
తాజా వార్తలు
రామ్.. నీ ప్రేమను మిస్ అవుతున్నా: ఛార్మి
వీడియో షేర్ చేసిన బర్త్‌డే బాయ్
హైదరాబాద్: రామ్ ఎనర్జీని, ప్రేమను తాను ఎంతగానో మిస్ అవుతున్నానని నటి, నిర్మాత ఛార్మి అన్నారు. శుక్రవారం రామ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఛార్మి ఆయనకు ట్విటర్ వేదికగా విషెస్ తెలిపారు. ‘ఇస్మార్ట్ శంకర్’ షూటింగ్ సమయంలో రామ్‌తో దిగిన ఓ ఫొటోను ట్విటర్ వేదికగా షేర్ చేస్తూ.. ‘ఉస్తాద్ రామ్.. గతేడాది ఇదే రోజున మనం ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలోని ‘జిందాబాద్’ సాంగ్ షూటింగ్ కోసం గోవాలో ఉన్నాం. ఆ సమయంలో బాగా పార్టీ చేసుకున్నాం. కానీ ఈ ఏడాది నీ ఎనర్జీని, ప్రేమను ఎంతో మిస్ అవుతున్నాను. లాక్డౌన్ అయ్యాక నిన్ను కలవాలనుకుంటున్నాను. లవ్ యూ’ అని ఛార్మి పేర్కొన్నారు. మరోవైపు నభానటేశ్ సైతం గతేడాది రామ్ పుట్టినరోజు వేడుకలను గుర్తుచేసుకున్నారు. ‘హ్యాపీ బర్త్‌డే రామ్. ఈ ఏడాది అంతా నీకు సూపర్ డూపర్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. గతేడాది నీ పుట్టినరోజున సాంగ్ షూటింగ్, బర్త్‌డే పార్టీ ఎంతో ఫన్‌గా జరిగాయి కదా..!’ అని ట్వీట్ చేశారు.
గతేడాది విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో రామ్ ఓ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్‌కు జంటగా నిధి అగర్వాల్, నభా నటేశ్ నటించారు. ఛార్మి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా విజయం తర్వాత రామ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రెడ్’. తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. పుట్టినరోజు సందర్భంగా ‘రెడ్’ సినిమా నుంచి ఓ పాట టీజర్‌ను రామ్ అభిమానులతో పంచుకున్నారు.