త్వరలోనే వచ్చేస్తానని..తిరిగిరాని  లోకాలకు
close

తాజా వార్తలు

Updated : 05/04/2021 08:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

త్వరలోనే వచ్చేస్తానని..తిరిగిరాని  లోకాలకు

ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో జిల్లా జవాన్‌ వీర మరణం

రౌతు జగదీష్‌ (దాచిన చిత్రం)

మరో నెల రోజుల్లో ఆ రెండిళ్లలోనూ పెళ్లి బాజాలు మార్మోగాల్సి ఉంది. ఆ యువకులు కూడా తమకు కాబోయే భార్యలు...వారితో వైవాహిక బంధం గురించి ఎన్నో కలలు కన్నారు. కానీ విధి వారిపై కన్నెర్ర జేసింది. మావోయిస్టులతో జరిగిన కాల్పుల్లో జవాన్‌ తనువు చాలించగా...రహదారి ప్రమాదంలో ఆటో ఢీకొని మరొక యువకుడు ఆదివారం ప్రాణాలొదిలాడు. తాము పెళ్లి చేసుకోబోయే అబ్బాయిల గురించి ఊహించుకున్న ఆ అమ్మాయిల కలలూ కల్లలయ్యాయి. వారి రోదనను ఆపడం ఎవరి తరమూ కావడం లేదు.

విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: ‘రెండు, మూడు రోజుల్లో వచ్చేస్తా. కంగారు పడొద్ధు. నేనిక్కడ క్షేమంగానే ఉన్నా’ అంటూ తల్లిదండ్రులకు సమాచారం అందించిన ఆ కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. విధి నిర్వహణలో జరిగిన పోరాటంలో అసువులుబాశాడు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ అటవీ ప్రాంతంలో జవాన్లకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో విజయనగరం పట్టణం గాజులరేగ ప్రాంతానికి చెందిన రౌతు జగదీష్‌(27) దుర్మరణం చెందారు. జగదీష్‌ కుటుంబం ఏళ్లుగా గాజులరేగలోనే నివాసం ఉంటోంది. వీరి పూర్వీకులు మక్కువ మండలం కంచేడువలస గ్రామానికి చెందిన వారు. దీంతో రెండు ప్రాంతాల్లోనూ విషాదఛాయలు అలముకున్నాయి.

నాన్న తెచ్చిన పుస్తకాలే చదివి: జగదీష్‌ది నిరుపేద కుటుంబం. తండ్రి సింహాచలం పట్టణంలోని ఓ పుస్తకాల దుకాణంలో పనిచేస్తున్నారు. తల్లి రమణమ్మ గృహిణి. చెల్లెలకు మూడేళ్ల కిందట వివాహమైంది. బీఎస్సీ చదివిన జగదీష్‌ ఎప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలనే తపనతో ఓవైపు చదువుతూనే మరోవైపు మైదానాల్లో పరుగులు తీసేవాడు. తండ్రి అప్పుడప్పుడూ తెచ్చిన పుస్తకాలను చదివేవాడు. ఈక్రమంలో 2014లో సీఆర్‌పీఎఫ్‌ ఉద్యోగం సాధించాడు. కుటుంబానికి అండగా, వెన్నుదన్నుగా ఉంటాడనుకుంటే ఇలా అర్ధంతరంగా వెళ్లిపోయాడని తల్లిదండ్రులు బోరుమంటున్నారు.

ఉన్నతాధికారులను రక్షించే సమయంలో: సీఆర్‌పీఎఫ్‌ కోబ్రా దళం-210 బ్యాచ్‌కు చెందిన జగదీష్‌ గతంలో పలుమార్లు కూంబింగ్‌లో పాల్గొన్నాడు. మూడు నెలల కిందట విధుల్లో పాల్గొన్నాడు. ఈక్రమంలో విధి నిర్వహణలో భాగంగా తోటి జవాన్లతో కలిసి బీజాపూర్‌లో అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ కాల్పులు జరుగుతుండగా తన ఉన్నతాధికారి వైపు, ముగ్గురు జవాన్ల వైపు మావోయిస్టులు దూసుకు వస్తూ కాల్పులు జరుపుతుండటంతో తన సహచరులను రక్షించే సమయంలో వారిని వెనక్కి నెట్టి ఎదురెళ్లాడు. దీంతో అక్కడికక్కడే వీర మరణం పొందాడు.

మే 12న వివాహం..

జగదీష్‌కు మే 12న వివాహం కావాల్సి ఉంది.పెళ్లి పనులు చూడాలని.. కుటుంబ సభ్యులు ఫోన్లు చేస్తుండగా రెండు మూడు రోజుల్లో వచ్చేస్తానని చెప్పాడు. ఇంతలోనే ఈ విషాదం నెలకొంది. అందరితో సరదాగా ఉండే జగదీష్‌కు స్నేహితులు ఎక్కువ మంది ఉన్నారు. ఖాళీగా ఉంటే సరదాగా క్రికెట్‌ ఆడేవాడు. కొంతమంది యువతతో కలిసి సేవా కార్యక్రమాలకు ఇటీవల శ్రీకారం చుట్టాడు. 49వ వార్డు డివిజన్‌ కార్పొరేటర్‌ కర్రోతు రాధామణి, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కర్రోతు నర్సింగరావు తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పార్థివదేహం సోమవారం ఉదయం చేరుకునే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని