
తాజా వార్తలు
‘ఆ చిన్నారులు ఉగ్రవాదులు కాదు..!’
ఆసక్తికరంగా సంజయ్ దత్ సినిమా ట్రైలర్
ముంబయి: శరణార్థ శిబిరాల్లోని చిన్నారుల భవిష్యత్తు కోసం పాటుపడుతూ సమస్యల్లో చిక్కుకున్నారు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘టర్బాజ్’. గిరీష్ మాలిక్ దర్శకత్వం వహించారు. నర్గీస్ ఫక్రీ, రాహుల్ దేవ్ కీలక పాత్రలు పోషించారు. డిసెంబరు 11న నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. శనివారం విడుదల చేసిన ట్రైలర్ చిత్రంపై అంచనాలు పెంచింది. సంజు అంకితభావం ఉన్న క్రికెట్ కోచ్గా కనిపించి, ఆకట్టుకున్నారు.
‘శరణార్థ పిల్లల కోసం నేను క్రికెట్ శిక్షణా కేంద్రాన్ని ఆరంభించాలి అనుకుంటున్నా..’ అనే డైలాగ్తో ట్రైలర్ ఆరంభమైంది. రాహుల్ దేవ్ ఉగ్రవాదుల నాయకుడుగా కనిపించారు. చిన్నారుల్ని మానవ బాంబులుగా తయారు చేసి.. సైనికుల్ని అంతం చేస్తామని బెదిరించాడు. ఇదే క్రమంలో సంజయ్ తన కుటుంబాన్ని కోల్పోతాడు. ఆ బాధ తెలిసిన వ్యక్తిగా శిబిరాల్లోని చిన్నారులకు చేరువ అవుతారు. ‘శరణార్థ శిబిరాల్లోని పిల్లలు ఉగ్రవాదులు కాదు. చెప్పాలంటే.. ఉగ్రవాదుల వల్ల నష్టపోయిన మొదటి బాధితులు’ అని సంజయ్ చెప్పారు. ట్రైలర్లో సంజయ్ ఉగ్రవాదుల వద్ద బందీగా కనిపించారు. ఇలా ఆసక్తికరంగా రూపొందిన ఈ ప్రచార చిత్రానికి యూట్యూబ్లో ఆదరణ లభిస్తోంది.