దేశవాళీ విత్తనోద్యమం నేడు రెండు వందల రకాలకు చేరింది. దాదాపు ఎనభై మంది రైతులు బాపారావు చూపిన బాటలో పయనిస్తున్నారు. ఏటా తాము పండించిన వివిధ రకాల విత్తనాలతో ఓ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రదర్శనకు ఇతర ప్రాంతాల రైతులు వస్తారు. తమకు అవసరమైన రకాలను కొనుక్కుని వెళ్తారు.


‘‘అత్తోట గ్రామం విత్తన కేంద్రంగా అభివృద్ధి చెందాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మన ఊరు - మన విత్తనం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం. బయట ఎక్కడి నుంచో తెచ్చుకోకుండా ఇక్కడి విత్తనాలనే ఉపయోగించాలని భావించాం. వ్యవసాయం చేసే వారు ఆరోగ్యంతో ఉంటేనే ఇతరులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించటానికి కృషిచేయగలుగుతారు. అది దేశీయ విత్తనాలతో సాధ్యపడుతుంది. విత్తనాలను గోమయ భస్మం (ఆవు పిడకల మసి)తో నిల్వచేస్తాం. అందువల్ల  వాటికి పురుగు పట్టదు. ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి’’ అని అంటున్నాడు బాపారావు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని