close

లోక్‌సభపై నజర్‌ 

ఎన్నికలకు సిద్ధమవుతున్న తెరాస, కాంగ్రెస్‌ పార్టీలు 
గులాబీ దళం కసరత్తు ముమ్మరం 
ఈ నెలాఖరు నుంచి ప్రచారం 
పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ సమాలోచన 
పలువురు ఎంపీలతో కీలక చర్చలు 
14 నుంచి నియోజకవర్గాల్లో ఉండాలని ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన వెంటనే లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నారు. ఈ నెల నాలుగో వారంలో బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్నారు. అనంతరం ఎన్నికల ప్రచార ఢంకా మోగించనున్నారని తెలిసింది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి శని, ఆదివారాల్లో తన నివాసంలో తెరాస అధినేత సమాలోచనలు జరిపారు. ఈ నెల 13న పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్నాయి. ఆ తర్వాత ఒకటి, రెండు వారాల్లో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడవచ్చని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బడ్జెట్‌పై కసరత్తు నడుస్తోంది. ఈ నెల 18 నుంచి 20 వరకు 15వ ఆర్థిక సంఘం రాష్ట్రంలో పర్యటించనుంది. తర్వాత బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. అవి ముగిసిన వెంటనే లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తమవుతారు. 
సర్వే ఫలితాల ఆధారంగా ఎంపిక 
లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై ఆదివారం సీఎం దృష్టి సారించారు. ఇటీవల నిర్వహించిన సర్వే ఫలితాల ఆధారంగా ఆయన ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రకటించిన విధంగానే ఆయన కొన్ని స్థానాల్లో ప్రస్తుత ఎంపీలకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. నిజామాబాద్‌- కల్వకుంట్ల కవిత, ఆదిలాబాద్‌- జి.నగేశ్‌, కరీంనగర్‌- వినోద్‌కుమార్‌, భువనగిరి- బూర నర్సయ్యగౌడ్‌లకు టికెట్లు ఖాయమని తెలుస్తోంది. మిగిలిన స్థానాల్లో కొందరికి అవకాశం ఇవ్వాలని సీఎం భావిస్తున్నా అక్కడ నెలకొన్న సమీకరణాలు, ఇతర పరిణామాలేమైనా చోటు చేసుకుంటే మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంపీగా పోటీ చేయాలని భావించిన పక్షంలో మెదక్‌ను ఎంపిక చేసుకోవచ్చు. కరీంనగర్‌, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల నేతలు ఆయనను ఆహ్వానిస్తున్నారు. లేనిపక్షంలో స్థానిక నేతలే మళ్లీ బరిలో నిలుస్తారు. అక్కడి కొన్ని స్థానాల్లో బలమైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అభ్యర్థులు బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు నేతలకు అసమ్మతి సెగల కారణంగా కొత్త అభ్యర్థులు తెర మీదికి వస్తున్నారు. 
ఎవరెవరు ఎక్కడెక్కడ! 
మహబూబ్‌నగర్‌ నుంచి ప్రస్తుత ఎంపీ, లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి టికెట్‌ను ఆశిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నా సీఎంతో సాన్నిహిత్యం కారణంగా మరోసారి అవకాశం వస్తుందని నమ్ముతున్నారు. మెదక్‌, జహీరాబాద్‌ స్థానాల్లో కొత్త పేర్లు రాని పక్షంలో ప్రస్తుత ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌ బరిలో నిలుస్తారు. మహబూబాబాద్‌ నియోజకవర్గంలో ఎంపీ సీతారాం నాయక్‌కు టికెట్‌ ఇస్తామని శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ స్థానాన్ని దిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రనాయక్‌ ఆశిస్తున్నారు. సీఎం మాట ఇచ్చినందున తనకు ఢోకా లేదనే భావన సీతారాం నాయక్‌లో కనిపిస్తోంది. వరంగల్‌ స్థానం నుంచి సీనియర్‌ నేతలను బరిలో దింపాలనే ఆలోచన సీఎంకు ఉన్నట్లు తెలిసింది. అది సాధ్యం కాకపోతే ప్రస్తుత ఎంపీ పసునూరి దయాకర్‌ కొనసాగుతారు. పెద్దపల్లి స్థానంలో మాజీ ఎంపీ వివేక్‌కు మెరుగైన అవకాశాలున్నాయి. అక్కడ ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ నుంచి వ్యతిరేకత ఉన్నా ఇతర సమీకరణాల దృష్టితో సీఎం.. వివేక్‌ వైపు మొగ్గు చూపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఖమ్మంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కోరితే మళ్లీ టికెట్‌ లభిస్తుంది. అధిష్ఠానం మరో ఆలోచన చేస్తే కొత్తవారు బరిలో నిలుస్తారు. నల్గొండలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మళ్లీ ఎంపీగా పోటీ చేయడానికి విముఖంగా ఉన్నారు. దీంతో అక్కడి టికెట్‌ కోసం స్థానిక నేతలు బండా నరేందర్‌రెడ్డి, చాడా కిషన్‌రెడ్డి, చిన్నపరెడ్డి, చందర్‌రావు తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇతర పార్టీ నేత ఎవరైనా తెరాసలో చేరినా పరిగణనలోకి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. చేవెళ్ల స్థానంలో మాజీ మంత్రి మహేందర్‌రెడ్డికి మొగ్గు ఉంది. శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, మరో పార్టీ నుంచి వచ్చే మరో నేత పేరు వినిపిస్తోంది. సికింద్రాబాద్‌ స్థానం నుంచి పార్టీ నేతలు దండె విఠల్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తనయుడు, మేయరు భార్య బొంతు శ్రీదేవి మరికొందరు ఆశావహులుగా ఉన్నారు. మల్కాజ్‌గిరి స్థానానికి భారీ పోటీ ఉంది. దిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండి రమేశ్‌, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, పార్టీ నేత బండారు లక్ష్మారెడ్డిలు టికెట్‌ను ఆశిస్తున్నారు. నాగర్‌ కర్నూలు స్థానాన్ని మాజీ మంత్రి పి.రాములు, మాజీ ఎంపీ మందా జగన్నాథం ఆశిస్తున్నారు.

భారీ బహిరంగ సభతో ప్రచారం షురూ

ఖమ్మం లేదా మహబూబాబాద్‌లో భారీ బహిరంగ సభతో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించాలని కేసీఆర్‌ యోచిస్తున్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో తెరాసకు స్థానాలు, ఓట్లు తక్కువగా వచ్చాయి. ఇక్కడి నుంచే ప్రచారం ప్రారంభించడం ద్వారా ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలని భావన పార్టీ వర్గాల్లో ఉంది. ఆ తర్వాత ప్రచార సభలను కొనసాగించే వీలుంది. అభ్యర్థుల పేర్లను ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిన అనంతరం ప్రకటించాలని సీఎం ఇంతకుముందే నిర్ణయించారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలకు ప్రచారం, సమన్వయం, బాధ్యతలు ఎవరెవరికి ఇవ్వాలనే దానిమీద ఆయన కసరత్తు జరుపుతున్నట్లు తెలిసింది. శని, ఆదివారాల్లో కేసీఆర్‌ కొందరు ఎంపీలతో ఫోన్‌లలో మాట్లాడారు. ఈ నెల 13న పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్నందున వాటికి హాజరై 14వ తేదీ నుంచి నియోజకవర్గాల్లోనే ఉండాలని సూచించారు. తమ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలతో కలిసి శాసనసభ సెగ్మెంట్లలో పర్యటించాలని సూచించారు.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.