
తాజా వార్తలు
వాస్తుకు భయపడే వ్యక్తి ప్రజలకేం చేస్తారు: నడ్డా
హైదరాబాద్: దేశంలోని ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా భాజపా విజయం సాధిస్తోందని.. అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ విజయం సాధించడం ఖాయమని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ పనితీరును చూసి ప్రజలు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. హైదరాబాద్ తాజ్‌బంజారాలో నిర్వహించిన సదస్సులో నడ్డా మాట్లాడారు. దుబ్బాక ఉపఎన్నికలో భారీగా భాజపా ఓటింగ్ శాతం పెరిగిందని నడ్డా వెల్లడించారు. ఎన్నో అత్యాధునిక సౌకర్యాలున్నప్పటికీ కొవిడ్ నియంత్రణలో ఐరోపా దేశాలు విఫలమయ్యాయన్నారు. సరైన సమయంలో ప్రధాని మోదీ లాక్డౌన్ విధించి దేశాన్ని కరోనా నుంచి రక్షించారని వెల్లడించారు. దేశంలోని రోజువారీ కరోనా పరీక్షలు 1500 నుంచి 15 లక్షలకు పెంచామన్నారు. దేశవ్యాప్తంగా 16వేలకు పైగా ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు చేస్తున్నారని.. ప్రస్తుతం 3 లక్షల వెంటిలేటర్లు తయారవుతున్నాయని చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని డబ్ల్యూహెచ్‌వో సైతం ప్రశంసించిందని జేపీ నడ్డా స్పష్టం చేశారు.
‘‘గల్లీ ఎన్నికలకు దిల్లీ నేతలు వస్తున్నారని తెరాస నేతలు అంటున్నారు. హైదరాబాద్ నగరం గల్లీలా కనపడుతుందా?ఇదేనా ప్రజాస్వామ్యం? గల్లీ ఎన్నికలు అనడం హైదరాబాద్ ప్రజలను అగౌరపరచడమే అవుతుంది. అవినీతి అంతం చేయడానికి.. సుపరిపాలన అందించేందుకు ఎక్కడికైనా వస్తాం. కుమారుడు, కూతురు, అల్లుడు, మిత్రపక్షాల గురించి మాత్రమే సీఎం కేసీఆర్ ఆలోచిస్తారా? వాస్తుకు భయపడే వ్యక్తి ప్రజలకు ఏం మంచి చేస్తారు? నాయకుడు అంటే ప్రజల ఆస్తులకు రక్షకుడిగా ఉండాలే కానీ ఆస్తులను స్వాహా చేసేలా ఉండకూడదు. తెలంగాణకు ఎయిమ్స్, మెట్రోకు నిధులు అందజేసింది కేంద్ర ప్రభుత్వమే. తెలంగాణ ప్రజలకు పలు సంక్షేమ పథకాలను అందజేసింది కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి తెలంగాణా ప్రజలకు అందనివ్వడం లేదు. ప్రజలకు సంక్షేమ పథకాల లబ్ధి అందాలంటే రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలి’’ అని నడ్డా వ్యాఖ్యానించారు.