నేనూ కేసీఆర్‌ బాధితుడినే!

తాను కేసీఆర్‌ బాధితుడినంటూ స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు సంచలన విషయాలను వెల్లడించారు.

Updated : 09 May 2024 06:51 IST

రాజకీయ ఒత్తిళ్లతో నల్గొండ ఎస్పీ పోస్టులో నుంచి నన్ను తప్పించారు
ఐజీగా పదోన్నతి కల్పనలో ఐదు నెలలు ఆలస్యం చేశారు
దర్యాప్తు అధికారికి సహకరిస్తా.. అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయొద్దు
న్యాయస్థానంలో ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు అఫిడవిట్‌

ఈనాడు, హైదరాబాద్‌: తాను కేసీఆర్‌ బాధితుడినంటూ స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు సంచలన విషయాలను వెల్లడించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్‌రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్‌లో ఈ అంశంపై తొలిసారి స్పందించారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా నల్గొండ ఎస్పీ పోస్టు నుంచి తనను అప్పటి సీఎం కేసీఆర్‌ అనాలోచితంగా బదిలీ చేశారన్నారు. అప్పట్లో ప్రతిపక్ష నేతలకు మద్దతిస్తున్నానని తెరాస జిల్లా నేతలు చెప్పడంతో కేసీఆర్‌ ఆ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. అక్కడి నుంచి సీఐడీకి బదిలీ చేశారని.. డీఐజీ నుంచి ఐజీగా పదోన్నతి కల్పించడంలోనూ ఐదు నెలలు ఆలస్యం చేశారన్నారు. కేసీఆర్‌ సామాజికవర్గానికి చెందినందువల్లే తనను ప్రభుత్వం ఇంటెలిజెన్స్‌లోకి తీసుకున్నారనేది వాస్తవం కాదన్నారు. ఎస్‌ఐబీలో ఎస్పీగా పదేళ్లపాటు పనిచేసిన అనుభవం ఉండటంతో అప్పటి డీజీపీ సిఫారసు చేయడం వల్లే తీసుకున్నారని పేర్కొన్నారు. తాను ఎస్‌ఐబీ చీఫ్‌గా ఉన్నప్పుడు అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పర్యవేక్షణలోనే పనిచేశానని.. ప్రతి అంశాన్ని వారి దృష్టిలో ఉంచానని వెల్లడించారు. అక్కడ స్వతంత్రంగా పనిచేసే అధికారం తనకు ఉండదన్నారు. 30 ఏళ్ల సర్వీసులో ప్రతిభ కారణంగా తనకు 2012లో ప్రతిష్ఠాత్మక ఐపీఎం, 2016లో పీఎంజీ, 2019లో పీపీఎం, అసాధారణ్‌ ఆసూచన కుశలత పతకాలు లభించాయన్నారు. తనపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయాలంటూ దర్యాప్తు సంస్థ న్యాయస్థానంలో దరఖాస్తు చేయడం సరికాదన్నారు. తాను హైదరాబాద్‌లోనే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నానని.. ప్రస్తుతం అమెరికాలోని ఇల్లినోయీ పాంటియాక్‌లో ఉన్నానని.. నాలుకపై ట్యూమర్‌కు చికిత్స పూర్తయిన అనంతరం తప్పనిసరిగా దర్యాప్తు అధికారి ముందు హాజరవుతానని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థ దరఖాస్తును కొట్టివేయాలని కోరారు. ప్రభాకర్‌రావు తరఫున న్యాయవాది సురేందర్‌రావు ఈ అఫిడవిట్‌ సమర్పించారు.

జీవితాన్ని పణంగా పెట్టి పనిచేశా..

అఫిడవిట్‌లోని వివరాల మేరకు.. ‘నేను జీవితాన్ని పణంగా పెట్టి తీవ్రవాద, ఉగ్రవాద కార్యకలాపాల అణచివేత కోసం పనిచేసి వారికి లక్ష్యంగా మారా. నన్ను హిట్‌ లిస్ట్‌లో చేర్చారు. 30 ఏళ్ల సర్వీసులో మూడొంతుల కాలం ఇదే విభాగంలో పనిచేసి ఐబీ, కేంద్ర హోంశాఖ, ఇతర రాష్ట్రాల ఇంటెలిజెన్స్‌ శాఖల నుంచి, నైతిక విలువలు పాటించే విషయంలో తోటి పోలీస్‌ అధికారులు, సీనియర్ల నుంచి ప్రశంసలు పొందా. నాలుకపై ట్యూమర్‌ ఏర్పడిన కారణంగా 2004-10 మధ్య కాలంలో పలు సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. అప్పటినుంచి క్రమంతప్పకుండా వైద్యుల్ని సంప్రదిస్తున్నా. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ తర్వాత 2023 మార్చిలో గొంతు, ఊపిరితిత్తుల్లో సమస్యలొచ్చాయి. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత అమెరికా వెళ్లి పూర్తిస్థాయిలో పరీక్షలు చేయించి చికిత్స పొందాలనుకున్నా. అమెరికా పౌరుడైన నా బంధువు రంగినేని విజయ్‌ ద్వారా అక్కడ నిపుణులైన వైద్యులను సంప్రదించా. ఆహారం మింగడంలో అసౌకర్యం కలగడంతోపాటు అలసట లక్షణాలు కనిపించడంతో నా భార్యతోపాటు అమెరికా వెళ్లేందుకు గత ఫిబ్రవరి 15న టికెట్లు బుక్‌ చేసుకున్నా. జూన్‌ 26న తిరిగివచ్చేందుకు సైతం టికెట్‌ బుక్‌ చేసుకున్నా.

దర్యాప్తు అధికారులను మార్చిలోనే సంప్రదించా..

నా రాజీనామా సమర్పించిన మూడు నెలల తర్వాత అమెరికా వచ్చా. ఆ సమయంలో ఫోన్‌ ట్యాపింగ్‌ గురించి అధికారులెవరూ నన్ను సంప్రదించలేదు. కేసు నమోదైన సంగతి తెలిసిన తర్వాత దర్యాప్తు అధికారితోపాటు ఉన్నతాధికారులను సంప్రదించా. మార్చి 22, 23 తేదీల్లో దర్యాప్తు అధికారిని.. 23న హైదరాబాద్‌ కమిషనర్‌, వెస్ట్‌జోన్‌ డీసీపీలను ఫోన్‌లో సంప్రదించి దర్యాప్తునకు సహకరిస్తానని చెప్పా. కుటుంబ సభ్యులను వేధించొద్దని కోరా. అమెరికాలోని నా కాంటాక్టు నంబర్‌ను, మెయిల్‌ ఐడీని ఇచ్చా(ఇందుకు సంబంధించిన వాట్సప్‌ స్క్రీన్‌షాట్లను కోర్టుకు సమర్పించారు). కానీ, దర్యాప్తు అధికారులెవరూ కేసు గురించి నన్ను సంప్రదించలేదు. అమెరికా ప్రయాణ కారణాల గురించి ఏప్రిల్‌ 19, 24 తేదీల్లో సీఆర్పీసీ 91 సెక్షన్‌ కింద దర్యాప్తు అధికారి అడిగిన సమాచారాన్ని నా కుమారుడు నిషాంత్‌రావు అందించారు. వైద్య పరీక్షలు పూర్తయి ప్రయాణం చేయొచ్చని వైద్యులు సూచించిన వెంటనే భారత్‌కు తిరిగివస్తా’ అని అఫిడవిట్‌లో ప్రభాకర్‌రావు పేర్కొన్నారు.

ఫోన్‌ ట్యాపింగ్‌లో నా పాత్ర లేదు: శ్రవణ్‌రావు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తనపై పోలీసులు సీఆర్‌పీసీ 73 సెక్షన్‌ మోపడం సరికాదని ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్‌ పేర్కొన్నారు. తన అరెస్టుకు అనుమతివ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. ఈ మేరకు తాజాగా నాంపల్లి కోర్టులో ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. ‘‘ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో నాకెలాంటి పాత్రలేదు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. ముందస్తుగా నిర్ణయించుకున్న బిజినెస్‌ షెడ్యూలు ప్రకారం 2024 మార్చి 15న లండన్‌ వెళ్లాను. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నా సోదరి బాగోగులు చూసుకోవడానికి మా బావ వినతి మేరకు అత్యవసరంగా మార్చి 20న అమెరికాకు వెళ్లాను’’ అని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను భారత్‌కు తిరిగొచ్చేవరకూ ఫోన్‌ నంబరు ద్వారా అందుబాటులో ఉంటానని.. భారత్‌కు తిరిగొచ్చాక కేసు దర్యాప్తునకు సహకారం అందిస్తానని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు