close

తాజా వార్తలు

Published : 21/10/2020 16:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బిహార్‌ సమరం: 31% మందిపై క్రిమినల్‌ కేసులు

23% అభ్యర్థులపై తీవ్రమైన నేరాభియోగాలు
‘తొలిదశ’పై ఏడీఆర్‌ విశ్లేషణ

ఈనాడు, హైదరాబాద్‌ : బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో భాగంగా తొలిదశలో పోటీచేస్తున్న 1064 మంది అభ్యర్థుల్లో 328 మందిపై (26%) క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌-ఏడీఆర్‌) పేర్కొంది. వీరిలో 244 మంది తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. ఈ నెల 28న పోలింగ్‌ జరగనున్న తొలిదశ 71 స్థానాల నుంచి మొత్తం 1066 మంది పోటీ చేస్తున్నారు. వీరు ఎన్నికల సంఘానికి సమర్పించిన ప్రమాణపత్రాల్లో 1064 పత్రాలను ఏడీఆర్‌ విశ్లేషించింది. సరిగా స్కాన్‌ కానందున ఇద్దరు అభ్యర్థుల ప్రమాణపత్రాలను విశ్లేషించకలేపోయినట్లు తన నివేదికలో వెల్లడించింది. 

ఆర్జేడీ నుంచి పోటీచేస్తున్న అభ్యర్థుల్లో 30 మందిపై (పార్టీ తరఫున పోటీచేస్తున్న వారిలో 73 శాతం) క్రిమినల్‌ కేసులు ఉండగా, 22 మందిపై (54 శాతం) తీవ్రమైన క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో భాజపా, ఎల్‌జేపీ, కాంగ్రెస్‌లు నిలిచాయి. 
62 మంది అభ్యర్థులు హత్యాయత్నం అభియోగాలను ఎదుర్కొంటున్నారు. 
ముగ్గురిపై అత్యాచారం అభియోగాలు ఉన్నాయి. 

ఆమె ఆదాయం రూ.కోటిపైనే..
భోజ్‌పుర్‌ జిల్లా సందేశ్‌ నియోజకవర్గ ఆర్జేడీ అభ్యర్థి కిరణ్‌దేవి తనకు రూ.1.02 కోట్ల వార్షిక ఆదాయం సమకూరినట్లు 2020-2021 ఆదాయపుపన్ను రిటర్నుల్లో చూపించారు. కుటుంబసభ్యులతో కలిపి ఇది రూ.3.27 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించారు. 
116 మంది అభ్యర్థులు పాన్‌కార్డు వివరాలను వెల్లడించలేదు. 

49% శాతం మంది పట్టభద్రులు
తొలిదశలో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో 522 మంది (49%) తమ విద్యార్హత డిగ్రీ, అంతకంటే ఎక్కువ అని పేర్కొన్నారు. 455 మంది (43%) ఐదు నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నవారు. ఐదుగురు నిరక్షరాస్యులు. ఏడుగురు డిప్లమో చేశారు. జాగరూక్‌ జనతా పార్టీ తరఫున బోధ్‌గయ నుంచి పోటీచేస్తున్న బిందూవికాశ్‌ అటల్‌ తన విద్యార్హతల వివరాలు వెల్లడించలేదు. 
తొలిదశలో మొత్తం 114 మంది మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 403 మంది (38%) అభ్యర్థుల వయసు 25 నుంచి 40 ఏళ్లలోపు. 548 (52%) మంది అభ్యర్థుల వయసు 41-60 వరకు, 112 మంది (11%) వయసు 61 నుంచి 80గా ఉంది. ఒక అభ్యర్థి తనకు 82 సంవత్సరాలని ప్రకటించారు. 

సగటు ఆస్తి రూ.1.99 కోట్లు
తొలి దశలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో మొత్తం 375 మంది (35%) కోటీశ్వరులు ఉన్నారు. రాజధాని జిల్లా అయిన పట్నాలోని మొకామా నియోజకవర్గం నుంచి ఆర్జేడీ తరఫున పోటీచేస్తున్న అనంత్‌కుమార్‌ సింగ్‌ రూ.68.56 కోట్ల ఆస్తులతో ఈ జాబితాలో తొలిస్థానంలో నిలిచారు. షేక్‌పుర జిల్లా బర్బిఘా నుంచి పోటీచేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి రూ.61.23 కోట్లతో రెండో స్థానం, గయ జిల్లా ఆర్తీలో జేడీ(యూ) తరఫున బరిలో నిలిచిన మనోరమా దేవి రూ.50.62 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఐదుగురు అభ్యర్థులు తమకు ఎలాంటి ఆస్తులు లేవని ప్రకటించారు. వీరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఒకరు, ఎన్‌సీపీ అభ్యర్థి ఒకరు ఉండడం విశేషం. ఇద్దరు అభ్యర్థులు తమకు రూ.10వేల లోపు ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. 
రూ.5 కోట్లు అంతకంటే ఎక్కువ ఆస్తిని ప్రకటించిన వారు 93 మంది ఉండగా, రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల ఆస్తులు ప్రకటించిన అభ్యర్థులు 123 మంది ఉన్నారు. 301 మంది అభ్యర్థులు తమకు రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల ఆస్తి ఉందని వెల్లడించారు. 
ఆర్జేడీ అభ్యర్థుల్లో 39 మంది (95%), జేడీయూ అభ్యర్థుల్లో 31 మంది (89%), భాజపా అభ్యర్థుల్లో 24 మంది (83%) కోటీశ్వరులు ఉన్నారు. ఆయా పార్టీల తరఫున పోటీచేస్తున్న అభ్యర్థుల్లో కోటీశ్వరుల శాతాన్ని పరిశీలిస్తే ఈ మూడు పార్టీలే తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. 
పార్టీల వారీగా చూస్తే జేడీయూ అభ్యర్థుల సగటు ఆస్తి రూ.8.12 కోట్లు కాగా, తర్వాతి స్థానాల్లో ఆర్జేడీ (రూ.6.98 కోట్లు), కాంగ్రెస్‌ (రూ.6.03 కోట్లు) ఎల్‌జేపీ (రూ.4.62 కోట్లు), భాజపా (రూ.3.10 కోట్లు), బీఎస్పీ (రూ.1.36 కోట్లు) ఉన్నాయి. 
అత్యధిక ఆస్తులు ప్రకటించిన అనంత్‌కుమార్‌ సింగ్‌ తనకు రూ.17 కోట్ల మేర అప్పులు ఉన్నట్లు ప్రకటించారు. అప్పులు ఎక్కువగా ఉన్న అభ్యర్థుల జాబితాలోనూ ఆయనదే తొలిస్థానం. 
బక్సర్‌ జిల్లా బ్రహంపుర్‌ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ తరఫున పోటీచేస్తున్న శంభునాథ్‌ యాదవ్‌కు రూ.7 కోట్ల ఆస్తులు ఉండగా, అప్పులు మాత్రం రూ.13 కోట్లు ఉన్నాయి. ఇదే జిల్లాలోని డుమ్రావ్‌ నుంచి ఆర్జేడీ తరఫునే పోటీచేస్తున్న దాదన్‌ యాదవ్‌కు ఆస్తులు రూ.2.59 కోట్లు ఉండగా అప్పులు ఏకంగా రూ.11.36 కోట్లు ఉండడం విశేషం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.