close

తాజా వార్తలు

Updated : 09/02/2020 09:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

డివిడెండ్‌... భారమే ఇక!

పెట్టుబడుల నుంచి క్రమం తప్పని ఆదాయం రావాలని కోరుకునే వారికి కనిపించే మార్గం.. డివిడెండ్‌.. ప్రస్తుత నిబంధనల్లోని మినహాయింపుల ద్వారా అన్ని వర్గాల వారికీ దీని ద్వారా లభించే ఆదాయం ఎంతో ఉపకరించింది. కానీ, కొత్త బడ్జెట్‌లో ప్రతిపాదించిన పన్ను విధానం పెను భారం కానుంది.

కంపెనీల్లో షేర్లు కొన్నవారికీ.. మ్యూచువల్‌ ఫండ్లలో డివిడెండ్‌ ఆప్షన్‌ కింద మదుపు చేసిన వారికీ ఆయా సంస్థలు, ఫండ్‌ పథకాలు తమ లాభాల నుంచి కొంత పంపిణీ చేస్తుంటాయి. దీన్నే డివిడెండ్‌గా పేర్కొంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. కంపెనీలు, ఫండ్‌ సంస్థలు తాము ఆర్జించిన ఆదాయాన్ని తమ వాటాదార్లు, మదుపర్లకు పంచడం..

ఇప్పటి వరకూ..
ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం.. కంపెనీలు తాము ఇచ్చే డివిడెండ్లపై 15 శాతం పన్ను చెల్లించాలి. ఈ రేటును స్థూలంగా లెక్కిస్తే.. 17.64 శాతానికి చేరుతుంది. దీనికి సర్‌ఛార్జీ, సెస్సు అదనం. ఇలా  మొత్తంగా కలిపితే.. డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ (డీడీటీ) సుమారుగా 20.56శాతం అవుతుంది.

ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 115 బీబీడీఏ ప్రకారం వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాల చేతికి వచ్చే డివిడెండ్‌ మొత్తం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10లక్షల వరకూ ఎలాంటి పన్ను ఉండదు. దీనికి మించి డివిడెండ్‌ను పొందినప్పుడు ఆ అధిక మొత్తంపై 10శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఇక మ్యూచువల్‌ ఫండ్లు అందించే డివిడెండ్‌ మొత్తంపై ఎలాంటి పన్నూ లేదు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 10(35) ప్రకారం దీనికి పూర్తిగా మినహాయింపు వర్తిస్తుంది.

కొత్త బడ్జెట్‌ ప్రతిపాదనలతో..
ప్రభుత్వం డివిడెండ్ల విషయంలో ప్రతిపాదించిన కొత్త నిబంధన ప్రకారం చూస్తే.. సెక్షన్‌ 115-ఓ ను రద్దు చేసి, కంపెనీలు తాము ఇచ్చే డివిడెండ్ల విషయంలో ఎలాంటి పన్ను చెల్లించనవసరం లేదని బడ్జెట్‌లో పేర్కొన్నారు. కంపెనీల విషయానికి వస్తే.. వాటికి ఇది ప్రయోజనం కల్పించేదే. కానీ.. డివిడెండ్‌ పొందే వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు తదితరులు ఇకపై పన్ను చెల్లించాలని చెప్పడం మాత్రం కొంత భారంగా పరిణమించనుంది.
బడ్జెట్‌లో కనీస మినహాయింపునూ పేర్కొనలేదు. చిన్న మదుపరుల ప్రయోజనాలను కాపాడేందుకు కనీసం రూ.2లక్షల వరకూ డివిడెండ్‌ ఆదాయానికి మినహాయింపు ప్రకటిస్తే బాగుండేది.

కొత్త నిబంధనలేమిటంటే...
కొత్త నిబంధనల ప్రకారం చూస్తే.. మదుపరులకు వచ్చిన డివిడెండ్‌ ప్రతి రూపాయీ.. వారి ఆదాయంలో కలిపి చూపించాలి. దాని ప్రకారం ఆదాయాన్ని గణించి, వర్తించే శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇదే కాకుండా కంపెనీలు చెల్లించే డివిడెండ్‌ మొత్తం రూ.5,000 దాటితే 10శాతం మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌) విధిస్తారు.


 

ధనవంతులకు భారమే..
డివిడెండ్‌ను వ్యక్తిగత ఆదాయంలో కలిపి చూపించడం వల్ల అధికాదాయం ఉన్న వారికి (హెచ్‌ఎన్‌ఐ) అధిక పన్ను భారం కానుంది.. ఉదాహరణకు ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తికి రూ. కోటికి మించి ఆదాయం ఉందనుకుందాం.. అతనికి రూ.50లక్షల వరకూ డివిడెండ్‌ వచ్చిందనుకుందాం. రూ. కోటి దాటిన ఆదాయంపై 15 శాతం సర్‌ఛార్జీ చెల్లించాలి. డివిడెండ్‌పై 30 శాతం అంటే.. రూ.15 లక్షలు. దీనిపై సర్‌ఛార్జీ, సెస్సు కలిపి రూ.2.94లక్షలు అవుతుంది. అప్పుడు మొత్తం పన్ను రూ.17.94లక్షలు చెల్లించాలి. ప్రస్తుత నిబంధనల ప్రకారం రూ.4.78 లక్షలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.

పాత విధానమే మేలు..
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం... కంపెనీ రూ.50 లక్షలపై డీడీటీ 20.56 శాతం చొప్పున రూ.10.28లక్షలు చెల్లించేది. దీనికి అదనంగా డివిడెండ్‌ పొందిన వారు రూ.4.78లక్షలతో కలిపితే మొత్తం పన్ను రూ.15.02లక్షలు ఉండేది. అదే కొత్త విధానం ప్రకారం 2.92లక్షలు అదనంగా భారం కానుంది. ఇది ప్రభుత్వానికి లాభమే. కానీ, డివిడెండ్‌ పొందిన వారికి నష్టదాయకమే. రూ.2 కోట్లు-రూ.5 కోట్లు మధ్య ఆదాయం ఉన్న వారికి వర్తించే సర్‌ఛార్జీ 25 శాతం, ఆపైన ఆదాయం ఉన్నవారికి సర్‌ఛార్జి 37శాతం అవడంతో పన్ను భారం మరింత పెరుగుతుంది.


ఆదాయంతో కలిపితే..

కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తి, హిందూ అవిభాజ్య కుటుంబం తమ మొత్తం ఆదాయంతోపాటు డివిడెండ్‌నూ కలిపి చూపించాలి. అప్పుడు పన్ను వర్తించే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి మినహాయింపులు పోను పన్ను వర్తించే ఆదాయం రూ.5,00,000 ఉందనుకుందాం. అప్పుడు సెక్షన్‌ 87ఏ కింద రూ.12,500 వరకూ పన్ను రిబేటు వర్తిస్తుంది. ఇప్పటివరకూ అతనికి ఎంత మొత్తం డివిడెండ్‌ లభించినా ఇబ్బంది ఉండేది కాదు. కానీ, కొత్త చట్టం ప్రకారం డివిడెండ్‌ను ఆదాయంలో కలిపి చూపించాలి. ఇలాంటప్పుడు రూ.5,000 డివిడెండ్‌ లభించినా.. పన్ను వర్తించే ఆదాయం రూ.5లక్షలు దాటిపోతుంది. అప్పుడు రూ.12,500 రిబేటు కోల్పోవాల్సి వస్తుంది.


వేచి చూడాల్సిందే...

నెలనెలా ఆదాయం కోసం డివిడెండ్‌ ఇచ్చే షేర్లు, మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో మదుపు చేస్తున్నారు. వీరిలో ఎంతోమందికి పన్ను వర్తించే ఆదాయం ఉండదు. కాబట్టి, పన్ను చెల్లించడంలాంటివి ఉండదు. చాలామంది రిటర్నులనూ దాఖలు చేయరు. ఇప్పుడు కొత్తగా రాబోతున్న నిబంధనలతో డివిడెండ్‌ ఆదాయం రూ.5,000 దాటితే మూలం వద్ద 10శాతం పన్ను కోత ఉంటుంది. అంటే, ఇలా కోత విధించిన మొత్తాన్ని తిరిగి పొందాలంటే.. ఆర్థిక సంవత్సరం పూర్తయ్యాక రిటర్నులు విధిగా దాఖలు చేయాల్సిందే. రిఫండ్‌ వచ్చేదాకా వేచి చూడాలి. డివిడెండ్‌ పథకాలపై ఆధారపడిన వారికి ముఖ్యంగా మహిళలు, సీనియర్‌ సిటిజెన్లకు ఇది నిరాశ కల్గిస్తోంది.



 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని