
తాజా వార్తలు
రోహిత్ చిన్నతనం నుంచి అంతే!
ఇంటర్నెట్‌డెస్క్: లీగ్‌లో ముంబయి సారథి రోహిత్ శర్మ అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఫైనల్లో దిల్లీపై గెలిచి అయిదోసారి జట్టును విజేతగా నిలిపాడు. ఈ నేపథ్యంలో హిట్‌మ్యాన్ గురించి అతడి చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ మాట్లాడాడు. చిన్నతనం నుంచే రోహిత్ నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అన్నాడు. ఒత్తిడిలో గొప్పగా రాణిస్తాడని, బాధ్యతలను ఆస్వాదిస్తాడని తెలిపాడు.
‘‘రోహిత్ ఆలోచన ఎప్పుడూ విజయంపైనే ఉంటుంది. ఓటమి గురించి అసలు ఆలోచించడు. ముంబయి జట్టు బాధ్యతలు అందుకున్నాక నాయకుడిగా అతడి నైపుణ్యం ఏంటో నిరూపించాడు. ఇది అతడి కెరీర్‌కు ఎంతో దోహదపడింది. అతడికి బాధ్యతలు మరిన్ని పెరిగినా ఒత్తిడి పెరగలేదు.అయితే అతడిలో నాయకత్వ లక్షణాలు చిన్నతనంలోనే గుర్తించాను. పాఠశాల స్థాయి క్రికెట్లో జట్టును నడిపించమంటే ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపించేవాడు. 40 పరుగులకే ఐదు లేదా ఆరు వికెట్లు కోల్పోయిన సందర్భాల్లో జట్టు స్కోరును 220 పరుగులకు తీసుకువచ్చేవాడు. మేం మ్యాచ్‌ను కోల్పోతామనే పరిస్థితుల్లో ఆఖరి వరకు క్రీజులో ఉండమని అతడికి చెబితే.. ‘జట్టును గెలిపించే బాధ్యత నాది’ అని రోహిత్ బదులిచ్చేవాడు. అలాంటి మ్యాచ్‌లను గెలిపించాడు కూడా’’ అని దినేశ్ వెల్లడించాడు.
భారత జట్టుకు రోహిత్ నాయకత్వం గురించి మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్సీ గురించి నేను మాట్లాడలేను. అది బీసీసీఐ, సెలక్టర్ల చేతిలో ఉంటుంది. అయితే అతడికి అవకాశం ఇస్తే సత్తా చాటగలడు. గతంలో నిదాహాస్ ట్రోఫీ వంటి కొన్ని ట్రోఫీలను గెలిచి చూపించాడు. అతడికి కెప్టెన్సీ ఇవ్వాలని నేను చెప్పను. కానీ అవకాశం ఇస్తే అతడేంటో నిరూపిస్తాడు. విరాట్ ఎంతో దూకుడుగా ఉంటాడు. రోహిత్ ప్రశాంతంగా జట్టును నడిపిస్తాడు’’ అని దినేశ్ లాడ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం టీమిండియా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు రోహిత్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే కోహ్లీ గైర్హాజరీలో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు హిట్‌మ్యాన్ నాయకత్వం వహించాలని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు.