4.5 లక్షల వయల్స్‌ రెమ్‌డెసివిర్‌ దిగుమతి!
close

తాజా వార్తలు

Published : 30/04/2021 17:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

4.5 లక్షల వయల్స్‌ రెమ్‌డెసివిర్‌ దిగుమతి!

నేడు భారత్‌కు చేరుకోనున్న 75 వేల వయల్స్‌

దిల్లీ: కరోనా చికిత్సలో కీలకంగా భావిస్తున్న యాంటీవైరల్‌ ఔషధం రెమ్‌డెసివిర్‌ కొరత దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాలను వేధిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం దీని దిగుమతి దిశగా చర్యలు చేపట్టింది. 75 వేల వయల్స్‌ ఈరోజు రాత్రి భారత్‌కు చేరుకోనున్నట్లు కేంద్ర రసాయన, ఎరువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో 3,75,000 వయల్స్ జులై నాటికి దశలవారీగా రానున్నాయని తెలిపింది. అలాగే దేశీయంగానూ ఈ ఔషధం ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 3.8 మిలియన్‌ వయల్స్‌ నుంచి 10.3 మిలియన్‌ వయల్స్‌కు పెంచామని తెలిపింది. 

‘‘కేంద్ర ప్రభుత్వ అధీనంలోని హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌ 4,50,000 రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ దిగుమతి కోసం ఆర్డర్‌ పెట్టింది. యూఎస్‌కు చెందిన గిలీద్‌ సైన్సెన్స్‌ నుంచి 75 వేల వయల్స్‌ ఒకటి లేదా రెండు రోజుల్లో భారత్‌కు చేరుకోనున్నాయి. మరో లక్ష వయల్స్‌ మే 15 నాటికి చేరుకుంటాయి. ఈజిప్టుకు చెందిన ఇవా ఫార్మా తొలుత 10 వేలు, తర్వాత జులై వరకు ప్రతి 15 రోజులకొకసారి 50 వేల వయల్స్‌ను పంపనుంది’’ అని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ తన ప్రకటనలో పేర్కొంది. 

రెమ్‌డెసివిర్‌ కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రాల్లో దీన్ని బ్లాక్‌ మార్కెట్లో విక్రయించి దుండగులు సొమ్ము చేసుకుంటున్నారు. గత ఏడు రోజుల్లో వివిధ కంపెనీల నుంచి దేశవ్యాప్తంగా 1.373 మిలియన్‌ వయల్స్ పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఏప్రిల్‌ 11న 67,900 వయల్స్‌గా ఉన్న రోజువారీ పంపిణీ ఏప్రిల్‌ 28 నాటికి  2,09,000కి చేరుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు కేంద్రం ఇప్పటికే దీని ఎగుమతులపై ఆంక్షలు విధించింది. అలాగే ఒక వయల్‌ ధరను రూ.3,500గా నిర్ణయించింది. ఈ ఔషధం దిగుమతి సుంకాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని