ఒక్క దిల్లీలోనే అలా ఎందుకు?: కేజ్రీవాల్‌

తాజా వార్తలు

Updated : 20/06/2020 14:52 IST

ఒక్క దిల్లీలోనే అలా ఎందుకు?: కేజ్రీవాల్‌

దిల్లీ: దేశ రాజధాని దిల్లీని కరోనా వణికిస్తోంది. రోజురోజుకీ అక్కడ కేసుల తీవ్రత ఉద్ధృతమవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినవాళ్లకు ఐదు రోజుల పాటు సంస్థాగత నిర్బంధం (ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌) తప్పనిసరి చేస్తూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ జారీ చేసిన ఆదేశాలను  సీఎం కేజ్రీవాల్‌ వ్యతిరేకిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం దిల్లీ విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో సీఎం సమావేశమై ఈ అంశంపై చర్చించారు. లక్షణాలు లేనివారికి, కొద్దిపాటి రోగ లక్షణాలు ఉన్నవారిని హోం క్వారంటైన్‌లో ఉండేందుకు ఐసీఎంఆర్‌ అనుమతిస్తుంటే..  దిల్లీలో మాత్రం కొత్త రకమైన నిబంధనలు అమలుచేయడం ఎందుకని సీఎం ప్రశ్నించినట్టు ఈ సమావేశంలో పాల్గొన్న ఓ అధికారి తెలిపారు. 

సంస్థాగత  క్వారంటైన్‌కు తరలిస్తామంటే ప్రజలు భయపడి.. పరీక్షలు చేయించుకొనేందుకు సైతం వెనక్కి తగ్గే అవకాశం ఉందని సీఎం వ్యాఖ్యానించినట్టు సమాచారం. 

దిల్లీ పాలనాధికారులు, విపత్తు నిర్వహణ అధికారుల మధ్య జరిగిన ఈ సమావేశంలో ఐదు రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి అంశంపై  ప్రధానంగా చర్చించారు. ఇప్పటికే ఆరోగ్య సిబ్బంది కొరత ఉందనీ.. అలాగే, వేల సంఖ్యలో వస్తున్న కరోనా రోగులకు ఉన్న వైద్యులు, నర్సులు ఎలా సేవలందించగలరని సమావేశంలో సీఎం అన్నట్టు ఆ అధికారి తెలిపారు.  దీంతో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసింది. ఐదు రోజుల క్వారంటైన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనీ.. సాయంత్రం 5గంటలకు మరోసారి సమావేశమవుతామని డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా తెలిపారు. 

ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా రోగులకు చికిత్స ధర  విషయంలోనూ ఏకాభిప్రాయం కుదరలేదని సిసోడియా స్పష్టంచేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 25శాతం పడకలకు మాత్రమే  రేట్లు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం సూచించగా.. దాన్ని తాము 60శాతం తగ్గించాలనుకుంటున్నామన్నారు.  సాయంత్రం మరోసారి సమావేశమై ఈ అంశంపైనా చర్చించి నిర్ణయం తీసుకుంటాని చెప్పారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని