రెండో వేవ్‌ తీవ్రత అధికం: డా.శ్రీనివాస్‌
close

తాజా వార్తలు

Updated : 17/04/2021 15:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండో వేవ్‌ తీవ్రత అధికం: డా.శ్రీనివాస్‌

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ వ్యాప్తి ఉద్ధృతంగా ఉందని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ తెలిపారు. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత మొదటిసారిగా రెండు లక్షల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. కోఠిలోని ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మార్చి 3న తొలి కేసు నమోదు అయినప్పటి నుంచి కేసులు క్రమంగా పెరుగుతున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో మహమ్మారి ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు, ప్రభుత్వ సహకారంతో మొదటి వేవ్‌ను అడ్డుకోగలిగామని.. కానీ రెండో వేవ్‌లో మ్యూటేషన్ల కారణంగా తీవ్రత అధికంగా ఉందని చెప్పారు. ప్రపంచంలోని అగ్ర రాజ్యాలు సైతం కరోనా ముందు మోకరిల్లాయని.. వాటితో పోల్చితే పరిమితంగా వసతులు ఉన్న మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగింది

‘‘ఈ మధ్య ఉత్సవం చేసుకునేందుకు మహారాష్ట్ర నుంచి తెలంగాణ సరిహద్దు జిల్లాకు 20 మంది వచ్చారు. వీరికి మనవాళ్లు మరో 30 మంది కలిసి ఉత్సవం జరిపారు. కొన్ని రోజుల తర్వాత వాళ్లలో కరోనా లక్షణాలు కనిపించడం మొదలైంది. వాళ్లలో ఐదుగురు పరీక్షలు చేయించుకోగా.. అందరికీ పాజిటివ్‌గా తేలింది. ఈ ఐదుగురు ఎక్కడి నుంచి వచ్చారనే విషయాన్ని తెలుసుకుని ట్రేస్‌ చేసుకుంటూ వెళ్తే మొత్తంగా 34 మంది పాజిటివ్‌ కేసులు తేలాయి. ఇలా పూర్తి స్థాయిలో పరిశీలించగా.. కేవలం 12 రోజుల్లోనే చుట్టుపక్కల గ్రామాల్లోని 433 మందికి వైరస్‌ సోకింది. కేవలం 20 మందితో మొదలై వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కరోనా తొలిదశ నుంచి ప్రజలు ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదు. కొవిడ్‌ వెళ్లిపోయిందనే భ్రమలోనే ఉన్నారు. మొదటి వేవ్‌ తర్వాత ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగింది. అదే సమయంలో వైరస్‌ కూడా మరింత బలం పుంజుకుంది. మ్యుటేషన్లుగా ఏర్పడి ప్రజల్లోకి మరింత ఉద్ధృతంగా వెళ్లింది.

80 శాతం బాధితుల్లో లక్షణాలు లేవు

ఫిబ్రవరి నుంచే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది.  కరోనా చికిత్సపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో మందులు, పడకలు, ఆక్సిజన్ కొరత లేదు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 5వేల ఆక్సిజన్‌ పడకలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో 44 ప్రత్యేక కొవిడ్‌ ఆస్పత్రులు ఉన్నాయి. టెస్టుల సంఖ్యను పెంచాం. రోజుకు లక్షకుపైగా పరీక్షలు చేస్తున్నాం. రాష్ట్రంలో పడకల సంఖ్యను రెట్టింపు చేశాం. ప్రస్తుతం 38,600 పడకలు అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో వాటిని 53వేలకు పెంచుతాం. 116 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సలు అందిస్తున్నాం. 15 నుంచి 20 కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనే పడకల కొరత ఉంది. జీహెచ్ఎంసీలో 5 కొవిడ్ ప్రత్యేక ఆస్పత్రులు ఉన్నాయి. 80 శాతం కరోనా బాధితుల్లో లక్షణాలు ఉండటం లేవు.

15 రోజుల్లోనే పాజిటివ్‌ రేటు రెట్టింపు

గాలి ద్వారా వ్యాపించే దశకు కరోనా చేరిందని గతంలోనే స్పష్టంగా ప్రజలకు చెప్పాం. గతంలో ఇంట్లో ఒకరిని ఐసోలేట్‌ చేస్తే సరిపోయేది. ప్రస్తుతం బాధితుడిని గుర్తించేలోపే కుటుంబమంతా వైరస్‌బారిన పడుతున్నారు. మ్యుటేషన్స్‌, డబుల్‌ మ్యుటేషన్స్‌, వివిధ దేశాల నుంచి ప్రయాణికుల ద్వారా వచ్చినవి కూడా రాష్ట్రంలో సర్క్యులేట్‌ అవుతున్నాయి. కొత్త మ్యుటేషన్ల కారణంగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. 15 రోజుల్లోనే పాజిటివ్‌ రేటు రెట్టింపు అయింది’’ అని శ్రీనివాస్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని