close

తాజా వార్తలు

Updated : 30/11/2020 13:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాజకీయాలపై వీలైనంత త్వరగా నిర్ణయం: రజనీ

చెన్నై: తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశంపై సందిగ్ధత ఇంకా తొలగలేదు. ‘రజనీ మక్కళ్‌ మండ్రం’ జిల్లా కార్యదర్శులతో రజనీకాంత్‌ సోమవారం భేటీ అయ్యారు. దీంతో రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన ఉండొచ్చని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే వారికి మళ్లీ నిరాశే ఎదురైంది. కాగా.. రాజకీయ ప్రవేశంపై వీలైనంత త్వరగా తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని సమావేశం అనంతరం రజనీ ప్రకటించారు. 

స్థానిక రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఈ భేటీ జరిగింది. జిల్లా కార్యదర్శులతో కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన రజనీ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘రజనీ మక్కళ్‌ మండ్రం కార్యదర్శులు, నిర్వాహకులు వారి తరఫు నుంచి లోటుపాట్లు నాకు తెలిపారు. నా అభిప్రాయాలను కూడా వారితో పంచుకున్నాను. రాజకీయ ప్రవేశంపై ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా నిర్ణయాన్ని ప్రకటిస్తా’ అని రజనీ వెల్లడించారు. కాగా.. రజనీకాంత్‌ జనవరిలో పార్టీని ప్రకటించే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై జిల్లా కార్యదర్శుల అభిప్రాయాన్ని కోరినట్లు సమాచారాం. మరోవైపు రజనీ పార్టీని స్థాపించిన తర్వాత భాజపాతో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే దీన్ని రజనీ మక్కళ్‌ మండ్రం తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. 

రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశంపై ఇప్పటికే పలుమార్లు ప్రచారం జరిగింది. తాను రాజకీయాల్లోకి వస్తానంటూ మూడేళ్ల కిందటే ప్రకటించినా.. ఇప్పటివరకు పార్టీ ప్రారంభించలేదు. అటు క్రియాశీల రాజకీయాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. ఆరోగ్య కారణాల దృష్ట్యా రజనీ తన రాజకీయ ఆలోచన విరమించుకోవాలని వైద్యులు సూచించినట్లు ఆ మధ్య ఓ లేఖ వైరల్‌ అయిన విషయం తెలిసిందే. డయాలసిస్‌ పేషెంట్‌ అయిన రజనీకాంత్‌ ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో బయట తిరగడం అస్సలు ఆమోదయోగ్యం కాదని డాక్టర్లు చెప్పినట్లు ఆ లేఖలో ఉంది. గత నెల ఈ లేఖ సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో లేఖపై స్పందించిన రజనీ.. అది తాను రాసింది కాదని స్పష్టం చేశారు. కానీ అందులోని తన ఆరోగ్య సమాచారం నిజమేనన్నారు. అయితే సరైన సమయంలో రాజకీయ ప్రవేశంపై నిర్ణయం తీసుకుంటానని అభిమానులకు హామీ ఇచ్చారు. 

ఈ నేపథ్యంలో సోమవారం అనూహ్యంగా రజనీ మక్కళ్‌ మండ్రం జిల్లా కార్యదర్శులతో రజనీకాంత్‌ భేటీ కావడంతో మరోసారి రాజకీయ అరంగేట్రం చర్చ తెరపైకి వచ్చింది. అటు తమిళనాడు శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రజనీ ఈ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పార్టీ స్థాపనపై కీలక ప్రకటన వెలువడొచ్చని అభిమానులు భావించారు. అయితే ఈ రోజు కూడా రజనీ ఎలాంటి ప్రకటనలు చేయకపోవడం గమనార్హం. మరి తలైవా రాజకీయాల్లోకి ఎప్పుడు అడుగుపెడతారో చూడాలి..!


Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని