
తాజా వార్తలు
యువీ ట్వీట్లో తప్పేం లేదు: యాష్
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా దిగ్గజం యువరాజ్ సింగ్ ట్వీట్ తనకేమీ తప్పుగా అనిపించలేదని సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. అతడి ట్వీట్లో ఎలాంటి తప్పుడు ఉద్దేశాలు కనిపించలేదని పేర్కొన్నాడు. కెరీర్లో చాలాకాలం అతడితో కలిసి ఆడానని వెల్లడించాడు. అతడి పట్ల తనకు అత్యున్నత గౌరవం ఉందని స్పష్టం చేశాడు. నర్మగర్భంగా తాను చేసిన ట్వీట్లపై శనివారం యాష్ వివరణ ఇచ్చాడు.
మొతేరాలో జరిగిన గులాబి టెస్టు రెండు రోజుల్లో జరిగిన సంగతి తెలిసిందే. తక్కువ సమయంలోనే మ్యాచ్ ముగియడంతో యువీ అసహనం వ్యక్తం చేశాడు. ‘మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియడం టెస్టు క్రికెట్‌కు మంచిదని చెప్పలేను! ఇలాంటి పిచ్‌లపై అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ బౌలింగ్ చేసుకుంటే 800 లేదా 1000 వికెట్లు తీసుండేవాళ్లు. ఏదేమైనా అక్షర్ పటేల్‌కు అభినందనలు. అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అశ్విన్, ఇషాంత్‌కు శుభాకాంక్షలు’ అని యువీ ట్వీట్ చేశాడు. ఇదే సమయంలో యాష్ వరుస ట్వీట్లు చేయడం కలవరం సృష్టించింది. అవి యువీని ఉద్దేశించేనని కొందరు వ్యాఖ్యానించారు.
‘నా ట్వీట్లు ప్రత్యేకంగా ఎవరో ఒకరిని ఉద్దేశించినవి కావు. నేను యువీ ట్వీట్ చూసినప్పుడు నాకేమీ అనిపించలేదు. అది చూశాక నేనేదో ఒకటి స్పందించాలని అనుకోలేదు. అది సాధారణ ట్వీట్‌లాగే కనిపించింది. అందులో నాకు తప్పేమీ కనిపించలేదు. చాలాకాలంగా నాకు యువీ తెలుసు. ఆయనను నేనెంతో గౌరవిస్తా. మనలో ఉన్న కొందరు అవతలి వ్యక్తులు ఏది చెప్పినా నమ్మేస్తారు. అలా ఎందుకు చేస్తారో నాకర్థం కాదు. ఏం జరుగుతోందనేందుకు ఇదో దృక్పథం మాత్రమే’ అని యాష్ చెప్పాడు.