భార‌త్‌: 6 ల‌క్షలు‌ దాటిన క‌రోనా కేసులు!
close

తాజా వార్తలు

Updated : 02/07/2020 10:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భార‌త్‌: 6 ల‌క్షలు‌ దాటిన క‌రోనా కేసులు!

దేశ‌వ్యాప్తంగా 24గంటల్లో 19,148 కేసులు, 434మ‌ర‌ణాలు
మ‌హారాష్ట్రలో 8వేలు దాటిన మ‌ర‌ణాలు

దిల్లీ: భార‌త్‌లో క‌రోనా వైర‌స్ ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. కొన్నిరోజులుగా నిత్యం 19వేల పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. గ‌డ‌చిన 24గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా మరో 19,148 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. వీటితో దేశంలో మొత్తం కొవిడ్‌-19 బాధితుల సంఖ్య 6,04,641కి చేరింది. అంతేకాకుండా, నిన్న ఒక్క‌రోజే 434మంది క‌రోనాతో మృతిచెందారు. దీంతో దేశంలో క‌రోనా బారిన‌ప‌డి మృత్యువాత‌ప‌డిన వారిసంఖ్య 17,834కు చేరిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమశాఖ వెల్ల‌డించింది. ఇక దేశంలో క‌రోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్ప‌టివ‌ర‌కు 3,59,860మంది కోలుకోగా మ‌రో 2,26,947మంది ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

18రోజుల్లో రెట్టింపు కేసులు, మ‌ర‌ణాలు..

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న‌ వైర‌స్ విజృంభ‌ణ‌తో బాధితుల సంఖ్య 18రోజుల్లోనే రెట్టింపు అవుతోంది. జూన్ 13వ తేదీన దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 3,08,993గా ఉండ‌గా, జులై 2నాటికి ఆ సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. ఇక మ‌ర‌ణాల సంఖ్య అదే స్థాయిలో పెరుగుతోంది. జూన్ 13నాటికి 8884మ‌ర‌ణాలు సంభ‌వించ‌గా ప్ర‌స్తుతం అవి 17,834కు చేరాయి. అయితే, దేశంలో వైర‌స్ బారిన‌ప‌డి కోలుకుంటున్న వారిశాతం క్ర‌మంగా పెరుగుతుండ‌టం ఊర‌ట క‌లిగించే విష‌యం. ప్ర‌స్తుతం భార‌త్‌లో కొవిడ్ కేసుల రిక‌వ‌రీ రేటు దాదాపు 60శాతంగా ఉంది. మ‌ర‌ణాల రేటు 2.6శాతంగా ఉంది. గ‌త నెల‌తో పోలిస్తే క‌రోనా మ‌ర‌ణాల రేటు తగ్గుతూ వ‌స్తోంది. 

మ‌హారాష్ట్రలో 8వేలు దాటిన మ‌ర‌ణాలు..

మ‌హారాష్ట్రలో కొవిడ్ మ‌హ‌మ్మారి వికృత రూపం ప్ర‌ద‌ర్శిస్తోంది. రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 8వేలు దాట‌డం క‌ల‌వ‌ర‌పెడుతోంది. దేశంలో సంభ‌విస్తోన్న క‌రోనా మ‌ర‌ణాల్లో దాదాపు 45శాతం ఒక్క మ‌హారాష్ట్రలోనే చోటుచేసుకోవ‌డం ఆందోళ‌నకరం. గురువారం నాటికి రాష్ట్రంలో కేసుల సంఖ్య ల‌క్షా 80వేల‌కు చేరింది. వీరిలో ఇప్ప‌టివ‌ర‌కు 8053మంది మృత్యువాత‌ప‌డ్డ‌ట్లు కేంద్రప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఇక, మ‌హారాష్ట్ర అనంత‌రం త‌మిళ‌నాడులో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. తాజాగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 94వేలు దాటింది. దేశ రాజ‌ధానిలో మాత్రం క‌రోనా వైర‌స్ ఉద్ధృతి కాస్త అదుపులోకి వ‌చ్చిన‌ట్లు దిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ వెల్ల‌డించారు. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో 89,802 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా వీరిలో ఇప్ప‌టికే 60వేల రోగులు కోలుకున్నట్లు వెల్ల‌డించారు. గుజ‌రాత్‌లో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య 33వేలు దాట‌గా ఇప్ప‌టివ‌ర‌కు 1867 మంది చనిపోయారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని