close
Array ( ) 1

తాజా వార్తలు

అమేఠీలో విజయస్మృతి 

అంచెలంచెలుగా ఎదిగి...

చేనేత చీరకట్టు... పాపిట సింధూరం.. నుదుట రూపాయి కాసంత బొట్టు! ఆమె ఆహార్యం. ఆత్మాభిమానానికి నిలువెత్తు నిదర్శనం. మహిళాశక్తికి ఆమె ఓ సంకేతం. ప్రజా సమస్యలపై పోరాడేతత్వం ఆమెను సామాన్యులకు దగ్గర చేసింది. కష్టాలు, నష్టాలు, ఒడుదొడుకులు, విమర్శల జడివానలు... ఇలా ఎన్ని ఎదురైనా నిరాడంబరత్వం, సహనం, వాగ్ధాటి, చురుగ్గా స్పందించేతత్వం ఆమెకి ఆభరణాలయ్యాయి. ఇవన్నీ ఆమెను విజయానికి దగ్గర చేశాయి. మహిళాశక్తికి ప్రతిరూపంగా స్మృతి జుబిన్‌ ఇరానీని నిలబెట్టాయి. యాభై రెండేళ్ల అమేఠీ   లోక్‌సభ చరిత్రలో కాంగ్రెస్‌ ఏకఛత్రాధిపత్యానికి గండికొట్టి... ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని మట్టికరిపించిన ఆమెలో ఎన్నో ప్రత్యేకతలు. 

జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన స్మృతి ఇరానీ అసలు పేరు స్మృతి మల్హోత్రా. నిరుపేద   కుటుంబ నేపథ్యం. వ్యక్తిత్వం, చొరవతో తన గమ్యంలో ఎదురైన ముళ్లను అవలీలగా తీసి పడేసి వడివడిగా అడుగులు వేసి కేబినెట్‌ హోదాకు చేరుకుంది. కానీ ఒకప్పుడు ఆర్థిక అవసరాలకోసం ఓ చోట వెయిట్రస్‌గా చేసింది. కుటుంబం కోసం రోడ్లపై సౌందర్య ఉత్పత్తులు అమ్మేందుకు సేల్స్‌గర్ల్‌గా మారింది. సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థితికి చేరుకునే క్రమంలో ఆమె జీవితంలో ఎన్నో మలుపులు. 
స్మృతి తండ్రి పంజాబీ. తల్లి బెంగాలీ. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. దాంతో ఆ జంట కట్టుబట్టలతో బయటకు వచ్చి... దిల్లీ శివారుల్లోని ఓ పశువుల కొట్టంలో పనికి కుదిరింది. స్మృతి అక్కడే పుట్టింది. అది తెలిసి అంతా...‘అయ్యో ఆడపిల్లా... మీ బతుక్కి భారం. ఇప్పుడే చంపేయండి’ అంటూ సలహా ఇచ్చారు. తరువాత మరో ఇద్దరు ఆడపిల్లలు పుట్టినా ఆ దంపతులు...దేవుడిచ్చిన వరంగా భావించారే తప్ప ఎటువంటి ఆలోచనను దరిచేరనీయలేదు. ఇంట్లోని కష్టాలు చూస్తూ పెరిగిన స్మృతి అమ్మానాన్నలకు భారం కాకూడదనుకుంది. అందుకే పదిహేనేళ్ల వయసు నుంచే ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు చిన్న చిన్న ఉద్యోగాలు చేసేది. చదువులోనూ మంచి మార్కులు తెచ్చుకునేది. పది, ఇంటర్‌ అరవై శాతం మార్కులతో పాసైనప్పటికీ కుటుంబం గురించి ఆలోచించి దూరవిద్యలో చదువుతూనే సేల్స్‌ గర్ల్‌గా మారింది. 
మిస్‌ఇండియా పోటీలు...  మెరిసిపోయే ఛాయ, చక్కటి ఎత్తు, ఆకర్షణీయమైన రూపం, అంతులేని ఆత్మవిశ్వాసం ఉన్న స్మృతిని మిస్‌ఇండియా పోటీల్లో పాల్గొనమంటూ ఓ స్నేహితురాలు ప్రోత్సహించింది. ఇంట్లో తెలియకుండా ఆడిషన్‌కి ఫొటోలు పంపింది. ఆ పోటీలకు ఎంపికైంది. ఆ తరువాతి దశ కోసం ముంబయికి వెళ్లాలి. అయితే సుమారు రెండు లక్షల రూపాయలు కావాలి. దాంతో విరమించు కోవాలనుకుంది. చివరకు మనసు మార్చుకుని ఇంట్లో విషయం చెప్పి, ఆ డబ్బు ఇస్తే...తనని తాను నిరూపించుకుంటానంది. మొదట అంతా షాకైనా తన పట్టుదల చూసి అప్పు తెచ్చి మరీ ఇచ్చారు. తాను సంపాదించి ఆ బాకీని నెలనెలా తీరుస్తానని హామీ ఇచ్చింది. అయితే స్మృతికి మోడలింగ్‌లో గైడెన్స్‌ లేదు. ఆ రంగంలో అనుభవం లేదు. అయినా సరే ఇతర పోటీదారులకు ఏ మాత్రం తగ్గకుండా తనని తాను గ్రూమింగ్‌ చేసుకుంది. అణువణువునా ఆత్మవిశ్వాసం పెంచుకుంది. తుదిదశ వరకూ చేరుకున్న ఐదుగురిలో ఒకరిగా నిలిచిన స్మృతి పోటీల్లో కిరీటాన్ని అందుకోలేకపోయింది. ఆ అపజయమే ఆమె మొదటి విజయం. ఓ సాధారణ అమ్మాయి ఆ స్థాయికి రావడం అంటే మాటలు కాదుగా!

ఆమె మాటే... గెలుపు

మేఠీ బరిలో రాహుల్‌కి ప్రత్యర్థిగా 2014లో స్మృతిని నిల్చోబెట్టాలనుకున్నప్పుడు ‘రాహుల్‌పై మహిళ పోటీనా’ అంటూ కాంగ్రెస్‌లోనే కాదు సొంత గూట్లోనూ చెవులు కొరుక్కున్నారు. అప్పుడు ఓడిపోయింది. ఇప్పుడు ఒడుదొడుకులు దాటుకుంటూ... సార్వత్రిక సమరానికి సిద్ధమైన స్మృతి అమేఠీ ప్రజల మనసు గెలుచుకుంది. ఫోన్‌ కాల్‌ దూరంలో ప్రజలకు అందుబాటులో ఉండటం ఆమె ప్రత్యేకత. ప్రభుత్వ పాఠశాలలు, కృషి విజ్ఞాన కేంద్రాలను బలోపేతం చేసింది. అధునాతన పరికరాలతో భూసార పరీక్షలు చేయిస్తూ అన్నదాతల అభివృద్ధికి తోడ్పడింది. మహిళల్ని స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయించింది. ఇవన్నీ ఆమెను ఈ ఎన్నికల్లో గెలిపించాయి.

అప్పు తీర్చేందుకు...  రెండు లక్షల రూపాయల అప్పు తడిసిమోపెడు అయ్యింది. ముంబయిలోనే ఉండి ఉద్యోగం చేస్తానంటే ఇంట్లో వాళ్లు వద్దన్నారు. అయినా సరే బాంద్రాలోని మెక్‌డొనాల్డ్స్‌లో సేల్స్‌ గర్ల్‌గా చేరింది. దాంతోపాటు మోడలింగ్‌ అవకాశాల కోసం ప్రయత్నించేది. ఓ శానిటరీ న్యాప్‌కిన్‌ ప్రకటన చేసే అవకాశం వచ్చింది. అది మొదలు సినిమా కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా, ఆపై ఏక్తాకపూర్‌ ‘క్యోంకీ సాస్‌ బీ కబీ బహు థీ’ సీరియల్‌లో తులసీ విరాని పాత్రతో ప్రతి ఇంటికీ దగ్గరైంది. అప్పు తీర్చేసింది. క్రమంగా అవకాశాలూ వరుసకట్టాయి. అక్కడితో ఆగిపోకుండా ఉగ్రాన్య ప్రొడక్షన్స్‌ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఎన్నో సీరియల్స్‌ని నిర్మించి....కెరీర్‌లో దూసుకుపోతున్న సమయంలో జుబిన్‌ ఇరానీని పెళ్లి చేసుకుంది. స్మృతికి అబ్బాయి జోహార్‌, అమ్మాయి జోష్‌ ఉన్నారు. తీరిక లేకున్నా కుటుంబమే తన మొదటి ప్రాధాన్యం అని ఓ సగటు ఇల్లాలిగా సగర్వంగా చెబుతుంది. అంతేకాదు.. భర్త, పిల్లలతో ఆటవిడుపుగా తీసుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుని సంబరపడిపోతుంది. నిత్యం ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రాం వంటివాటిల్లో నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, ప్రతిపక్షాలపై వ్యంగాస్త్రాలు విసురుతూ, ట్రెండింగ్‌లోని విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి చూపుతుంది. స్మృతి పంజాబీ, బెంగాలీ, అస్సామీ, మరాఠీ, హిందీ, ఇంగ్లిష్‌ వంటి భాషలు అనర్గళంగా మాట్లాడగలదు. 
రాజకీయం... స్మృతి తల్లి జనసంఘ్‌ సభ్యురాలు. తాత ఆర్‌ఎస్‌ఎస్‌లో చేసేవారు. దాంతో ఆమెకూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొనేది. నటిగా, నిర్మాతగా ఉన్నప్పుడు బీజేపీలో చేరింది. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబాల్‌పై పోటీచేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ ఎన్నికల్లో ఓడిపోయినా...ఆమె ఛరిష్మా ఓటు బ్యాంకుని పెంచింది. మహారాష్ట్ర యువ విభాగానికి అధ్యక్షురాలిగా, బీజేపీ కార్యదర్శిగా, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా...ఎన్నో పదవులు ఆమెను వరించాయి. 2011లో రాజ్యసభ సభ్యురాలిగా పార్లమెంటులో అడుగుపెట్టి, 2014లో కేంద్రమంత్రిగా బాధ్యతలు అందుకుంది. ఆమెను మానవ వనరుల మంత్రిత్వ శాఖ వరించినా ఎన్నో ప్రతికూల పరిస్థితులు తప్పలేదు. ఆమె విద్యార్హతలను ప్రశ్నిస్తూ ప్రతిపక్షాలు మానవవనరుల శాఖ ఆమెకు ఇవ్వడాన్ని తప్పు పట్టినా... ఎన్ని విమర్శలు చేసినా...‘అవును అందుకే నాకు చదువు విలువ తెలుసు’ అంటూ దీటుగా సమాధానం ఇచ్చింది. హైదరాబాద్‌లోని హెచ్‌సీయూలో రోహిత్‌ వేముల ఆత్మహత్య నేపథ్యంలో పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు స్మృతిపై ఘాటైన విమర్శలు చేశాయి. పలు వివాదాలు చుట్టుముట్టడంతో జౌళి శాఖకు బదిలీ అయ్యింది. వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి అయ్యాక అదనంగా ప్రసార సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకుంది. రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌కు ఆ శాఖ బదిలీ అయ్యాక జౌళి శాఖలోనే కొనసాగింది. అయినా ఆమె ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.