166.. 58 బంతుల్లో ఉఫ్‌

47 నిమిషాలు.. 58 బంతులు.. 167 పరుగులు.. 0 వికెట్లు! బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ విధ్వంసమిది. ఇన్నింగ్స్‌ విరామంలో అభిమానులు స్నాక్స్‌ తెచ్చుకునేలోపే.. టీవీ సెట్ల ముందున్న ప్రేక్షకులు కాస్త బ్రేక్‌ తీసుకునేలోపే సన్‌రైజర్స్‌ లక్ష్య ఛేదన పూర్తయింది. 

Published : 09 May 2024 02:35 IST

ఉప్పల్‌లో రెచ్చిపోయిన హెడ్‌, అభిషేక్‌
సన్‌రైజర్స్‌ రికార్డు ఛేదన
లఖ్‌నవూ చిత్తుచిత్తు
ఈనాడు - హైదరాబాద్‌

47 నిమిషాలు.. 58 బంతులు.. 167 పరుగులు.. 0 వికెట్లు! బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ విధ్వంసమిది. ఇన్నింగ్స్‌ విరామంలో అభిమానులు స్నాక్స్‌ తెచ్చుకునేలోపే.. టీవీ సెట్ల ముందున్న ప్రేక్షకులు కాస్త బ్రేక్‌ తీసుకునేలోపే సన్‌రైజర్స్‌ లక్ష్య ఛేదన పూర్తయింది.  ఏదో విమానం మిస్‌ అవుతున్నట్లు.. ఈ బంతి పోతే మళ్లీ మరో బంతి దొరకదన్నట్లు.. కొట్టుడే కొట్టుడు! సన్‌రైజర్స్‌ ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (75 నాటౌట్‌; 28 బంతుల్లో 8×4, 6×6), ట్రావిస్‌ హెడ్‌ (89 నాటౌట్‌; 30 బంతుల్లో 8×4, 8×6) ఉప్పెనలా విరుచుకుపడ్డ వేళ.. ఉప్పల్‌ స్టేడియాన్ని పరుగుల వరద ముంచెత్తింది. ఒకరిని మించి మరొకరన్నట్లు.. నువ్వా నేనా అని పోటీ పడుతూ ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ సాగించిన విధ్వంసం అసామాన్యం!

న్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరోసారి దుమ్మురేపింది. ఆల్‌రౌండ్‌ ఆటతో అదరగొట్టింది. ప్రత్యర్థిని గల్లీ జట్టుగా మార్చేస్తూ మరో మ్యాచ్‌ను ఏకపక్షం చేసేసింది. బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 10 వికెట్ల తేడాతో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ను చిత్తుచేసింది. నాణ్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని సమర్థంగా కట్టడి చేసిన సన్‌రైజర్స్‌ అనంతరం విధ్వంసకర బ్యాటింగ్‌తో హోరెత్తించింది. మొదట లఖ్‌నవూ  4 వికెట్లకు 165 పరుగులే చేసింది. సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ దాడిలో విలవిలలాడిన లఖ్‌నవూకు నికోలస్‌ పూరన్‌ (48 నాటౌట్‌; 26 బంతుల్లో 6×4, 1×6), ఆయుష్‌ బదోని (55 నాటౌట్‌; 30 బంతుల్లో 9×4) ఆక్సిజన్‌ అందించారు. అనంతరం సన్‌రైజర్స్‌ 50 నిమిషాల్లోపే పని పూర్తి చేసింది. 9.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హెడ్‌, అభిషేక్‌.. లఖ్‌నవూ బౌలర్లను ఉతికి ఆరేశారు.

ఆ లక్ష్యం ఏపాటికి..: పేరుకు.. పాయింట్ల వరకే సమవుజ్జీలు. మిగతావన్నీ పూర్తిగా భిన్నం. ఒకరిది నత్తనడక బ్యాటింగ్‌. మరొకరిది రాకెట్‌ వేగం. పవర్‌ ప్లేలో ఒక జట్టు స్కోరు 27/2.. మరో జట్టు స్కోరు 107/0. ఈ రెండు పోలికలు చాలు లఖ్‌నవూ, సన్‌రైజర్స్‌ గురించి చెప్పడానికి. సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో గౌతమ్‌ వేసిన తొలి ఓవర్‌ మాత్రమే ఓపెనర్లు ప్రశాంతంగా ఆడారు. ఆ ఓవర్లో 8 పరుగులు రాబట్టిన హెడ్‌.. అభిషేక్‌ తర్వాతి 9 ఓవర్లలో వరుసగా 17, 22, 17, 23, 20, 19, 17, 14, 10 పరుగులతో ఊచకోత కోశారు. యశ్‌ ఠాకూర్‌ వేసిన రెండో ఓవర్లో 4 బౌండరీలతో విధ్వంసానికి అభిషేక్‌ శ్రీకారం చుట్టగా.. గౌతమ్‌ తర్వాతి ఓవర్లో హెడ్‌ మూడు సిక్సర్లు.. ఒక ఫోర్‌తో చెలరేగాడు. రవి బిష్ణోయ్‌ను హెడ్‌, అభిషేక్‌ చెరో వైపు నుంచి బాదేశారు. నవీనుల్‌ హక్‌ బౌలింగ్‌లో ఒక సిక్సర్‌, నాలుగు బౌండరీలతో విరుచుపడ్డ హెడ్‌ కేవలం 16 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. ఆ వెంటనే అభిషేక్‌ అందుకున్నాడు. యశ్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో రెండేసి సిక్సర్లు, బౌండరీలతో 20 పరుగులు పిండుకున్నాడు. అనంతరం బదోని బౌలింగ్‌లో సిక్సర్‌తో కేవలం 19 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. ఇటు హెడ్‌.. అటు అభిషేక్‌ లఖ్‌నవూ బౌలర్లను చెడుగుడు ఆడుకోవడంతో చూస్తుండగానే లక్ష్యం కరిగిపోయింది. యశ్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్‌లో సిక్సర్‌తో అభిషేక్‌ లాంఛనం పూర్తిచేశాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఓపెనర్లు 14 సిక్సర్లు.. 16 ఫోర్లు బాదడం విశేషం. సన్‌రైజర్స్‌ స్కోరులో 148 పరుగులు బౌండరీల ద్వారా వచ్చినవే.

పేలవ ఆరంభం: టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న లఖ్‌నవూకు సన్‌రైజర్స్‌ బౌలర్లు చుక్కలు చూపించారు. ఆరంభంలో నెమ్మదిగా ఉన్న పిచ్‌ను ఉపయోగించుకుంటూ లైన్‌ అంగ్‌ లెంగ్త్‌తో బ్యాటర్లను కట్టిపడేశారు. పేసర్‌ భువనేశ్వర్‌ బంతులను ఆడడం లఖ్‌నవూ బ్యాటర్లకు శక్తిని మించిన పనైంది. వరుసగా 3 ఓవర్లు వేసిన భువి 7 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఒత్తిడి తట్టుకోలేక డికాక్‌ (2) ఔటవగా.. స్టాయినిస్‌ (3) సైతం భువనేశ్వర్‌ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన లఖ్‌నవూ మరింత ఆత్మరక్షణలోకి వెళ్లింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మరీ నెమ్మదిగా బ్యాటింగ్‌ చేశాడు. బంతికో పరుగు చొప్పున కూడా చేయలేదు. అతడికి తోడైన కృనాల్‌ (24; 21 బంతుల్లో 2×6) కూడా నెమ్మదిగానే ఆడాడు. పవర్‌ ప్లేలో స్కోరు.. 27/2. ఉనద్కత్‌ వేసిన తొమ్మిదో ఓవర్లో కృనాల్‌ వరుసగా రెండు సిక్సర్లు బాదడంతో కాస్త ఉత్సాహం వచ్చినట్లనిపించింది. ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. కమిన్స్‌ తర్వాతి ఓవర్‌ను రాహుల్‌ బౌండరీతో మొదలుపెట్టాడు. లఖ్‌నవూ ఇన్నింగ్స్‌లో తొలి ఫోర్‌ (10వ ఓవర్‌) ఇదే కావడం గమనార్హం. అయితే అదే ఓవర్‌ చివరి బంతికి రాహుల్‌ ఔటయ్యాడు. ఆ వెంటనే కృనాల్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. అప్పటికి స్కోరు 11.2 ఓవర్లలో 66/4.

ఆదుకున్న ఆ ఇద్దరు: 13వ ఓవర్‌ తర్వాత లఖ్‌నవూ ఇన్నింగ్స్‌లో కాస్త జోరు కనిపించింది. పూరన్‌, బదోని దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించారు. బంతి బ్యాట్‌పైకి రాకపోయినా పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్‌ చేస్తూ పరుగులు రాబట్టారు. నటరాజన్‌ 14వ ఓవర్లో బదోని మూడు బౌండరీలతో సహా 17 పరుగులు సాధించాడు. అనంతరం విజయకాంత్‌ ఓవర్లో పూరన్‌ సిక్సర్‌.. బదోని ఫోర్‌ కొట్టారు. 15వ ఓవర్లో లఖ్‌నవూ 100 పరుగుల మైలురాయిని అధిగమించింది. అక్కడ్నుంచి పూరన్‌, బదోని అడపాదడపా బౌండరీలతో స్కోరును పెంచారు. ఈ క్రమంలోనే బదోని 28 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కమిన్స్‌ వేసిన 20 ఓవర్లో పూరన్‌ 4 బౌండరీలు 19 పరుగులు సాధించాడు. లఖ్‌నవూ ఇన్నింగ్స్‌లో ఇదే అత్యుత్తమ ఓవర్‌. లఖ్‌నవూ చివరి అయిదు ఓవర్లలో 63 పరుగులు రాబట్టింది.

లఖ్‌నవూ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి)  నటరాజన్‌ (బి) కమిన్స్‌ 29; డికాక్‌ (సి) నితీశ్‌ (బి) భువనేశ్వర్‌ 2; స్టాయినిస్‌ (సి) సన్విర్‌ (బి) భువనేశ్వర్‌ 3; కృనాల్‌ రనౌట్‌ 24; పూరన్‌ నాటౌట్‌ 48; బదోని నాటౌట్‌ 55; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 165; వికెట్ల పతనం: 1-13, 2-21, 3-57, 4-66; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-12-2; కమిన్స్‌ 4-0-47-1; షాబాజ్‌ అహ్మద్‌ 2-0-9-0; విజయకాంత్‌ 4-0-27-0; జైదేవ్‌ ఉనద్కత్‌ 2-0-19-0;  నటరాజన్‌ 4-0-50-0

సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ నాటౌట్‌ 75; హెడ్‌ నాటౌట్‌ 89; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (9.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 167; బౌలింగ్‌: గౌతమ్‌ 2-0-29-0; యశ్‌ ఠాకూర్‌ 2.4-0-47-0; రవి బిష్ణోయ్‌ 2-0-34-0; నవీనుల్‌ 2-0-37-0; బదోని 1-0-19-0


9.4

సన్‌రైజర్స్‌కు మ్యాచ్‌ ముగించేందుకు అవసరమైన ఓవర్లు. టీ20 చరిత్రలోనే 150కి పైగా పరుగుల ఛేదనను అత్యంత వేగంగా పూర్తిచేసిన జట్టు సన్‌రైజర్స్‌.


107

పవర్‌ప్లేలో సన్‌రైజర్స్‌ చేసిన పరుగులు. టీ20లో తొలి ఆరు ఓవర్లలో నమోదైన రెండో అత్యధిక స్కోరు ఇది. అగ్రస్థానంలోనూ సన్‌రైజర్సే (ఈ సీజన్‌లోనే దిల్లీపై 125) ఉంది.


167

సన్‌రైజర్స్‌ చేసిన పరుగులు. ప్రపంచ టీ20 క్రికెట్లో తొలి 10 ఓవర్లలో చేసిన అత్యధిక స్కోరు ఇదే.


27/2

పవర్‌ప్లేలో లఖ్‌నవూ స్కోరు. ఐపీఎల్‌ చరిత్రలో ఆ జట్టుకు ఇదే అత్యల్ప పవర్‌ప్లే స్కోరు.


13,079

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో 1000 సిక్సర్లు నమోదయేందుకు పట్టిన బంతులు. అత్యంత వేగవంతమైన రికార్డు ఈ సీజన్‌లోనే నమోదైంది. 2023లో 1000 సిక్సర్లు కొట్టేందుకు 15,390 బంతులు అవసరమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని