close

ప్రధానాంశాలు

అతడే.. అతడే.. ఈ తరం సెహ్వాగ్‌

ముంబయి: దిల్లీ క్యాపిటల్స్‌ యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌పై మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు ఈ తరం వీరేంద్ర సెహ్వాగ్‌ అని కొనియాడాడు. వీరూ తరహాలోనే పంత్‌తోనూ భిన్నంగా వ్యవహరించాలని వెల్లడించాడు. ‘గతరాత్రి నాలో ఉత్కంఠ చెలరేగింది. రిషభ్‌ ఈ తరం వీరూ. భిన్నంగా వ్యవహరించాల్సిన బ్యాట్స్‌మన్‌. అతడిని అతడిలాగే ఉండనివ్వండి. పంత్‌ను జట్టులోకి ఎంచుకోండి లేదంటే తీసేయండి. అంతేకానీ అతడిని మార్చాలని మాత్రం ఎప్పుడూ ప్రయత్నించొద్దు’ అని మంజ్రేకర్‌ ట్వీట్‌ చేశాడు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో పంత్‌ 21 బంతుల్లోనే 49 పరుగులు చేసి దిల్లీని విజయతీరాలకు చేర్చాడు. క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించి పెట్టాడు. అద్భుతమైన సిక్సర్లు బాదేశాడు. ముంబయిపై 27 బంతుల్లోనే 78 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌నకు అతడిని ఎంపిక చేయలేదు. వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యాలను దృష్టిలో పెట్టుకొని పంత్‌ బదులు దినేశ్‌ కార్తీక్‌ను ఎంపిక చేసినట్టు చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. అతడిని ఉద్దేశించే సంజయ్‌ మంజ్రేకర్‌ ట్వీట్‌ చేసినట్టు కనిపిస్తోంది. రికీ పాంటింగ్‌, సౌరభ్‌ గంగూలీ, మైకేల్‌ వాన్‌, సునిల్‌ గావస్కర్‌ సహా మరికొందరు మాజీ క్రికెటర్లు పంత్‌ను ఎంపిక చేయకపోవడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net